దక్కనీ సంగీత్.. ఢోల్ కే గీత్!


Tue,June 12, 2018 11:01 PM

హైదరాబాద్.. దక్కనీ సంప్రదాయాలకు నెలవు. తెలంగాణ.. సకల కళలకు, సమస్త సంప్రదాయాలకు పుట్టినిల్లుగా విలసిల్లిన ప్రాంతం. అలాంటి ఈ గడ్డ మీద ఎన్నో కళలు రాజ్యమేలాయి. ఆ కళలు సప్తఖండాలు దాటి, దేశాలు దాటి ఇక్కడ కొలువు తీరాయి. ఇక్కడి కళలు ప్రపంచ రాజ్యాల్లో విహరించి, విస్తరించాయి. కాలక్రమేణా.. కొన్ని కళలు కనుమరుగై, చరిత్ర గర్భంలో కలిసిపోయాయి. స్వరాష్ట్రమైన తెలంగాణలో నిర్లక్ష్యానికి, విస్మరణకు గురైన కళలు తిరిగి జీవం పోసుకుంటున్నాయి. వాటిలో దక్కనీ సంప్రదాయానికి చెందిన ఢోల్ కే గీత్ ఒకటి. కేవలం ముగ్గురే ముగ్గురు మహిళలు కొనసాగిస్తున్న ఆ కళ గురించి, వారి గురించి ఈ ప్రత్యేక కథనం.. ఓ ముస్లిం కుటుంబం ఇంట్లో దావత్ జరుగుతున్నది. బంధువులు, స్నేహితులు, అతిథులతో నిండిపోయింది. ఇంతలో ముగ్గురు మహిళలు అక్కడికి వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్లు రాగానే అక్కడ ఏదో హడావిడి మొదలైంది. ఒక హంగామాకు తెర లేచింది. క్షణాల్లో అందరూ ఒక చోట కూర్చున్నారు. గానా బజానా మొదలైంది. ముగ్గురు మహిళల్లో ఒకామె మద్దెల వాయిస్తూ పాట పాడుతున్నది. అటు, ఇటు రెండు వైపులా కూర్చున్న ఇద్దరు మహిళలు ఆమె పాటకు, మద్దెల దరువుకు అనుగుణంగా చప్పట్లు కొడుతూ కోరస్ పాడుతున్నారు. వీళ్లు పాడుతుంటే.. వింటున్న వాళ్ల ముఖంలో ఉన్నట్టుండి, నవ్వులు, సిగ్గులు, సంతోషాలు అన్నీ ఒకదాని వెనుక ఒకటి కలబోతగా ఆవిష్కృతమయ్యాయి. అక్కడ జరిగిన ఈ కార్యక్రమం దక్కనీ తరహాలో ఉండే సంగీత్. ఓవైపు ఉర్రూతలూగిస్తూనే.. వదిన మరదళ్లు, బావామరదళ్ల మీద చమక్కులు పేల్చే సరదా సంగీత కార్యక్రమమిది. అత్తా కోడళ్ల మధ్యే గమ్మత్తైన సంవాదాన్ని, ఆట పట్టించే అబద్ధాలను మజాక్ చేస్తూ గుర్తు చేసే పాటల ప్రోగ్రామ్. అదే.. ఢోలక్ కే గీత్.
dholak-geet
ఒకప్పుడు హైదరాబాద్ ప్రజానీకాన్ని మరో లోకంలో విహరింపజేసిన సాంస్కృతిక కార్యక్రమం. కేవలం ఈ నేలకు మాత్రమే సొంతమైన అద్భుత కళాఖండం. ప్రస్తుతం ఈ ఢోలక్ కే గీత్ హైదరాబాద్‌లో కేవలం ముగ్గురంటే ముగ్గురే మహిళలు ఆలపిస్తున్నారు. వారే.. హఫీజా బేగం, సహేరా భాను, సుల్తానా బేగం. వీరితో పాటు అబేదా బేగం కూడా ఒకప్పుడు జట్టులో ఉండేది. ఇప్పుడు పాల్గొనడం లేదు. దక్కన్ తరహాలో సాగే జానపదాల జుగల్‌బందీ ఈ ఢోలక్ కే గీత్. ఈ తరంలో ఈ దక్కన్ జానపద కళను ఆలపించే వారు ఎవరూ లేరు. ఈ ముగ్గురే ప్రస్తుతానికి. ఈ ఢోలక్ కే గీత్ మీద అధ్యయనం చేసి, అంతరిస్తున్న ఈ కళను బతికించాలని, పదిమందికి తెలియజేయాలని ప్రయత్నించింది సమీరా బేగం. అందులో భాగంగానే ఎన్నో పరిశోధనలు చేసింది. పలు ఇంగ్లిష్, హిందీ, విదేశీ పత్రికల్లో ఆర్టికల్స్ కూడా రాసింది. ఆ తర్వాత దక్కనీ, ఉర్దూ, హైదరాబాద్‌లను సబ్జెక్ట్‌గా ఎంచుకొని నడుస్తున్న రేడియో చార్మినార్ మేనేజర్ అబ్దుల్ సమద్‌కి ఈ ఢోలక్ కే గీత్ బృందాన్ని పరిచయం చేసింది సమీరా బేగం. ఆ బృందంతో అబ్దుల్ సమద్ ఒక ప్రోగ్రామ్ చేయించి దాన్ని షూట్ చేయించాడు. ఆ పాటల వీడియోలను యూట్యూబ్‌లో విడుదల చేశాడు. ఉర్దూలో హైదరాబాద్ మొత్తం ప్రసారమయ్యే రేడియో చార్మినార్ ఎఫ్‌ఎంలో ప్రసారం చేశాడు. అతి తక్కువ కాలంలోనే మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్‌లో ఢోలక్ కే గీత్ కార్యక్రమం చూసిన దేశ విదేశాల వారు స్పందించారు. ఫలితంగా యూట్యూబ్‌లో మిలియన్ల సంఖ్యలో వ్యూవ్స్ వచ్చాయి.

మామూలుగా ముస్లిం కట్టుబాట్ల ప్రకారం ఇలాంటి వాటికి కుటుంబం నుంచి పెద్దగా సపోర్ట్ లభించదు. కానీ.. వీరికి అలాంటి సమస్య లేదు. వీరి పాటలకు ఎవరూ అడ్డు చెప్పరు. పేదరికం, ఆర్థిక అవసరాలు కూడా వీరు ఈ కళను కొనసాగించడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. యూట్యూబ్‌లో ఢోలక్ కే గీత్ ప్రోగ్రామ్ చూసిన హిందీ బిగ్‌బాస్ టీం హైదరాబాద్ వచ్చి వీరి ప్రోగ్రామ్ షూట్ చేసుకొని వెళ్లారు. నామినేట్ అయ్యారు కూడా. ఒకవేళ సెలక్ట్ అయితే.. హిందీ బిగ్‌బాస్ షోలో ఢోలక్ కే గీత్ సభ్యులు సందడి చేసే అవకాశం ఉంది.

రేడియో చార్మినార్

2015లో ప్రారంభమైన రేడియో చార్మినార్ మూడు విభాగాల్లో నాన్ కమర్షియల్‌గా నడుస్తున్నది. సామాజిక నేపథ్యంలో నడిచే రేడియో చార్మినార్, ఉర్దూ, దక్కన్ సంస్కృతి, సామాజిక అంశాలు, పలు అంశాల మీద వర్క్‌షాపులు, ఉపాధి, ఆరోగ్యం, విద్య వంటి పలు ఇతర అంశాల మీద పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే పురాతన దక్కన్ సంస్కృతి, కళారూపమైన ఢోలక్ కే గీత్‌ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించాడు సమద్. అలా వారితో పాటలు పాడించి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో రేడియో చార్మినార్ వేదికగా ఢోలక్ కే గీత్ విస్తృత స్థాయిలో ప్రజల్లోకి వెళ్లింది. అప్పటికే ఈ కళారూపం గురించి తెలిసినవారు మళ్లీ గుర్తు చేసుకోవడం, తెలియని ఈ తరం వారు ఒక కొత్త సంగీతతరంగాన్ని వింటున్న అనుభూతితో ఆదరించారు. ఫలితంగా చాలా తక్కువ సమయంలోనే రేడియో చార్మినార్ ఢోలక్ కే గీత్‌ని ప్రజలకు చేరువ చేయగలిగింది.

సెలబ్రిటీలయ్యారు

ఢోలక్ కే గీత్ బృందంలోని ముగ్గురూ మహిళలే. పెద్దగా చదువుకోలేదు. కానీ.. ఎంత పెద్ద పాటైనా ఒక్కసారి వింటే రెండోసారి పాడేస్తారు. ప్రస్తుతం వీళ్లు పాడే పాటలు కూడా ఇప్పటివి కాదు. దాదాపు 50-60 సంవత్సరాల క్రితం నాటివి. హఫీజాకు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ల ఇంటిపక్కన ఉండే రిటైర్డ్ పోలీస్ ఢోలక్ వాయిస్తూ రకరకాల ఉర్దూ జానపద గీతాలు పాడేవాడు. ప్రతిరోజూ హఫీజా ఆయన దగ్గరకు వెళ్లి ఆ పాటలు వినేది. మెల్లగా వాటి మీద ఆసక్తి కలిగి నేర్పించమని అడిగింది. పాటలతో పాటు ఢోలక్ వాయించడం కూడా నేర్చుకుంది. అప్పుడు నేర్చుకున్న పాటలే హఫీజా ఇప్పుడు పాడుతూ అలరిస్తున్నది. తనతో పాటు టీంగా ఏర్పడ్డ సహేరా, సుల్తానాలకు కూడా పాటలు నేర్పించి ముగ్గురూ ఒక బృందంలా కార్యక్రమాలు చేస్తున్నారు. పలు పెండ్లిలలో, ఇతర శుభకార్యాల్లో పాటలు పాడి అలరిస్తున్నారు. కేవలం హైదరాబాద్‌లోనే కాదు.. విదేశాల్లో సైతం ప్రదర్శనలిస్తున్నారు హఫీజా టీం. ఇప్పటి వరకు హైదరాబాద్, ముంబై, ఖతర్, దోహ, అలెన్, అబుదాబీ, సౌదీ దేశాల్లో తిరిగి పలువురు ముస్లిం కుటుంబీకుల ఇండ్లలోని శుభకార్యాల్లో ఢోలక్ కే గీత్‌ని పరిచయం చేశారు. మాసాబ్‌టాంక్‌లోని ఏసీ గార్డ్స్‌లో ఉంటారు హఫీజా బేగం, సహేరా భాను, సుల్తానా బేగం. బంధువులు, ఇతర ప్రాంతాల్లో శుభకార్యాలకు వెళ్తే యూట్యూబ్‌లో మిమ్మల్ని చూశాం.. మీరు పాడిన పాటలు చాలా బాగున్నాయి. మా కోసం మళ్లీ ఒక పాట పాడరా అని అడిగి మరీ పాడించుకుంటున్నారు. సెల్ఫీలు దిగుతున్నారు. ఈ కళ చాలా పురాతనమైందే అయినప్పటికీ ఆదరించేవారు లేక, పట్టించుకునేవాళ్లు లేకపోతే ఇలాంటి ఎన్నో కళలు మరుగున పడిపోయేవి.
- ప్రవీణ్‌కుమార్ సుంకరి

dholak-geet2

మా తర్వాత పాడేవాళ్లు లేరు..

ఈ తరం సంగీతంతో కలిసి వాయించే పద్ధతులు మాకు తెల్వదు. చిన్నప్పుడు నేర్చుకొని పాడుతునన మాకు.. మధ్యలో ఎవరూ ప్రోత్సాహం ఇవ్వలేదు. అందుకే.. మా కళ కడప ఇవతలే ఉండిపోయింది. రేడియో చార్మినార్ వల్ల ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తుంది. అందరూ మమ్మల్ని పిలిచి ప్రోగ్రామ్స్ చేయించుకుంటున్నరు. మా తర్వాత ఢోలక్ కే గీత్ పాడేవాళ్లు లేరు. ఈ దక్కనీ కళారూపాన్ని కాపాడితే బాగుంటుంది. ఇప్పటి కొత్త కొత్త పద్దతుల్లో పాడడం మాకు తెలియదు. ఈ తరం పిల్లలకు నేర్పిస్తే.. ఈ కళ బతుకుతది.
- హఫీజా బేగం, ఢోలక్ కే గీత్ సింగర్

1334
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles