మాత్రలు వేసుకుంటే సమస్యలు వస్తాయా?


Tue,June 12, 2018 10:58 PM

నా వయసు 28 సంవత్సరాలు. మాకు పళ్లై 4 సంవత్సరాలైంది. ఒక పాప కూడా ఉంది. అయితే ఒక సంవత్సర కాలంగా నేను గర్భనిరోధక మాత్రలు వాడుతున్నాను. ఇవి ఎక్కువ కాలం పాటు వాడడం వల్ల దుష్ప్రభావాలు ఉంటాయని నా స్నేహితురాలు ఒకరు అంటున్నారు. ఈ మధ్య కాస్త బరువు పెరుగుతున్నట్టుగా అనుమానంగా కూడా ఉంది. మాత్రలతో బరువు పెరుగుతారా? మళ్లీ కావాలనుకున్నపుడు గర్భం దాల్చడం కష్టం అని కూడా అన్నారు. ఎక్కువ కాలం పాటు మాత్రలు వేసుకుంటే దుష్ప్రభావాలు ఉంటాయా? ఉంటే అవి ఎలాంటివి పూర్తి వివరాలు తెలుపగలరు.
-రాజేశ్వరి, మంథని

tablets
మీరు మీ పాప వయసు తెలుపలేదు. కానీ పాపకు 4 సంవత్సరాల వయసు వచ్చే వరకు తిరిగి గర్భం దాల్చకూడదన్న మీ నిర్ణయాన్ని అభినందించాలి. మీరు సంవత్సర కాలంగా మాత్రలు వాడుతున్నానని చెప్పారు. ఇప్పటి వరకు మీరు బరువు పెరిగిందీ లేనిదీ తెలుప లేదు. గర్భనిరోధక మాత్రలు వాడడం వల్ల ప్రత్యేకంగా బరువు పెరగడం జరగదు. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా అధ్యయనాలు రుజువు చేశాయి. ఒకవేళ పెరిగినా అది తాత్కాలికమే. మాత్రలు మానేసిన రెండు నెలల్లో తిరిగి మాములైపోతుంది. ఇది కూడా కొవ్వు వల్ల కాదు కేవలం శరీరంలో నీటి నిల్వలు పెరగడం వల్ల మాత్రమే. మాత్రలు వేసుకున్నా వేసుకోకపోయినా వ్యాయామం చెయ్యడం తప్పనిసరి. వ్యాయామం లేకపోతే బరువు ఎలాగూ పెరుగుతారు. ఇలా పెరిగిన బరువు కూడా మాత్రలు వాడడం వల్లే అనే అపవాదు వేస్తుంటారు చాలా మంది. కేవలం మాత్రల కారణంగా బరువు పెరగడం జరగదు. మీరు సంవత్సర కాలంగా వాడుతున్నా బరువు పెరగలేదు, ఈ మధ్య పెరిగారు. మీరు వ్యాయామం ఏమైనా చేస్తున్నారా అనే వివరాలు తెలియజేయలేదు. కచ్చితంగా వ్యాయామం చెయ్యాలి. సంవత్సర కాలంగా ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు కాబట్టి మీకు ఇక దుష్ప్రభావాలు ఉండకపోవచ్చు. కానీ, మీరు కొంచెం ఎక్కువ కాలం పాటు కుటుంబ నియంత్రణ పాటించాలని అనుకుంటే కాపర్‌టీ వంటి ఇతర తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులను అవలంబించడం మరింత సురక్షితం. ఎలాంటి కుటుంబనియంత్రణ విధానాన్ని అనుసరించినప్పటికీ తప్పనిసరిగా 6 నెలలకు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
dr-vindya

3125
Tags

More News

VIRAL NEWS