మూడు తరాల సాహిత్య వనమాలి


Wed,May 16, 2018 01:40 AM

vaddepally-krishna
పాటకు ప్రాణం పోస్తాడు.. సంగీత సరిగమలు మోగిస్తాడు.. తెరపై దృశ్యాలకు జీవం పోసి చూడచక్కని సినిమా తీస్తాడు! మూడు తరాలతో ముచ్చటగా పనిచేస్తూ.. సాహిత్య వనమాలిగా.. తెలంగాణ పరిమళాలు పండిస్తున్న అతడే డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ. కవిగా, రచయితగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటుతూ.. నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్న వడ్డేపల్లి పరిచయం మీ కోసం! వడ్డేపల్లి యువకుడు కాడు. కానీ, అంతకంటే ఎక్కువ ఉత్తేజం కనిపిస్తుంది. ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటాడు. కెరీర్ ప్రారంభంలో ఎలాంటి జిజ్ఞాసతో పనిచేశాడో ఇప్పటికీ అలాగే నిపిస్తుంటాడు. తెలంగాణ సాహిత్య పూదోటలో సుదీర్ఘకాలం పనిచేసి నేటితరానికి ఆదర్శంగా.. స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. సినారె శిష్యరికం, దాశరథి సహచర్యం.. మానేరు మమకారం వడ్డేపల్లిని అత్యధిక లలితగీతాలు రాసిన గేయ రచయితగా.. సినిమా పాటలు రాసిన సీనియర్ కవిగా తీర్చిదిద్దాయి. తాజాగా ఆయన రమణీయ రామప్ప అంటూ సంగీత, నృత్య, దృశ్య రూపకాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి.

వడ్డేపల్లి కృష్ణ సిరిసిల్లలో జన్మించాడు. హైస్కూల్ వరకు అక్కడే చదువుకున్నాడు. చిన్నప్పట్నుంచే చదువుల్లో రాణించేవాడు. ఆటల్లోనూ ఫస్ట్. నాటకాల్లో ఫస్ట్. సినీ గేయ రచయితగా, దర్శకుడిగా మారడానికి బీజం అక్కడే పడింది. ప్రతిరోజూ మానేరు తీరంలో గలగలా పారుతున్న నీటిని చూసి తన్మయత్వం పొందిన అనుభవాలు చిన్నప్పుడే అతనిని కవిత్వం రాసేలా చేశాయి. అందమైన సాయంత్రాల్లో అద్భుతమైన పదాలను ఒడిసిపట్టేలా చేశాయి. ఈ మధురమైన పరిసరాల్లో ఆడుతూ.. ఇసుక తిన్నెలలో తిరుగుతూ.. మానేరు అలల్లో ఆడుతూ.. తీరంలో ఈత కొడుతూ పెరిగిన వడ్డేపల్లి కృష్ణ వాటితో సాహిత్య ప్రక్రియ ప్రారంభించారు. చదువుకునే రోజుల్లో ప్రధానోపాధ్యాయుడు అప్పకొండమాచారి అతడి కళా జిజ్ఞాసను గుర్తించారు. చదువుతో పాటు ఆటలు.. నాటకాల పట్ల వడ్డేపల్లిని ప్రోత్సహించాడు. తల్లిదండ్రులు లక్ష్మమ్మ, లింగయ్య కూడా అతడి అభిరుచికి ఎలాంటి భంగం కలిగించలేదు.

సినారె నిర్దేశం

పాఠశాల స్థాయి నుంచే కథలు, కథానికలు, కవితలు రాస్తూ వెళ్తున్న కృష్ణ తొలిసారిగా 1964లో మొదటి సారిగా హైస్కూల్ మ్యాగజైన్ అయిన తరంగిణికి విధి లిఖితం అనే కథ రాశారు. దానితో అందరికీ పరిచయం కావడంతో 1968లో స్రవంతి మాసపత్రికకు మొట్టమొదటి గేయం రాశారు. ఈ క్రమంలో సినారెతో సాన్నిహిత్యం ఏర్పరచుకొని ఆయనకు శిష్యుడిగా మారాడు. సినారె నిర్దేశంతో మాత్రా ఛందస్సు నేర్చుకొని గేయాలు రాస్తూ వచ్చాడు. మాత్రా ఛందస్సు ఒంటబట్టడానికి తన గురువులు కనపర్తి, అనంతరాయ శర్మల సహకారం మరువలేనిదని చెప్తుంటారు వడ్డేపల్లి. తర్వాత ఆయన రాసిన ఎవడెరుగును ప్రభంజనం సృష్టించింది. ఇందులో అయన ఏమంటాడంటే.. శిథిల శిల్పాల దాగిన కథల గూర్చి ఎవడెరుగును. చితికిన బతుకుల లోపలి వెతల గూర్చి ఎవడెరుగును. మిణుకు మిణుకు మను తారల కునికిపాట్లనెవడెరుగును. విధిని గూర్చి ఎవడెరుగును? విను వీధులనెవడెగురును? అని రాశారు. దీనినే అతని తొలి గేయంగా చెప్పుకోవచ్చు. ఈ గేయం స్రవంతిలో ప్రచురితమైంది.

అక్కినేని ఫిదా

రచయిత్రి పాట విన్నాక అక్కినేని నాగేశ్వరరావు వడ్డేపల్లిని పిలిపించుకున్నాడట. 1980లో పిల్ల జమీందారులో అవకాశమిచ్చాడు. ఆ పాటే.. నీ చూపులోన విరజాజి వాన.. ఆ వానలోన నేను తడిసేనా హాయిగా ఆయన అన్నట్టుగానే ఆ పాట హిట్ సాంగ్ అయింది. తర్వాత అమృత కలశం, యుగకర్తలు, లీడర్, అందరూ అందరే, పెద్దరికం, ఏంటి బావ మరీను, భైరవ ద్వీపం, ఎక్కడికెళుతుందో మనసు, సోగ్గాడే చిన్ని నాయన, లావణ్య విత్ లవ్ బాయ్స్ చిత్రాలకు 200లకు పైగా సినీ గీతాలు.. ఆకాశవాణి, దూరదర్శన్‌లకు 1000దాకా లలిత గీతాలు రాశాడు.

తొలి లలితగీత సంపుటి

తొలి గేయంతోనే అందరి దృష్టినీ ఆకర్షించిన వడ్డేపల్లి తర్వాత లలిత గీతాలు రాశారు. 1969లో ఆయన రాసిన రెండు లలిత గీతాలు ఆకాశవాణికి ఎంపికయ్యాయి. ఆ రోజుల్లో ఆకాశవాణికి రెండు గీతాలు ఎంపిక కావడమనేది మాటలు కాదు. దీంట్లో ఒకటి.. కనరా నీ దేశం.. వినరా సందేశం. కనులు తెరిచి ఒక్కసారి కనరా ఈ దేశం.. మనసులోన మంచినెంచి వినరా సందేశం అనే గీతం చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆకాశవాణిలో ఈ మాసపు పాటగా రావడం చాలా అరుదు. అలాంటిది కృష్ణ రాసిన చాలా పాటలు ఆకాశవాణిలో ఈ మాసపు పాటలుగా వరుసగా ప్రసారం అయ్యాయి. చాలా సందర్భాల్లో గరికపాటి నరసింహారావు, జేకే భారవి వడ్డేపల్లి గీతాల గురించి ప్రస్తావించేవారట. జగతిరథం జైకొడుతూ.. ప్రగతి పథంపై పోనీ.. ప్రగతి పథం పైన జగతి పండువెన్నలై రాని పాట నెలరోజుల పాటు ప్రసారమై అందర్నీ అలరించిందని కృష్ణ చెప్తుంటారు. 1972లో కనరా నీ దేశం టైటిల్‌తో లలితగీతం సంపుటి వేశాడు. లలిత గీతాలతో తొలి సంపుటి వేసిన వ్యక్తి వడ్డేపల్లి. 1974లో అంతర్మథనం వచన కవితా సంపుటి వేసి దానిని సినారెకి అంకితమిచ్చాడు. 1976లో వెలుగు మేడ అనే తొమ్మిది గేయ నాటికల సంపుటి వేసి దానిని అక్కినేనికి అంకితమిచ్చాడు. 1978లో వసంతోదయం గేయ కథా కావ్యం రాసి దానిని దాసరికి అంకితమిచ్చాడు.

భానుమతి పిలుపు

1978లో భానుమతి నుంచి పిలుపు వచ్చింది. దాశరథిలా, సినారెలా రాస్తున్నారు.. సినిమా పాటలు రాయొచ్చు కదా అన్నారట భానుమతి. నేనొక బాణీ ఇస్తాను మంచి పాట రాయండి అని భానుమతి అంటే.. మీటర్ తెలిసినవాడిని ఏ మ్యాటర్ అయినా అందులో పొందుపర్చి ఇవ్వగలను అన్నాడట. అలా శరత్‌బాబు హీరోగా రచయిత్రి అనే సినిమాకు భానుమతి అవకాశం కల్పించారు. అంశం భగ్నప్రేమికుడి సన్నివేశం. నీవే లేని ఈ జీవితమే.. కలయై కరిగెను లే.. నాలో కలతై మిగిలెనులే పాట రాస్తే భానుమతి మెచ్చుకున్నారు.

దర్శకత్వం వైపు

నటనా అనుభవం ఉండటం వల్ల పీవీ మనోహర్‌రావు రూపొందించిన భక్తకవి పోతన, భారతీయ సంస్కృతి ఈ రెండు నాటికలకు రచన, దర్శకత్వం నిర్వహించాడు. విజయవంతంగా పదమూడు ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడంతో మంచి గుర్తింపునిచ్చింది. ఇవి చూసి రాఘవేందర్‌రావు శ్రీ గురు రాఘవేంద్ర అనే సీరియల్ రాయించుకున్నారు. అది 33 ఎపిసోడ్లుగా జెమినిలో ప్రసారం అయింది. తర్వాత సినిమాల వైపు మళ్లాడు. 2005లో హరీష్ కుమార్ నిర్మాణ సారథ్యంలో ఎక్కడికెళుతుందో మనసు అనే చిత్రానికి రచన, దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఇది సుదర్శన్ 70ఎంఎంలో విడుదలైంది. థియేటర్లు దొరక్క సమస్యలు తప్పలేదు. సినిమా బాగొచ్చింది. గోవిందుడు అందరివాడు సినిమాను చూస్తే మా కథే గుర్తుకొస్తుంది. ఈ సినిమానే స్ఫూర్తిగా తీసుకొని తీశారని చాలామంది అన్నారట కూడా. వడ్డేపల్లి సినిమా క్లాస్‌గా ఉంటే, గోవిందుడు... మాస్‌గా ఉంటుందని అంటారాయన. రాష్ట్రకవిని ఎవరూ రచించని సంగీత నృత్య రూపకాలు రాశాను. స్వదేశీయం, ఆమ్రపాలి, జయం మనదే, విశ్వ కల్యాణం, వివేకానంద విజయం, అంబేడ్కర్ మొదలైన సంగీత నృత్య రూపకాలు. కొమురం భీం నుంచి కేసీఆర్ వరకు అనేక సంఘటనలను క్రోడీకరించి 60 నిమిషాల డాన్స్ బ్యాలేగా రూపొందించాను. తాజాగా రమణీయ రామప్ప సంగీత నృత్య రూపకంగా, దృశ్య కావ్యంగా మలిచాను. ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు అందరి సీఎంలతో రాష్ట్రకవిగా పేరుపొండం నాకెంతో ఆనందాన్ని ఇస్తున్నది.

రాష్ట్రకవిని

ఎవరూ రచించని సంగీత నృత్య రూపకాలు రాశాను. స్వదేశీయం, ఆమ్రపాలి, జయం మనదే, విశ్వ కల్యాణం, వివేకానంద విజయం, అంబేడ్కర్ మొదలైన సంగీత నృత్య రూపకాలు. కొమురం భీం నుంచి కేసీఆర్ వరకు అనేక సంఘటనలను క్రోడీకరించి 60 నిమిషాల డాన్స్ బ్యాలేగా రూపొందించాను. తాజాగా రమణీయ రామప్ప సంగీత నృత్య రూపకంగా, దృశ్య కావ్యంగా మలిచాను. ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు అందరి సీఎంలతో రాష్ట్రకవిగా పేరుపొండం నాకెంతో ఆనందాన్ని ఇస్తున్నది.

బహుముఖ ప్రజ్ఞ

సినిమాకు హిట్టే క్రైటేరియా కాబట్టి థియేటర్ల సమస్యలతో హిట్టు రాలేదు. తర్వాత అవకాశాలు రాలేదు. దీంతో మళ్లీ సినీ గీతాల వైపు మళ్లాడు. పెద్దరికం చిత్రంలో పెళ్లిపాట ముద్దుల జాబిలి పెళ్లికి మబ్బుల పల్లకి తేవలెనేతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాడు. ఏఎమ్ రత్నం ప్రోత్సాహంతో, రాజ్‌కోటి సహకారంతో ఆ సినిమా ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. తర్వాత బైరవద్వీపంలో అంబా శాంభవి భద్ర రాజ గమనా అనే ైక్లెమాక్స్ పాట మంచి పేరు తీసుకొచ్చింది. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా ఆవాహం శంబో శంబో.. దాసోహం శంబో శంబో అనే పాటకు కూడా మంచి పేరొచ్చింది. 2017 అక్టోబర్‌లో మళ్లీ డైరెక్షన్‌వైపు మళ్లడం లావణ్య విత్ లవ్ బాయ్స్ సినిమాకు దర్శకత్వం వహించాడు. రాజ్యలక్ష్మీ, నర్సింలు పటేల్ ఈ సినిమాను నిర్మించారు. వారి ప్రోత్సాహంతో కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాడు. ఇందులో మన ప్రాంతాల పేరుతో మంచి ఐటమ్ సాంగ్. సిరిసిల్ల తల్లిగారు.. సిద్దిపేట అత్తగారు.. కట్టుకున్న పోరగాడు.. నప్పతట్ల నారిగాడు రాశారు. మంచి హిట్‌గా నిలిచింది. మన నేటివిటీని ప్రతిబింబించేందుకు ప్రయత్నించాడు. ఇప్పుడు కూడా థియేటర్స్ ప్రాబ్లమ్. కొత్తవాళ్లను పెట్టి కూడా అద్భుతంగా తీయగలిగారని చెప్తున్నారు. యూత్ ఎంటర్‌ట్రైనర్‌గా మలుస్తూనే మంచి సందేశం ఇచ్చారు.
vadeepally

మూడు కథలు రెడీ

సినిమా థియేటర్లు పెద్ద నిర్మాతల చేతుల్లో ఉన్నాయి. థియేటర్ల సమస్యలతో రెండు సినిమాలకూ హిట్టు రాలేదు. అది తనలాంటి ప్రతిభ గల దర్శకులపై ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు వడ్డేపల్లి. 50 శాతం కంటే ఎక్కువగా ఏ నిర్మాత థియేటర్లను లీజ్‌కు తీసుకోవడానికి వీల్లేదనే ప్రభుత్వం నిబంధనలు పెట్టాలి. సినిమా థియేటర్లలో ప్రతి చిన్న సినిమాకు ఒక షో రిజర్వ్ చేయాలి. అప్పుడే అన్ని సినిమాలు ఆడతాయి. ప్రతిభావంతులందరూ వెలుగులోకి వస్తారు అని అంటున్నారు వడ్డేపల్లి. తాను ఇప్పటికీ సినిమాలు తీయడానికి రెడీగా ఉన్నాననీ.. మూడు కథలు రెడీగా ఉన్నాయనీ.. ఒకవేళ ఎవరికైనా కథలు కావాలన్నా ఇస్తానని చెప్తున్నారు. సినిమా తీయడానికి తనకు సత్తా ఉన్నదనీ.. వయసుకు పనికి ఎలాంటి సంబంధం లేదనీ ఆయన చెప్తున్నారు.
-దాయి శ్రీశైలం

802
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles