స్వర్ణ విజేతలకు గురువు!


Wed,March 14, 2018 01:41 AM

జిమ్నాస్టిక్స్‌లో కాంస్య పతకం సాధించింది మన తెలంగాణ తేజం బుడ్డా అరుణారెడ్డి. ఆమెలో చిన్నతనంలోనే అంతటి స్ఫూర్తిని రగిలించి, ఆమె ప్రయాణానికి తొలిగురువుగా పునాది వేసింది మాత్రం కోచ్ సోమా స్వర్ణలత. దాదాపు నాలుగేండ్లకు పైగా అరుణారెడ్డికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఆమె భవిష్యత్‌ను నిర్ణయించింది స్వర్ణలత. గురువు నేర్పిన క్రమశిక్షణను, ఆటలో చెప్పిన నైపుణ్యాలను మెరుగుపర్చుకొని నేడు ఈ స్థాయిలో నిలిచింది అరుణారెడ్డి. ఒక గురువుగా తన శిష్యులను ఉన్నతస్థానంలో చూడడంలో ఉన్న ఆనందం మరెక్కడుంటుందని అంటున్నది స్వర్ణలత.తాను ఇచ్చే శిక్షణపట్ల గురువుకు ఓ స్పష్టత ఉండాలి. ఉత్తమ శిష్యులను తయారు చేసుకొనే సామర్థ్యం ఉండాలి. శిష్యుల పట్ల అవసరమైనప్పుడు కాఠిన్యం, అప్పుడప్పుడు ప్రేమను చూపించాలి. మొత్తంగా శిష్యులను ఉన్నతంగా, సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడమే గురువు లక్ష్యం. అలాంటి నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని, అహర్నిశలు కష్టపడుతూ, కుటుంబాన్ని, వృత్తిని బ్యాలెన్స్ చేస్తూ.. ఎంతోమంది శిష్యులను జాతీయ, అంతర్జాతీయ పోటీలకు పరిచయం చేసింది ఈ గురువే. ప్రపంచ జిమ్నాస్టిక్స్ పోటీల్లో మన తెలంగాణ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసిన బుడ్డా అరుణారెడ్డికి ఈమే తొలిగురువు!!
Budda-aruna-reddy
వరంగల్ పట్టణానికి చెందిన సోమా స్వర్ణలత తండ్రి ఓ టైలర్. ఆయన టైలరింగ్‌లో శిక్షణ తీసుకొనేందుకు ముంబై వెళ్లాడు. అప్పుడు జిమ్నాస్టిక్స్ చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడే తన కూతురికి జిమ్నాస్టిక్స్ నేర్పించాలనుకొన్నాడు. అలా వరంగల్ వచ్చి.. ఇంట్లోనే గడ్డితో లాన్ తయారు చేసి, దానిపై బార్‌గా కర్రను ఉంచి తానే ఇంట్లోనే జిమ్నాస్టిక్స్ శిక్షణ ఇచ్చేవాడు. అలా ఆరేండ్ల వయసులోనే తండ్రి చూపిన బాటనే తన కెరీర్‌గా ఎంచుకొని జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో తన ప్రతిభ చూపింది స్వర్ణలత. తర్వాత కోచ్‌గా జీవితాన్ని ప్రారంభించి ఎంతోమంది చాంపియన్స్‌ను తయారు చేసింది.

అరుణారెడ్డిని ఇలా గుర్తించారు!!: స్వర్ణలత జిమ్నాస్టిక్స్‌లో మంచిగా కోచింగ్ ఇస్తారని తెలిసి.. అరుణారెడ్డిని ఆరేండ్ల వయసులో ఆమె తండ్రి తీసుకొచ్చారు. అరుణారెడ్డిని చూడగానే ఆమెలోని చాంపియన్‌ను గుర్తించింది స్వర్ణలత. ఎందుకంటే అప్పటికీ తన శరీరసౌష్టవం జిమ్నాస్టిక్స్‌కు తగ్గట్లుగా ఉండడం, కష్టమైన ఎలిమెంట్స్ చెప్పినా సులువుగా చేయడంతో అరుణారెడ్డి ఏనాటికైనా చాంపియన్ అవుతుందని అనుకున్నారు స్వర్ణలత. అప్పటి నుంచి అరుణారెడ్డిపై ప్రత్యేక దృష్టిపెట్టి ఎంతో కఠినమైన శిక్షణ ఇచ్చేది. అరుణారెడ్డిలోని ప్రతిభకు తన ఆలోచనలు మేళవించి కొత్త టెక్నిక్స్ నేర్పించింది. అరుణాలోని నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉదయం మూడుగంటలు, సాయంత్రం మూడుగంటలు జిమ్నాస్టిక్స్‌లో కఠినమైన శిక్షణ ఇచ్చింది స్వర్ణలత.

కూతురుకంటే ఎక్కువ: శిక్షణ ఇచ్చేటప్పుడు ఎంత కఠినంగా ఉంటారో.. ముగిసిన తర్వాత పిల్లలపై అంత ప్రేమ చూపిస్తారు స్వర్ణలత. ఆ విషయం ఆమె దగ్గర జిమ్నాస్టిక్స్ నేర్చుకున్న పిల్లలందరికీ తెలుసు. అరుణారెడ్డిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక్కోసారి చేయి చేసుకోవాల్సి వచ్చేదట. కొన్నిసార్లు గద్ధించి చెప్పేది. ట్రైనింగ్‌లో ఎప్పుడూ పిల్లలపై ప్రేమ చూపించలేదు. అయితే స్వర్ణలత దగ్గర శిక్షణ తీసుకుంటున్నంత కాలం ఏనాడూ తనకు అరుణారెడ్డి ఎదురు చెప్పలేదట. ఆమె ఎలాంటి ఎలిమెంట్ చెప్పినా.. అరుణారెడ్డి క్షణాల్లో చేసి చూపెట్టేది. అరుణారెడ్డి చేస్తున్న ఫీట్స్ చూస్తుంటే.. స్వర్ణలతలో రోజు రోజుకూ నమ్మకం, ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యేది. అలా కొన్నాళ్ల శిక్షణ తర్వాత రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీల్లో అరుణను చాంపియన్‌గా నిలిపింది స్వర్ణలత. ఆమె ఆధ్వర్యంలో 2005లో నిర్వహించిన సబ్ జూనియర్ నేషనల్ గోల్డ్‌మెడలిస్ట్‌గా అవతరించింది అరుణారెడ్డి.

తండ్రి కష్టం మర్చిపోలేనిది: అరుణారెడ్డి తండ్రికి ఆమెను గొప్ప చాంపియన్‌గా చూడాలని కోరిక ఉండేది. అందుకు ఆయన కూడా ఎంతకష్టమైనా ఉద్యోగం అయిపోగానే కారులో పాపను స్కూల్ నుంచి తీసుకెళ్లి స్వర్ణలత దగ్గర శిక్షణ ఇప్పించేవారు. మళ్లీ ఉదయం ఐదింటికే అరుణను తయారు చేయించి, తల్లి పెట్టిన టిఫిన్, స్నాక్స్ బాక్స్‌లో తీసుకెళ్లి.. ఆరింటికల్లా శిక్షణ మొదలు పెట్టేది. జిమ్‌లోనే స్కూల్‌డ్రెస్ పెట్టుకొని శిక్షణ ముగిసిన తర్వాత అటునుంచి అటే స్కూల్‌కు వెళ్లేదట అరుణారెడ్డి. చిన్నప్పుడు అంతలా కష్టపడింది కాబట్టే ఇప్పుడు ఇంతమంచి స్థాయిలో ఉన్నదని గర్వంగా చెప్పుకుంటున్నది కోచ్ స్వర్ణలత. తనను కోచ్‌గా చూడడానికి తన తండ్రి ఎంతలా కష్టపడ్డారో.. అరుణారెడ్డి తండ్రి కూడా అంతే కష్టపడ్డారని చెబుతున్నది.
Budda-aruna-reddy1
సమస్యలు, సవాళ్లను అధిగమిస్తూ: ఆరేండ్ల వయసులో జిమ్నాస్టిక్స్ కెరీర్ మొదలు పెట్టిన దగ్గర్నుంచి.. నేటి వరకు ఎన్నో సవాళ్లను అధిగమిస్తున్నది స్వర్ణలత. పెండ్లయిన ఏడేండ్లకే భర్త ఏవీ గిరిరాజ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుంచి కుటుంబాన్ని పోషించుకుంటూ, పిల్లలను చదివించుకుంటూ.. వృత్తిపరంగా శిష్యులను ఉన్నతమార్గంలో నడిపిస్తూ.. ఎన్నో కష్టాలను అనుభవించింది. భర్త గిరిరాజ్ జిమ్నాస్టిక్స్‌లో అంతర్జాతీయ కోచ్. కలకత్తాలో వీరి ప్రేమ ప్రయాణం మొదలైంది. దాదాపు 8 యేండ్లు ప్రేమించుకున్న తర్వాత.. తల్లిదండ్రులను ఒప్పించి పెండ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కృంగిపోయింది. తర్వాత బిడ్డలను చదివిస్తూ.. వారి కోసం కష్టపడుతున్నది. కూతురికి జిమ్నాస్టిక్స్, కుమారుడికి టెన్నిస్ నేర్పిస్తున్నది.

ఇంకా కాంట్రాక్ట్ కోచ్‌గానే: 1993 నుంచి ఇప్పటి వరకూ ఇంకా కాంట్రాక్ట్ పద్ధతిలోనే కోచ్‌గా కొనసాగుతున్నది స్వర్ణలత. క్రీడల మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలను పాటిస్తూనే పలుచోట్లకు ట్రాన్స్‌ఫర్ అవుతున్నా.. పర్మినెంట్ కాక పోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కడపలో మొదటిసారి ఉద్యోగంలో చేరినప్పుడు 2,300 రూపాయలకు జాయిన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రతియేటా వేతనం పెంచుతున్నారే తప్ప.. రెగ్యులర్ చేయడం లేదు. ప్రభుత్వం తమలాంటి వారిని దృష్టిలోఉంచుకొని పర్మినెంట్ చేయాలని కోరుతున్నది.

ఎంతోమంది చాంపియన్స్..

నేను కోచ్‌గా ఎక్కడ విధులు నిర్వర్తించినా ఉదయం 6 గంటలకు కచ్చితంగా కోచింగ్‌కు హాజరుకావాల్సిందే. టైం అంటే టైమే. నేనే లేట్‌గా వస్తే.. పిల్లలు నా నుంచి క్రమశిక్షణ ఎలా నేర్చుకుంటారు అంటుంది స్వర్ణలత. మొదటి పోస్టింగ్ కడప జిల్లాలో తీసుకొని అక్కడ ఎంతోమంది విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ పోటీలకు పంపింది. అక్కడి నుంచి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో జిమ్నాస్టిక్స్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం సరూర్‌నగర్ జిమ్నాస్టిక్స్ కోచింగ్ ఇస్తున్నారు. 25 యేండ్ల కాలంలో ఎంతో విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ పోటీలకు పరిచయం చేసింది. వారిలో కొంతమందిని చాంపియన్స్‌గా తీర్చిదిద్దింది.
Tech

ఒలింపిక్స్‌లో మెడల్ సాధిస్తుంది!

అరుణారెడ్డిలో ఉన్న నైపుణ్యం, తెలవితేటలు, పనిపట్ల శ్రద్ధ ఏనాటికైనా ఆమెను ఉన్నతస్థానంలో ఉంచుతాయని అనుకొనేవాళ్లం. నేడు చూశాం కూడా. అయితే అరుణారెడ్డికి మెరుగైన శిక్షణ ఇస్తే.. కచ్చితంగా ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధిస్తుంది. అరుణారెడ్డి గురువుగా ఆ రోజుకోసం ఎదురుచూస్తున్నా. ఎనాటికైనా తనపేరు సువర్ణాక్షరాలతో లిఖిస్తుందనే నమ్మకం ఉన్నది. మనదేశంలో సరైన వనరులు లేవు కాబట్టి.. కనీసం విదేశాల్లో అయిన అరుణారెడ్డికి కోచింగ్ ఇప్పించాలి.
సోమా స్వర్ణలత, జిమ్నాస్టిక్స్ కోచ్
రవికుమార్ తోటపల్లి

643
Tags

More News

VIRAL NEWS

Featured Articles