నా సమస్యలకు పరిష్కారం చెప్పరూ..?


Wed,March 14, 2018 01:39 AM

నా వయసు 40 సంవత్సరాలు. నా సమస్యను ఎక్కడ ప్రారంభించి చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఆకలి చాలా తక్కువ. ఇక ఆకలి మొదలైందంటే మాత్రం ఆగలేను. వెంటనే ఏదైనా తినకపోతే స్పృహ తప్పుతుందేమో అనిపిస్తుంది. కాస్త తినగానే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. పొట్ట ఉబ్బరంగా మారిపోతుంది. మోషన్ కూడా ఫ్రీగా ఉండదు. ప్రతి రోజు విరేచనం అవుతుంది కానీ పూర్తిగా అయిపోయిన భావన కలుగదు. పైల్స్ ఉన్నాయేమో అని అనుమానంగా ఉంది. పొట్ట నిండా గ్యాస్ చేరి విపరీతంగా ఉబ్బిపోయి ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. అలాంటి స్థితిలో పొట్ట బరువుగా ఉండి కలిగే ఇబ్బంది మాటల్లో చెప్పలేను. తేన్పులు వస్తుంటాయి. ఆయాసంగా ఉంటుంది. నా సమస్యలకు ఆయుర్వేదంలో మంచి పరిష్కారం లభిస్తుందని స్నేహితులు అంటున్నారు. నిజమేనా? నా సమస్యలకు పరిష్కారం ఏమిటి? దయచేసి పూర్తిగా వివరించగలరు.
చిన్ని, కామారెడ్డి

Health
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీకు పైల్స్ సమస్య ఉన్నట్టు అనుమానంగా ఉంది. అందువల్లే విరేచనం కావడంలో ఆటంకం ఏర్పడుతుందేమో అనిపిస్తున్నది. ముందుగా అది నిర్ధారించడానికి పరీక్ష చెయ్యాల్సి ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కూడా ఆమ్లపిత్తంలో కనిపిస్తాయి. ఆమ్లపిత్తం ఒక వ్యాధి. ఆమ్లపిత్తం ప్రకోపించడం వల్ల ఆటోపం అనే స్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలో పొట్ట ఉబ్బిపోతుంది. ఇలా ఉబ్బడం వల్ల పొట్ట బరువు పెరుగుతుంది. ఈ స్థితిని ఆద్మానం అంటారు. ఆద్మానంలో కలిగే ఇబ్బందిని వర్ణించలేం.
ఈ సమస్యలకు కారం, మసాల, పులుపు, పచ్చళ్లు ఎక్కువగా తినడం లేదా మానసిక ఒత్తిడి కారణం కావచ్చు. ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దాని ప్రభావం జీర్ణక్రియ మీద నేరుగా ఉంటుంది. జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల అరుచి, అజీర్ణం ఇబ్బంది పెడతాయి. మలబద్దకం ఏర్పడుతుంది. మలబద్దకం వల్ల ఆమ్లపిత్తం మరింత ఎక్కువ అవుతుంది. మలబద్దకం వల్ల ఆమ్లపిత్తం, ఆమ్లపిత్తం వల్ల మలబద్దకం పెరుగుతాయి. ఈ సమస్యలన్నింటికి కారణం మలబద్దకమే. మలబద్దకం తగ్గితే ఆమ్లగుణం తగ్గుతుంది. ఈ సమస్యలకు ఆయుర్వేదంలో మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆమ్లగుణం తగ్గేందుకు మందులు వాడాల్సి ఉంటుంది. ఆహార కారణాలతో ఆమ్లగుణం పెరిగితే ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడి ఇందుకు కారణమైతే మరోరకమైన మందులు వాడాల్సి ఉంటుంది. మందులు వాడుతూ పంచకర్మల్లోని విరేచన, వస్తి కర్మలు అవసరమవుతాయి. పూర్వకర్మల్లో వస్తికర్మ తప్పకుండా చెయ్యాల్సి ఉంటుంది. చికిత్స క్రమం తప్పకుండా పూర్తిస్థాయిలో తీసుకుంటే తప్పకుండా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి.

డాక్టర్ సారంగపాణి
మెంబర్ అండ్ వైస్ చైర్మన్
సిసిఐఎం, మినిస్ట్రీ ఆఫ్ ఆయూష్
సాయి భరద్వాజ సూపర్
స్పెషాలిటీ ఆయుర్వేద
హైదరాబాద్

667
Tags

More News

VIRAL NEWS