చందమామ కక్ష్యలోకి తొలి అంతరిక్ష కేంద్రం


Wed,November 15, 2017 01:38 AM

చంద్రుని సమీపంలో తొలి ఆర్బిటింగ్ స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు అమెరికా, రష్యాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. చంద్ర ఉపరితల అన్వేషణలు, సుదూర రోదసీ పరిశోధనలకు ఇదొక ప్రారంభ ప్రదేశం కాగలదని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.
Moon-space
అమెరికా, రష్యాలకు చెందిన నాసా, రోస్కాస్మోస్ (Roscosmos) అంతరిక్ష పరిశోధనా సంస్థల నడుమ ఒక కొత్త సంచార రోదసీ కేంద్రం (స్పేస్ స్టేషన్) అభివృద్ధికి ఇటీవల ఓ ఒప్పందం కుదిరింది. భూమికి ఎంతో దూరంలో, చంద్రుని కక్ష్యలో ఇది నిరంతరం సంచరిస్తూ ఉంటుంది. చంద్ర ఉపరితల అన్వేషణకే కాక సుదూర రోదసీ అధ్యయనాలకు ఆ రెండు దేశాలతోపాటు మరిన్ని ప్రపంచ దేశాలకూ ఇదొక ప్రారంభ కేంద్రం లేదా ఓ విరామ ప్రదేశం కాగలదని పై ఏకీకృత ఒప్పంద పత్రం వెల్లడించింది. 2020 నాటికి అంగారకయానాలతోసహా సుదూర-సుదీర్ఘ అంతరిక్ష యాత్రలు (మానవ రహితం లేదా మానవ సహితం) కూడా ఊపందుకునే అవకాశం ఉన్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ తరుణంలో మూన్ ఆర్బిటింగ్ స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో ఒక గేట్‌వే పాత్ర పోషించగలదని వారు అంటున్నారు. ఐతే, ఇప్పటికిది ప్రణాళిక దశలలోనే ఉంది. దీని ఏర్పాటు తర్వాత అత్యధిక బరువుగల వ్యోమనౌకల ప్రయోగాలు భూమినుంచి కంటే అక్కడి నుంచి జరపడంతో చాలావరకు ప్రయోగ వ్యయాలు కలిసి వస్తాయని, భూవాతారణంలో ఎదురయ్యే సంక్లిష్టతలనూ నివారించుకోవచ్చునని వారు పేర్కొన్నారు. స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్‌ఎల్‌ఎస్) రాకెట్, ఆరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌లతో చంద్రుని సమీపం నుంచి పై సంస్థలు భవిష్యత్తులో పలు సుదూర రోదసీ ప్రయోగాలకు సిద్ధం కాగలవని భావిస్తున్నారు.

353
Tags

More News

VIRAL NEWS