అందాల శ్రీమతి!


Wed,September 13, 2017 01:10 AM

మొన్నటివరకూ ఆమె ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. ఇప్పుడు మిసెస్ ఇండియా గ్లోబ్ 2017..ఈ అందాల కిరీటంతో ప్రపంచస్థాయి అందగత్తెలకు పోటీ ఇవ్వనుంది.. పెళ్లయ్యాక కెరీర్ ముగిసిందనుకొనే ఆడవాళ్లకు.. ఈమె జీవితం ఒక స్ఫూర్తి.. అనుకోవాలే కానీ ఏదైనా సాధించొచ్చని నిరూపించిన.. ఈ హైదరాబాద్ ఆడపడుచు పేరు కొట్టె స్నేహారావు. డాన్స్, ఆటల్లోనూ మేటి అనిపించుకున్న ఆమె.. ఇప్పుడు ర్యాంప్‌పై కూడా వందకు వంద మార్కులు కొట్టేసింది.. మరి ఆ అందాల పోటీల గురించి.. ఆమె గురించే ఈ నీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? అని న్యాయ నిర్ణేతలు అడిగారు స్నేహని. మనస్ఫూర్తిగా చేసే పనిలో సంతోషం పొందితే చాలు. వాళ్లు సక్సెస్‌ఫుల్ పర్సన్ అవుతారు. అంతకుమించి ఒక మనిషికి సక్సెస్ ఏముంటుంది? అని చెప్పింది స్నేహ. ఈ సమాధానమే ఆమెను మిసెస్ ఇండియా గ్లోబ్ - 2017గా ప్రథమస్థానంలో నిలిచేలా చేసింది. మరో మూడు నెలల్లో మిసెస్ గ్లోబ్ కిరీటం కోసం పోటీ పడేందుకు ఆమెలో ఆత్మైస్థెర్యాన్ని నింపింది.
MrsIndia

పదహారు మంది అందగత్తెలు..

ఐదు రోజుల పాటు పోటీలు.. ఒక్కో రోజు ఒక్కోలా పోటీ అందులో ఎంపిక అయిన వాళ్లనే గ్రాండ్ ఫైనల్‌కి ఎంపిక చేస్తారు. ఈ ఐదు రోజుల్లో బాడీ ఫిట్‌నెస్, అప్పియరెన్స్ ఇలాంటివన్నీ తీసుకుంటారు. అన్ని అడ్డంకులను దాటుకొని స్నేహారావు చివరి అంకానికి చేరుకుంది. ఈ పోటీల్లో ఉత్తర భారతదేశం నుంచి 14 మంది పాల్గొన్నారు. ఇందులో నుంచి ఇద్దరు మాత్రమే దక్షిణ భారతదేశం నుంచి బరిలో ఉన్నారు. ఆ ఇద్దరిలో తెలంగాణ నుంచి ఉన్నది కొట్టె స్నేహారావు ఒక్కరే! రాజస్థాన్‌లోని జైపూర్ ఈ అందాల పోటీలకు వేదికైంది. ఫైనల్ రౌండ్‌కి ఏడుగురు ఎంపికయ్యారు. అందులో స్నేహ చెప్పిన సమాధానాన్ని మెచ్చి ఆమెకు మిసెస్ ఇండియా గ్లోబ్ - 2017 టైటిల్‌ను ఇచ్చారు.

తొలి అడుగులు..

ఫ్యాషన్ రంగం అంటే చాలామందికి చిన్నచూపు. చదువు వద్దనుకున్న వాళ్లే ఈ రంగంలోకి అడుగుపెడుతారని చాలామంది అభిప్రాయం. ఇంటర్ అయ్యాక ఫ్యాషన్ డిజైనింగ్‌లో చేరాలనుకుంది స్నేహ. కానీ తండ్రికి అది నచ్చలేదు. డిజైనింగ్ కావాలంటే ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. జీవితంలో స్థిరపడాలంటే ఐటీ రంగం ఎంచుకోవడం మంచిదిఅని సూచించారు. ఆ మాటలకు స్నేహ తలొగ్గింది. తండ్రి చెప్పినట్టుగానే ఐటీ రంగంలో అడుగుపెట్టింది. ఇంజినీరింగ్ పూర్తయ్యే సమయంలో క్యాంపస్ సెలెక్షన్స్ అయ్యాయి. అందులో చెన్నై ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం. అక్కడ ఉద్యోగం చేస్తున్నా ఏదో వెలితి. కాకపోతే కంపెనీలో కొన్ని కాంపిటీషన్‌లు జరిగేవి. అప్పుడు మొదటిసారిగా ర్యాంప్ పై నడిచింది. దాంతో కొన్ని మోడలింగ్ అవకాశాలు కూడా ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. కొన్ని కంపెనీలకు మోడలింగ్ చేసింది. అప్పుడే అనుకోని బ్రేక్ పడింది.

మిస్ ఇండియా కావాలని..

అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం ఎలా అవుతుంది? స్నేహ డిజైనర్ కావాలని అనుకున్నది. కానీ ఐటీ కెరీర్ ఆమెను తొక్కి పెట్టేసింది. ఆ సమయంలోనే మోడలింగ్ చాన్స్ ఆమెలో కొత్త ఆశలు చిగురించేలా చేసింది. కానీ అప్పుడే ఆమెకు చెన్నై నుంచి హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్ అయింది. ఇక్కడికి వచ్చాక కాంటాక్ట్‌లు లేవు. మోడలింగ్ చేయాలన్న ఆలోచన కూడా తగ్గిపోయింది. అదే సమయంలో ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒత్తిడి. అప్పుడే ఫెమినా మిస్ ఇండియా పోటీలకు ఆడిషన్స్ దగ్గర పడుతున్నాయి. వాటికి ఎలాగైనా వెళ్లాలనుకుంది. కానీ ఆమె ప్రేమించిన వ్యక్తితో పెద్దలు పెళ్లికి ఒప్పుకొన్నారు. దాంతో మిస్ ఇండియా ఆశలు ఆవిరయ్యాయి. పెళ్లి జరిగిపోయింది. ఇక ఎప్పటికీ అందాల పోటీల్లో పాల్గొనలేమోననుకుంది. అప్పుడే మిసెస్ ఇండియా పోటీలు జరుగుతాయని తెలిసి వాటికి ట్రై చేస్తానని భర్తతో చెప్పింది. ఆయన ఓకే అనడంతో ఇదిగో ఇప్పుడు టైటిల్ విన్నర్ అయ్యింది.
Mrs.IndiaV

చదువుల్లో మేటి..

స్నేహ పుట్టింది సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం బీడీఎల్ భానూర్ టౌన్‌షిప్. తండ్రి ప్రభాకర్‌రావు బీడీఎల్ ఉద్యోగి. పదవ తరగతి వరకు బీడీఎల్‌లోనే చదువుకుంది. ముందు నుంచి కూడా స్నేహ చదువులో మెరిట్. నారాయణమ్మ కాలేజ్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. కేవలం చదువు మాత్రమే కాదు.. సంవత్సరం పాటు కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంది. పదవ తరగతి వరకు టేబుల్ టెన్నిస్ ఆడేది. జిల్లా స్థాయి పోటీల వరకు పాల్గొని మెడల్స్ సాధించింది. కాకపోతే వాటి వల్ల చదువు మీద శ్రద్ధ తగ్గుతుందని భావించి వాటికి అక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టించారు తల్లిదండ్రులు. ఐశ్వర్యరాయ్, సుస్మితాసేన్‌లాంటి అందగత్తెలు మన దేశాన్ని గర్వించే స్థాయికి తీసుకెళ్లారు. వాళ్లలా తాను కూడా ఏదో ఒకరోజు దేశం గర్వించే స్థాయికి ఎదుగాలని కల ఈరోజు అందులో మొదటి అడుగు పూర్తి చేసింది.

అందరి సహకారంతో..

నేను మొదటిసారి పాల్గొన్నప్పుడు నాకు స్పాన్సర్స్‌లేరు. దానివల్ల చాలా ఇబ్బంది ఈసారి కూడా ఇంకా స్పాన్సర్లు దొరుకలేదు. ఒకవేళ దొరికినా, దొరక్కపోయినా నేను పోటీల్లో పాల్గొనడం మాత్రం కచ్చితం. నేను ఈ కిరీటాన్ని గెలుచుకోవడానికి ప్రధాన కారణం మా కుటుంబ సభ్యులు. ముఖ్యంగా నా భర్త. ఆయనే కనుక నన్ను వెళ్లమనకపోతే నేను ఈ పోటీల్లో పాల్గొనేదాన్నే కాదేమో! ఆయన నాకెంతో సహకారం అందించారు. కాకపోతే ఆ కిరీటాన్ని అందుకున్నప్పుడు నాతో నా కుటుంబసభ్యులు ఎవరూ లేరు. అదొక్కటే నాకు చిన్న వెలితిలాగా అనిపించింది. ఇక నేను ఇప్పుడు పనిచేసే కంపెనీ ఓపెన్ టెక్ట్స్. ఈ టైటిల్ గెలుచుకోవడంలో మా కంపెనీ సహకారం కూడా ఎంతో ఉంది. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మిసెస్ గ్లోబ్ గెలుపొందితే వచ్చే డబ్బులతో అనాథ పిల్లలకు అండగా నిలువాలనుకుంటున్నా. అలాగే ఆడవాళ్ల ఆత్మరక్షణ శిక్షణ సెంటర్ ఒకటి ఓపెన్ చేయాలని ఆలోచిస్తున్నా అని చెప్పింది స్నేహ.

టైటిల్ కష్టాలు..

Mrs.India
పెళ్లయ్యాక కొన్ని కొన్ని మానేయాలి.. పెళ్లయితే ఇలాగే ఉండాలి.. ఇలాంటి ఎన్నో మాటలు విన్నది. కానీ కుటుంబ సహకారం ఆమెను ముందుకు నడిచేలా చేసింది. కాకపోతే పోటీల్లో పాల్గొనాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ పోటీల్లో పాల్గొనాలంటే.. లాంగ్ ఫ్రాక్స్, లెహంగాలు కొనాలి. ర్యాంప్ పై మెరువాలంటే చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. స్నేహది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందుకే కనీసం ఆ బట్టలను అద్దెకు తీసుకొని అయినా పోటీలో పాల్గొనాలనుకుంది. ఎంతోమంది డిజైనర్‌లని కలిసింది. అందరూ సెలబ్రిటీలకయితేనే అద్దెకిస్తామని చెప్పారు. లేదా కొనాల్సిందేనని ఖరాకండిగా తేల్చేశారు. అందుకే ఆమే డిజైనర్ అవతారం ఎత్తింది. ఆమెకు గూగుల్ సహకారనందించింది. తనకు నచ్చిన రెండు రకాల మెటీరియల్స్ తీసుకుంది. ఒక మామూలు బొటిక్‌కి వెళ్లి కొలతలు ఇచ్చి డిజైన్ చూపించి కుట్టుమని చెప్పింది. ఆ గౌన్ రౌండే ఆమెను మరింత స్పెషల్‌గా నిలబెట్టింది.

553
Tags

More News

VIRAL NEWS