ఒడిదుడుకులదే పైచేయి..


Sat,January 12, 2019 12:38 AM

market-volatility
కొత్త సంవత్సరం వచ్చేసింది. గతేడాది తీపి గుర్తులు, చేదు అనుభవాల మధ్య కోటి ఆశలతో నూతన ఏడాదిలోకి అడుగు పెట్టాం. అయితే స్టాక్ మార్కెట్ మదుపరులకు మాత్రం గతేడాది.. నిరాశాజనక ఫలితాలనే అందించింది. ఒక్క భారతీయ స్టాక్ మార్కెట్లే కాదు.. ప్రపంచ స్టాక్ మార్కెట్లలోనే నిరుడు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులు మదుపరుల ఓర్పును, సహనాన్నేగాక పట్టుదలనూ పరీక్షించాయి. ఏడాది ఆరంభంలో వచ్చిన అనేక అంచనాలు, ఊహాగానాలను మార్కెట్ తలకిందులు చేసింది. ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలు బ్రాడర్ ఇండెక్స్‌ను ప్రతిబింబించలేకపోయాయి. దీనివల్ల చాలామంది చాలా రకాలుగా నష్టపోయారు. నిజానికి 2018 ప్రారంభంలోనే మేము దేశీయ స్టాక్ మార్కెట్ల హై వాల్యుయేషన్ల గురించి హెచ్చరించాం. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల కదలికలు, అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య యుద్ధాల వల్ల రాబోయే అనుకూల, అననుకూల పరిణామాల్ని అంచనా వేశాం. ఆయా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ప్రభావాన్నీ తెలియజేశాం. కానీ వీటికి భిన్నంగా స్టాక్ మార్కెట్ల నుంచి ఫలితాలు వచ్చాయి.


వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ప్రభావం అన్నింటా పెరిగిపోయింది. అదీగాక ఎన్నో అనూహ్య పరిణామాలు మార్కెట్ పోకడను ప్రస్ఫుటంగా శాసించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనల్ని సృష్టించగా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ బయటకు రావడానికి సంబంధించిన అంశాలూ విశ్వ మార్కెట్లను కుదిపేయగా, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణ సంక్షోభం దేశీయ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) ఇబ్బందులకు దారితీసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)-కేంద్ర ప్రభుత్వం మధ్య విభేదాలు, తదనంతర పరిణామాల మధ్య గవర్నర్ ఊర్జిత్ పటేల్ అనూహ్య రాజీనామా కూడా మార్కెట్లను పెద్ద ఎత్తునే ప్రభావితం చేసింది. ఆర్బీఐ స్వతంత్రతకే ముప్పు వాటిల్లేలా మోదీ సర్కారు కుట్ర చేస్తుందన్న వాదనలు మదుపరుల పెట్టుబడులను తాకాయి. దీంతో ఒడిదుడుకులు తప్పలేదు. అమ్మకాల ఒత్తిడి, కొనుగోళ్ల మద్దతుకు మధ్య సూచీలు పడుతూలేస్తూ పయనించాయి. ఫలితంగా మదుపరుల్లో ఒకింత అలజడే నెలకొన్నది.


స్థూలంగా చెప్పాలంటే 2018 మదుపరులకు గొప్ప అనుభవాల్నే ఇచ్చింది. ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలపై సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని కల్పించింది. తద్వారా తమ ప్రాధాన్యతలను మరోసారి ఎంచుకోవాలని సూచించింది. తమకు సరిపోయే పోర్ట్‌ఫోలియోలను ఎంచుకోవాలనే చాటిచెప్పింది. కాబట్టి 2019లో ఈ అనుభవాలను మూల్యంకనం చేసుకుని పెట్టుబడులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరమైతే ఉన్నది. ఇక దేశంలో లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో నడుస్తున్నది. అమెరికా దేశాధినేత ట్రంప్ దూకుడు, బ్రెగ్జిట్ సంక్షోభం ఉండనే ఉన్నాయి. వీటికితోడు ముడి చమురు ఉత్పాదక దేశాలు తమ ఉత్పత్తిని తగ్గించడంతో మార్కెట్‌లో మళ్లీ క్రూడాయిల్ ధరలు విజృంభిస్తున్నాయి. దిగుమతులపైనే ఆధారపడ్డ భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద దెబ్బే. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లను నిర్దేశించగలిగిన అంశాలు ఇప్పటివరకైతే ఇవే. వీటిని దృష్టిలో పెట్టుకుని మదుపరులు తమ పెట్టుబడుల ప్రణాళికను రూపొందించుకోవడం ఉత్తమం. ఈ ఏడాది లాభదాయకంగా ముగియాలని ఆశిద్దాం.
naresh

396
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles