పన్ను ప్రణాళిక అనుభవాల నుంచి నేర్చుకుందాం


Sat,January 5, 2019 01:17 AM

Tax-Planning
ఇతరుల నుంచి నేర్చుకోగలిగిన అవకాశం ఉన్నప్పుడు చేసిన తప్పులను మనం పునరావృతం చేయకుండా ఉండగలం. పన్ను ప్రణాళికను రూపొందించుకోవడంలో అనేక మంది తప్పులు సహజంగా చేస్తుంటారు. ఎదుటివారి తప్పుల నుంచి నేర్చుకోవడం ద్వారా మన ప్రణాళికను పకడ్బందీగా రూపొందించుకోవచ్చు. పన్ను ప్రణాళికను సమర్థవంతంగా నిర్వహించుకోగల పద్ధతులను తెలుసుకోవచ్చు. ఈకాలం యువతలో 91 శాతం మంది తమ ఫైనాన్షియల్ ప్లానింగ్ తామే నిర్వహించుకుంటున్నారు. మీరంతగా మీరు ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకోగల శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటే గొప్పే. డబ్బుకు సంబంధించి కొన్ని తెలివైన నిర్ణయాలు తీసుకోవడమే ఆర్థిక ప్రణాళిక కాదు. పన్ను ప్రణాళిక, పన్ను ముందుగా చెల్లించడం, పన్ను ఎంత చెల్లించాలో లెక్కించుకోవడం వంటి అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలి. ఇందుకు పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ సహాయం అవసరం. ఒక్కో సారి మన పెద్దలు చేసిన పొరపాట్లనే మనమూ చేస్తుంటాం. అలాంటి పొరపాట్లను చేయకుండా ఉండేందుకు అనుసరించాల్సి పద్దతులేమిటో ఇప్పుడు చూద్దాం...

పన్ను ఎంత కట్టాలో తెలుసుకోవడం

మీ మొత్తం ఆదాయంపైన పన్ను చెల్లించాల్సి ఉంటుంది. చాలా మందికి కేవలం వేతన ఆదాయంపైనే పన్ను చెల్లించాల్సి వస్తుందనుకుంటారు. మీకు ఇతర ఆదాయాలు కూడా ఉండవచ్చు. అవి ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద వడ్డీ రూ పంలో, మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో లాభాలు, అద్దె, ఇతర మార్గాల ద్వారా మీకు ఆదాయం సమకూరవచ్చు. ఇలాగా వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కలిపి పన్ను ఎంత చెల్లించాల్సో లెక్కించుకోవాలి. అందుకు తగ్గట్టుగా ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది.

జీవిత బీమా అవసరం

పన్ను ఆదా కోసమే జీవిత బీమాను తీసుకోవడం చాలా మంది ఆనవాయితీగా చేస్తుంటారు. ఆదాయ పన్ను చట్టంలోని 80 సీ కింద పన్ను మినహాయింపు లభించినప్పటికీ అదే సెక్షన్ కింద మిగతా ఇన్వెస్ట్‌మెంట్లకు కూడా పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ సెక్షన్ కింద లక్షన్నర రూపాయల వరకూ మినహాయింపును పొందవచ్చు. ఇప్పటికే మీకు సరిపోను బీమా కవరేజి ఉంటే కొత్తగా పాలసీని తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే, ఈ సెక్షన్ కింద మినహాయింపులు లభించే సాధనాల్లో మదుపు చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. అందుకే బీమా పాలసీని తీసుకునే ముందు ఈ విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరమా? లేదా? ఆలోచించి సరైన పాలసీని ఎంచుకోవాలి.

పన్ను ఆదా కోసం తొందరపాటు నిర్ణయాలు వద్దు

పన్ను ఆదా చేయడం కోసం అనేక సాధనాలున్నాయి. వీటిలో చాలా వరకూ మీ సహ ఉద్యోగి, మీ బ్యాంక్ మేనేజర్, మీ పొరుగువారు ఇలా తెలిసిన వాళ్లే ఇదో బెస్ట్ టాక్స్ సేవర్ అంటూ వివిధ సాధానాలను సూచిస్తుంటారు. అయితే, మీరు వాటిలో మదుపు చేయడానికి ముందు వాటి గురించి తెలుసుకోండి. పరిశీలన చేయండి. మిగతా ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల గురించి ఆన్‌లైన్‌లో పోల్చి చూడండి. వాటి మంచీ చెడులను బేరీజు వేయండి. అయినా సరే వాటి గురించి ఒక అవగాహనకు రాలేకపోతే పర్సనల్ ఫైనాన్స్ నిపుణులను సంప్రదించండి. మార్కెట్ సాధనాలను అధ్యయనం చేయడంలో వారికున్న అనుభవంతో మీకు రిస్క్, ఆర్థిక స్థితిగతులను బట్టి స్పల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా సరిపోయే విధంగా పన్ను ప్రణాళికను అందిస్తారు.

ఎవరి మీదా అధారపడొద్దు

మీ సొంత ఆరోగ్య బీమా కోసం మీరే మంచి హెల్త్ పాలసీని ఎంచుకోండి. ఇతరుల ఆర్థిక సహాయం కోసం ఎదురుచూడకండి. సాధారణంగా తల్లిదండ్రులు తీసుకునే పాలసీపైనే ఈ కాలం యువత ఎక్కవుగా ఆధారపడుతున్నారు. లేదా పనిచేస్తున్న కంపెనీ వారు ఇచ్చే గ్రూపు ఇన్సూరెన్స్ పాలసీపై ఆధారపడుతున్నారు. నిజానికి ఇందులో సమగ్రమైన హెల్త్ కవరేజి ఉండదు. మీరు సొంతంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఆదాయపు పన్ను సెక్షన్ 80 డి కింద రూ. 25,000 వరకూ మినహాయింపును పొందవచ్చు. 60 సంవత్సరాల లోపు ఉన్న తల్లిదండ్రులకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియంను చెల్లిస్తున్నట్టయితే మరో రూ. 25వేల వరకూ పన్ను మినహాయింపు పొందే వీలుంటుంది. ఒకవేళ వారు 60 ఏండ్లకు పైబడి ఉంటే రూ. 50,000 వరకూ పన్ను మినహాయింపును పొందవచ్చు.

మెచ్యూరిటీ రాబడి ఎంత?

పన్ను ఆదా చేయడం కోసం ఎలాంటి సాధనం అయినా సరే చివరికి అవి మెచ్యూరిటీ సమయంలో ఎంత రాబడిని ఇస్తున్నాయనేది ముఖ్యం. ఏ ఇన్వెస్ట్‌మెంట్ మీదనైనా సరే పన్నుపోను ఎంత రాబడి వస్తుందనేది ముఖ్యం. అలాగే ద్రవ్యోల్బణాన్ని కూడా తీసేస్తే వచ్చే అసలు రాబడి ఎంత అనేది చూడాలి. అన్ని ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలను ఒకే మాదిరిగా అంచనా వేయలేం. ఉదాహరణకు పీపీఎఫ్ అకౌంట్‌లో చేసే మదుపు, దానిమీద వచ్చే రాబడి మీద పన్ను ఉండదు. కానీ, అదే టాక్స్ సేవింగ్స్ కోసం చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ మీద వచ్చే వడ్డీ మీద శ్లాబును బట్టి పన్నును చెల్లించాల్సిందే. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి రాబడిని ఇవ్వగలిగిన సాధనాన్నే ఎంచుకోవాలి. ఉదాహరణకు పీపీఎఫ్ అకౌంట్ మీద 8 శాతం వడ్డీ వస్తుంది. ద్రవ్యోల్బణం 4 శాతం అనుకుందాం. అంటే ద్రవ్యోల్బణం తీసివేయగా అసలు రాబడి 4 శాతమే. ద్రవ్యోల్బణాన్ని తీసివేయగా కూడా అధిక రాబడిని ఇచ్చే సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి.
adhil

తొందరపడి ఇల్లు కొనద్దు

హోమ్ లోన్ తీసుకుని సొంతింటి కలను నిజం చేసుకోవడం ఉత్తమ మార్గంగా కనిపించవచ్చు. అలాగే హోమ్ లోన్ ఈఎంఐ చెల్లింపుల మీద ఆదాయపు పన్ను సెక్షన్ 24, 80సీ, 80 ఈఈల కింద పన్ను మినహాయింపులను కూడా పొందవచ్చు. అయితే మీ ప్రస్తుత ఉద్యోగం ఆధారంగా కాకుండా మీ వేతనం సంవత్సరానికి పెరిగే వృద్ధి రేటుకు తగ్గట్టుగానూ, ప్రస్తుతం ఉన్న ఆర్థిక అవసరాలు దృష్టిలో ఉంచుకోవాలి. కొంతకాలం తర్వాత ఈఎంఐలో వచ్చే మార్పులు, రుణాన్ని తీర్చడానికి తగ్గట్టు ఆర్థిక ప్రణాళిక ఉండాలి. హోమ్‌లోన్ అధిక మొత్తంలో తీసుకోవడం ద్వారా ఈఎంఐ భారంతో మీ క్రెడిట్ స్కోర్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పైన పేర్కొన్న అంశాలను దృష్టిలో ఉంచుకుని పన్ను ఆదా చేయడం కోసం అధికమొత్తాల్లో మదుపు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కోవద్దు. అందుకే ప్రతి నిర్ణయాన్ని ఆచితూచి తీసుకోండి. ఆర్థిక ప్రణాళిక కోసం పర్సనల్ ఫైనాన్స్ అడ్వయిజర్ల సలహా తీసుకోండి.

592
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles