సంపద వృద్ధికి సలహా..


Sat,January 5, 2019 01:10 AM

advisory
పెట్టుబడుల సలహా వ్యాపారంలో పొదుపును ఎలా పెంచుకోవాలన్నదానికే అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యం. పరిమిత ఖర్చులు, వ్యయ నియంత్రణ చర్యలకూ ప్రాముఖ్యతే. కాబట్టి సలహాదారులు తమ క్లయింట్ల సంపాదన, ఖర్చు అంశాలను శ్రద్ధగా గమనించాల్సి ఉంటుంది. క్లయింట్లు తమ నగదు లావాదేవీలను ఎలా జరుపుతున్నారు. డబ్బుపై వారి అభిప్రాయాలు, సంపద నిర్వహణ వంటి వాటినీ తెలుసుకోవాలి. ఇదే సమయంలో పెట్టుబడుల విషయంలో వారి ఆలోచనా తీరును గమనించి తగిన సలహాలు ఇవ్వడం ఉత్తమం. అంతకంటే ముందు ఏ రకమైన పెట్టుబడులు ఎవరికి అనువైనవన్నదానిపై సలహాదారులకు ఓ స్పష్టత ఉండాలి. ఎప్పుడు ఎందులో పెట్టుబడులు లాభదాయకం అనేది చెప్పగలిగితే.. మదుపరులు తప్పక ఆ దిశగా అడుగు వేయగలరు. సంపద సృష్టికి సరైన సలహాలిస్తే అటు సలహాదారులకు, ఇటు క్లయింట్లకు ప్రయోజనం.

నేడు సంపాదన ఎంత ముఖ్యమో.. ఆ సంపదను సంరక్షించుకోవడమూ అంతే ముఖ్యం. వెతికితే దొరకనిదంటూ ఏదీ లేదని పెద్దవారు మనకు చెప్పడం వినే ఉంటాం. అయితే మన ఆలోచనా విధానంపై మార్గాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం పెట్టుబడులకు అనేక రంగాల్లో విస్తృతమైన అవకాశాలున్నాయి. వాటిని అందిపుచ్చుకుంటే గొప్ప లాభాలు మన సొంతమవుతాయి. కానీ ఆ అవకాశాలు తెలియకనో.. భయం కారణంగానో.. మదుపరులు ముందుకు రాలేకపోతున్నారు. ఇలాంటి సమయంలోనే సలహాదారుల ఆవశ్యకత తెలుస్తుంది. ఇక ప్రభుత్వం సైతం పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నది. వివిధ రంగాల్లో అనేకానేక అవకాశాలను అందిస్తున్నది. అయితే అన్నీ మనకు అనుకూలంగా లేకున్నా.. అందులో కొన్నిమాత్రం తప్పకుండా మనకు సరిపోయేవే ఉంటాయి. అవి ప్రభుత్వం వల్ల ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ఉండవచ్చు. ప్రభుత్వ సంస్థల ద్వారా కూడా లభించవచ్చు. అలాగే ప్రైవేట్ రంగంలోనూ పెట్టుబడులకు గొప్ప అవకాశాలున్నాయి. వీటిని గుర్తిస్తే ఆకర్షణీయమైన లాభాలు పొందవచ్చు.

ఆదాయాన్ని పెంచుకోవడానికి అన్ని సందర్భాల్లో వ్యయ నియంత్రణే చక్కని పరిష్కారం కాదు. వ్యయ నియంత్రణ కూడా ఒక పరిష్కారం అన్నది గుర్తించాలి. ఇకపోతే స్టాక్ మార్కెట్ లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల గురించి మదుపరులు తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒడిదుడుకులకు లోనయ్యే పెట్టుబడులు కాబట్టి ముందుగానే మార్కెట్ పరిస్థితులను మదుపరులకు వివరిస్తే ఉత్తమం. స్టాక్ మార్కెట్లు అనేవి అత్యంత సున్నితమైనవి. ప్రతీ అంశం వీటిని ప్రభావితం చేస్తుంది. లాభాల నుంచి భీకర నష్టాల్లోకి.. భారీ నష్టాల నుంచి లాభాల్లోకి మారడం అత్యంత సహజం. లాభనష్టాల మధ్య ఊగిసలాడే స్టాక్ మార్కెట్లకు మదుపరులు త్వరగా అలవాటు పడకపోవచ్చు. కనుక వీటిపట్ల అప్రమత్తత అవసరం. స్థిరంగా ఉండే షేర్లను, ముఖ్యంగా చిన్న, మధ్యతరహా షేర్లను ఎంచుకుని మొదట పెట్టుబడులు పెడితే బాగుంటుంది.
naresh-kumar
చాలామంది తమ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తారు. పిల్లల చదువు, విద్య, వివాహాలు, పదవీ విరమణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఆయా ప్లాన్లలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను సమగ్రంగా వివరిస్తే చక్కని ఫలితాలు ఉంటాయి. చిన్న వయసులోనే పొదుపు పెద్ద ప్రతిఫలాల్నే ముట్టజెబుతాయి. కాబట్టి ఉద్యోగ జీవితంలోకి అడుగిడిన వెంటనే పొదుపు బాటపడితే లాభదాయక ఫలితాలుంటాయి. చిన్నచిన్న పెట్టుబడులే కదా.. అని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరాదు. సురక్షిత పెట్టుబడుల వైపే అడుగులు వేస్తూ.. అప్పుడప్పుడు కొత్త మార్గాలనూ అన్వేషించడం ఉత్తమ మదుపరి లక్షణం. పెట్టుబడులకు ముందు నిపుణుల సలహాలు తీసుకుంటే మన కష్టార్జితానికి తగిన విలువ దక్కుతుంది. పెట్టుబడుల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు. లోతైన విశ్లేషణతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

603
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles