గోదాదేవి శ్రీకృష్ణుని సుప్రభాత సేవ అనంతరం, ఆయన్ను ఏ విధంగా నిద్ర మేల్కొల్పాలో మనకు తెలియపరుస్తుంది. అలాగే, భగవత్ సన్నిధికి చేరిన తర్వాత ఎటువంటి నియమాలుండవని, అన్నీ ఆయన్ను చేరుకోక ముందేనని చిన జీయర్ స్వామి వారు తెలిపారు. శరణాగతి చేసిన వారందరికీ భగవంతుడు దోషాలు తొలగించి వేస్తాడని, ఆశ్రితుల విషయంలో ఆయన ప్రేమ కురిపిస్తాడని స్వామి చెప్పారు.

హైదరాబాద్ నగరంలో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. నందగిరి హిల్స్‌లోని మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు నివాసంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాలు సోమవారంతో 23వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి వ్రతంలోని 23వ పాశుర పరమార్థాన్ని సవివరంగా, సోదాహరణలతో తెలిపారు. కార్యక్రమంలో జూపల్లి రామేశ్వరరావుతోపాటు ఆయన సతీమణి శ్రీకుమారి, వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఎవరూ శాస్ర్తాల్ని అతిక్రమించి బతుకరాదని, భగవంతుడు కూడా అన్ని నియమాలూ పాటించాల్పిందేనని, విరజా నది దాటేంత వరకే నియమాలుంటాయని చిన జీయర్ స్వామి పేర్కొన్నారు. ఎక్కడ కర్మవస్యత ఉండదో, ఎక్కడైతే అధిక ప్రేమ ఉంటుందో అక్కడ ఎటువంటి నియమాలుండవని ఆయన అన్నారు. అదే విధంగా గోదాదేవికి కూడా నియమాలు వర్తించవని స్వామి వారు తెలిపారు. ప్రకృతి అద్భుత సౌందర్య తత్వాన్ని గురించి ఆండాళ్ తల్లి చాలా బాగా వర్ణించింది. పరబ్రహ్మతత్వం అనేది ఒకనాడు లోపల ఉండి, మరొకనాడు బయటకు వస్తుంది. లోపల ఉన్నప్పుడు కారణము అంటాం. అది అప్పుడు కనిపించదు, బయటకు కనిపించే దానిని కార్యము అంటారని స్వామి తెలిపారు.
వేదాలు, వేదాంత శాస్ర్తాల్లో శూన్యం నుంచే అంతా వస్తుందని, ఇదంతా భ్రాంతి మూలకమని కొందరు చెబుతుంటారు. అది నిజం కాదని, నేత్రాల్లో దోషం ఉన్నప్పుడు అలాగే కనిపిస్తుందని స్వామి అన్నారు. జగత్తు అంతా కారణదశ నుంచే వచ్చిందని చిన జీయర్ స్వామి వివరించారు. ప్రతి వస్తువుకీ సహజమైన కొన్ని ధర్మాలుంటాయి. వాటికి విరుద్ధమైన ధర్మాలు ఏమిటో కూడా మనకు తెలియాలి. వేదాల్లో భగవంతునికి కొన్ని మంత్రాల్లో రూపం లేని వాడని, మరికొన్ని మంత్రాల్లో నామరహితుడని ఆయన అన్నారు. అయితే, వీటిపై రామానుజాచార్యుల వారు స్పష్టత ఇచ్చారని కూడా స్వామి పేర్కొన్నారు.
కార్య దశ, కారణ దశ వేర్వేరు కాదు. ఆండాళ్ తల్లి ఇదే విషయాన్ని పలు రకాలుగా తెలియజేసిందని స్వామి చెప్పారు. జగత్ కారణమైన బీజం ఒకటున్నది. దాని పేరే పరబ్రహ్మ అని, ఆయన తనలో నుంచి అన్నిటినీ బయటకు తీస్తాడు. మళ్లీ వాటిని తనలోకి వెనక్కి తీసుకోగలడు. బ్రహ్మలో అంతటి గొప్ప శక్తి ఉంటుందని స్వామి వారు పేర్కొన్నారు. పరబ్రహ్మ చేతనాలను, అచేతనాలను లోపలికి పంపి, వాటిని యథాతథంగా బయటకు తీసుకు రాగలడని, వాటి రూపాలు ఏ మాత్రం మారకుండా చక్కగా బయటకు తీయగల సామర్థ్యం భగవంతునికి ఉందని చిన జీయర్ స్వామి వివరించారు. అప్పుడు సూక్ష్మ, చేతనాచేతన విశిష్ట బ్రహ్మ. ఇప్పుడు స్థూల దశ పొందిన అచేతనములతో కూడిన విశిష్ట బ్రహ్మగా వ్యవహరిస్తారని, దీనికే విశిష్ట అద్వైతం అని పేరు పెట్టారని స్వామి వారు తెలిపారు.

మంత్రాస్వాదనతోనే మంత్ర శక్తి!
ఎలా రావాలో, ఎలా నడవాలో, ఎలా కూర్చోవాలో కూడా ఆండాళ్ తల్లి చెప్పింది. శ్రీకృష్ణుడు గోదాదేవి ఎలా ఆదేశిస్తే అలా పాటించే వాడని చిన జీయర్ స్వామి చెప్పారు. జ్ఞాన ప్రసాదాన్ని స్వీకరించాలంటే తగిన యోగ్యతనిచ్చే మంత్రం కావాలి. మంత్రాన్ని ఆస్వాదించడం ద్వారా మంత్రశక్తిని వాడుకోవచ్చు. ఆ శక్తిని రెండు రకాలుగా వినియోగించుకోవచ్చు. ఒకటి శబ్ద శక్తి, రెండు అర్థ శక్తి . ఎంత బాగా శబ్దాన్ని చేయగలుగుతావో అందులో అంతవరకే శక్తి వస్తుంది. అర్థ శక్తి అంటే అందులో ఉండే లోతును తెలుసుకుంటే మంత్రంలోని శక్తిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని చిన జీయర్ స్వామి పేర్కొన్నారు. మంత్రాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే కొన్ని నియమాలున్నాయి. ఒక్కో మంత్రానికీ ఒక్కో రకమైన నియమం ఉంటుంది. ఆయా మంత్రాలనుబట్టి నియమాలను పాటించాల్సి ఉంటుందని, అదే విధంగా నాథ మునుల వారు ఆళ్వార్ తిరునగర్ వెళ్ళి నమ్మాల్ వార్ల అనుగ్రహం పొందడానికి కన్నినన్ సిరిత్తాంబు ప్రబంధాన్ని 12 వేల సార్లు జపించారని చిన జీయర్ స్వామి వివరించారు.
-పసుపులేటి వెంకటేశ్వరరావు
-కోనేటి వెంకట్