కొత్త వెలుగుజిలుగుల


Mon,January 7, 2019 11:34 PM

గాజు గ్లాసు, కొవ్వొత్తి, పెయింట్ బ్రెష్‌తో మీరేం చేస్తారు? మంచి బొమ్మ గీస్తారేమో..! ఈమె మాత్రం వాటితో అద్భుతాలు సృష్టిస్తుంది. మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడని వింతలను ఆవిష్కరిస్తుంది. నిరాశ నిండిన జీవితాల్లో కొత్త వెలుగుజిలుగులు తెస్తుంది. ఏంటీ? నమ్మశక్యంగా లేదా? అయితే.. తన వృత్తికి, ప్రవృత్తికి ఏ మాత్రం సంబంధం లేని ఈ స్టెయిన్‌లెస్ ఆర్టిస్ట్ చెప్పే మాటలు వింటే.. మీరే నమ్మేస్తారు.
art-vedha
రెండు రంగులను కలిపితే ఏ రంగు వస్తుందో పెయింటర్‌గా తెలుసుకుంది. చిరు వెలుగులో ఏ రంగులు మరింత ప్రకాశవంతంగా మెరుస్తాయో ప్రయోగాలు చేసింది. ఎలాంటి రంగులు చూస్తే మనసు పులకరిస్తుందో ఓ సైకాలజిస్ట్‌గా అధ్యయనం చేసింది. మనకు అందుబాటులో ఉండే వస్తువులతో ఎలాటి అద్భుతాలు చెయ్యొచ్చో ఆరా తీసింది. ఇలా ప్రతి వస్తువునూ తీక్షణంగా పరిశీలించి.. ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంది. తీరిక దొరికినప్పుడల్లా కొంగొత్త ఆలోచనలు చేస్తూ.. విదేశాలకే పరిమితమైన స్టెయిన్‌లెస్ ఆర్ట్‌ను మన ముందుకు తీసుకొచ్చింది. అమెజాన్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్స్‌లలో తన కొత్త ఆర్ట్‌ను విక్రయిస్తూ నలుగురిలో ప్రత్యేకంగా నిలిచింది. ఆ విశేషాలేంటో.. సైకాలజిస్ట్ కం ఆర్టిస్ట్ రవళీ శర్మ మాటల్లోనే..


స్టెయిన్‌లెస్ ఆర్ట్ దీని గురించి మనం ఇప్పుడిప్పుడే మాట్లాడుకుంటున్నాం. ఇది ఒకప్పుడు విదేశాల్లో చాలా ఫేమస్ ఆర్ట్. గాజుకు ఆర్ట్ వేసి, దానిపై లైటింగ్ వేస్తే.. ఎలాంటి అద్భుతాలు ఆవిష్కృతమవుతాయో ఈ ఆర్ట్‌లో గమనించవచ్చు. వినడానికి కొత్తగా ఉన్న ఈ విధానాన్ని పారిస్, రోమ్ లో అలంకరణకు ఎక్కువగా వాడుతుం టారు. దానిని మన వాళ్లకు పరిచయం చేసేందుకు నేను ప్రయత్నిస్తున్నా. అదికూడా కేవలం తక్కువ ఖర్చుకే. సింగిల్ కలర్ లైటింగ్ అంటే ఏదో రంగు వేస్తే వస్తుందిలే అనుకుంటాం. కానీ అది అలా కాదు. గ్లాస్ మీద ఎలాంటి డిజైన్ అయితే ఉంటుందో దానికి రెట్టింపు ఆకర్షణ రావాలి. అందుకు సంబంధించి మంచి రంగులు రావాలి. అవి చిరు వెలుగులో ఎలా మెరుస్తాయో అవగాహన ఉండాలి. ఇందుకు నేను ఎన్నో ప్రయోగాలు చేయాల్సి వచ్చింది. మొదట డాట్స్ వర్క్ చేశా. గ్లాస్‌పై నచ్చిన రంగుని వేసేదాన్ని. అది బాగోలేకపోతే వేరే రంగు వేసేదాన్ని. తర్వాత మార్కర్‌తో ప్రయత్నించా. ఇలా తీరిక దొరికినప్పుడల్లా రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉండేదాన్ని. మొదట్లో ఒక్కో ఆర్ట్ వేయడానికి కనీసం వారం రోజులు పట్టేది. గ్లాస్ పెయింటింగ్‌పై అవగాహన వస్తున్న కొద్దీ.. సమయం తక్కువయ్యేది. ఇప్పుడు ఎలాంటి డిజైన్ అయినా కేవలం రెండు గంటల్లోనే పూర్తి చేస్తున్నా.


మొదట మార్కెట్లో దొరికే స్టెయిన్‌లెస్ గ్లాస్‌లు కొని వాటి మీద ప్రయోగాలు మొదలు పెట్టా. మనసులో ఒక డిజైన్ అనుకొని చేస్తే.. మరో ప్రతిబింబం వచ్చేది. అనుకున్న రూపం వచ్చే వరకూ పట్టువదలకుండా చేస్తూనే ఉండేదాన్ని. ఎంత ప్రయత్నం చేసినా తుది రూపం రాకపోతే.. చివరిగా ఇంటర్నెట్ సాయం తీసుకునేదాన్ని. పెయింటింగ్ చూడ్డానికి మామూలుగానే ఉన్నా.. అందులో కొవ్వొత్తిని వెలిగిస్తే.. ఆ పెయింటింగ్ ప్రతిబింబం మాత్రం అద్భుతంగా వస్తుంది. ఎంత పెద్ద సక్సెస్ అయినా ఓటములతోనే మొదలవుతుందంటారు. ఇలా ఎన్నో విఫల ప్రయోగాల ఫలితంగా ఇలా రాటుదేలాను. ఇప్పుడు ఫలానా పెయింటింగ్ వేయాలని నిర్ణయించుకుంటే.. కేవలం రెండు గంటల్లోనే పూర్తి చేసేంత అనుభవం వచ్చింది. నా ఈ అభిరుచికి కారణం.. చిన్నప్పటి నుంచి నేను చేస్తున్న ప్రయోగాలే.


మాది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా. విద్యాభ్యాసం అంతా అక్కడే. నాన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నతాధికారిగా పదవీ విరమణ పొందారు. అమ్మ గృహిణి. ఇద్దరు అన్నయ్యల్లో ఒకరు పైలెట్, మరొకరు రీసెర్చర్. నాకు చిన్నప్పటి నుంచి సైకాలజిస్ట్ అవ్వాలని కోరిక. ఇంట్లో అందరూ చదువుకున్నవారే అవ్వడంతో నాకు మరింత సహకారం అందింది. సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో గ్రాడ్యుయేషన్, పాండిచ్చేరి యూనివర్సిటీలో సైకాలజీ చేశా. కొన్నాళ్లు చైల్డ్ సైకాలజీ, స్టూడెంట్ కౌన్సెలర్‌గా పనిచేశా. 2017 మార్చిలో వైజాగ్‌కు చెందిన జగన్నాథ్ శర్మతో పెళ్లి చేశారు. ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మనసు కూడా చాలా సాఫ్ట్. భర్త, అత్తమామలు నా వృత్తికి చాలా సహకారం అందించే వాళ్లు. నా భర్త ఉద్యోగరీత్యా మేం ఇప్పుడు హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాం. ఇక్కడ కూడా స్టూడెంట్ సైకాలజీ కౌన్సెలర్‌గా విధులు నిర్వర్తిస్తూనే.. తీరిక సమయాల్లో స్టెయిన్‌లెస్ ఆర్ట్‌ను కొనసాగిస్తున్నా.


పెళ్లయిన తర్వాత మా కుటుంబం మొత్తం పారిస్, రోమ్ ట్రిప్‌కి వెళ్లాం. అక్కడే ఈ ఆర్ట్ నా కంటపడింది. చిన్న గ్లాస్‌బౌల్ మీదున్న డిజైన్.. మొత్తం గదినే అందంగా మార్చింది. అప్పుడే నేనూ ఈ ఆర్ట్‌ను మనకు పరిచయం చెయ్యాలనుకున్నా. ఇంటికి రాగానే ఆర్ట్ మొదలుపెట్టా. నా ఇష్టాన్ని గౌరవించి ఇంట్లోవాళ్లందరూ సహకరించారు. ఇలా నా పెయింటింగ్స్ చూసి కుటుంబ సభ్యులు, బంధువులు బాగా ప్రోత్సహించారు. ఇంటికి వచ్చిన అతిథులకు నా ఆర్ట్‌ను గుర్తుగా ఇచ్చేదాన్ని. వాళ్లంతా సంతోషంగా ఫీలవడంతో.. వాటిని అమ్మాలనే నిర్ణయం తీసుకున్నా. నా ఆర్ట్ గురించి పలువురికి చెప్పేదాన్ని. ఈ క్రమంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ను నా ఆర్ట్‌ను విక్రయించేందుకు వేదికగా చేసుకున్న. అమేజాన్‌లో Artveda in Amazon అని సెర్చ్ చేసి, నా ఆర్ట్‌ను కొనుగోలు చెయవచ్చు. ప్రస్తుతం వీటి ధరలు రూ.299 నుంచి ప్రారంభం అవుతాయి. గిఫ్ట్ ఆర్టికల్ కలెక్షన్స్ పేరుతో వైజాగ్, హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో స్టోర్స్ నిర్వహిస్తున్నా. నా భర్త సాఫ్ట్‌వేర్ కాబట్టి ఆయన సాయంతో ఆన్‌లైన్ వ్యవహారాలన్నీ నేనే స్వయంగా చూసుకుంటున్నాను. ఆర్ట్స్‌ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్ట్‌వేద పేరుతో వెబ్‌సైట్ క్రియేట్ చేశాం. ఈ వెబ్‌సైట్ నుంచి కూడా ఆర్డర్స్ చెయ్యవచ్చు. హోం డెలివరీ సర్వీస్, నచ్చకపోతే తిరిగి ఇచ్చే వెసులుబాటు కూడా ఉంది. మున్ముందు మరిన్ని వెరైటీస్‌తో ఆర్ట్స్‌ని డెవలప్ చేయాలనుకుంటున్నా.


art-vedha2

స్టెయిన్‌లెస్ ఆర్ట్ అంటే?

ఇది గాజు వస్తువులపై చేసే పెయింటింగ్. చూడ్డానికి ఈ పెయింటింగ్ మామూలుగానే ఉన్నా. లైట్లు ఆఫ్ చేసి, కొవ్వొత్తి వెలుతురులో చూస్తే.. చాలా అందంగా కనిపిస్తాయి. ఉదాహరణకు మనకు నచ్చిన పెయింటింగ్ వేసిన గాజు గ్లాసులో.. దానికి సమానమైన కొవ్వొత్తిని ఉంచాలి. తర్వాత లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తిని పెట్టి వెలిగిస్తే.. వచ్చే ప్రతిబింబం కొత్త సృష్టిలా ఉంటుంది. ఇందుకు కలర్ కాంబినేషన్ చాలా ముఖ్యమైంది. వీటిని నచ్చిన వారికి గిఫ్ట్‌గా ఇస్తే.. ఫిదా అవుతారు. పండగలకు ఈ లైటింగ్ పీక్స్ ఉంటుంది. వీటిని విదేశాల్లో బాగా ఉపయోగిస్తున్నారు. కావాలంటే మీరూ ప్రయత్నించొచ్చు. మరింకెందుకు మీకు కావాలనుకుంటే అమెజాన్‌లోకి వెళ్లండి.
-వనజ వనిపెంట
-బి. సంజయ్ చారి

1055
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles