అక్షరచైతన్యం పరిపూర్ణం


Tue,October 9, 2018 01:11 AM

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి.. పుట్టిన ఊరిలో అక్షర చైతన్యం రగిలించడానికి ఊరి బాట పట్టాడు. వేల పుస్తకాలు సమీకరించి లైబ్రెరీ ఏర్పాటు చేశాడు. చదువు విలువ పదిమందికే చెప్తున్నాడు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వారు ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా వారధిగా నిలుస్తున్న పూర్ణచందర్ పరిచయం మీకోసం..ప్రతియేటా డిగ్రీ పూర్తయిన విద్యార్థులు లక్షల్లో బయటకు వస్తున్నారు. పేరుకే డిగ్రీ పట్టా కానీ.. డిగ్రీ తర్వాత ఏం చేయాలో చాలామందికి క్లారిటీ లేదు. సగంమంది ఖాళీగా ఉంటున్నారు. నేను పుట్టిన గ్రామం ఆ దారిలోనడువకూడదని అక్షరచైతన్య లైబ్రెరీ స్థాపించా. ఉచితంగా పుస్తకాలందిస్తూ, సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారికి గైడెన్స్ ఇస్తున్నా. లైబ్రెరీలో చదువుకునే స్టూడెంట్స్ చాలామందికి ప్రభుత్వ ఉద్యోగం సాధించే సత్తా ఉంది. ఎస్‌ఐకి సెలెక్ట్ అయిన 25 మందిని అన్నీ రౌండ్‌లలో సెలెక్ట్ అయ్యేలా ప్రిపేర్ చేస్తున్నాం. స్టూడెంట్స్ టార్గెట్ రీచ్ అయ్యేలా వారికి శిక్షణ ఇస్తా.

Library

అక్షరచైతన్య లైబ్రెరీ ఆఫ్ హ్యూమన్ అండ్ ఎడ్యుకేషన్ చైర్మెన్ నాగుల పూర్ణచందర్. తండ్రి పేరు రామస్వామి. తల్లి పేరు సూర్యమ్మ. రామస్వామి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల గ్రామానికి చెందినవాడు. రామస్వామికి నలుగురు కొడుకులు, ఒక కూతురు. అందరి తల్లిదండ్రుల్లాగే తను కూడా పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనుకున్నాడు. పిల్లల చదువుకు పేదరికం అడ్డువచ్చేది. ఎన్ని అడ్డంకులొచ్చినా చదువుకు అడ్డు చెప్పలేదు. ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి చదివించాడు. పెద్ద కొడుకు నాగుల శ్రీనివాస్‌ని సివిల్ ఇంజినీర్ పూర్తి చేసి డిఫెన్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కొడుకు సత్యనారాయణ ఆధార్‌లో అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. మూడవ కొడుకు అమరేందర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. చిన్న కొడుకే పూర్ణచందర్ బి.సి.ఎ, పి.జి.డి.యమ్, ఎమ్.బి.ఎ చేసి ఇప్పడు కాప్ జెమినీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఒక్కగానొక్క కూతురు జ్యోతిని చదివించి వివాహం చేశాడు.

తండ్రి కోరిక మేరకు పూర్ణచందర్ చదువు పూర్తి చేశాడు. ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. పనిమీద మూడు సంవత్సరాలు అమెరికా వెళ్లవలసి వచ్చింది. పనిచేస్తున్నా.. ధ్యాసంతా పుట్టిన ఊరు సిరిసిల్ల మీదనే ఉండేది. చదువుకు తాను పడ్డ కష్టాలు గుర్తొచ్చేవి. పిల్లల చదువు ఖర్చు భరించలేక ఊరిలో పిల్లల్ని తల్లిదండ్రులు పనులకు పంపించేవాళ్లు. పుట్టిన ఊరికి సేవ చేయాలి. అది అందరికీ ఉపయోగపడేలా ఉండాలి. చదువుకున్న యువకులు బలాదూర్‌గా తిరుగకుండా గైడెన్స్ ఇస్తూ ముందుకు నడిపించాలి. అందరికీ ఉపయోగపడేలా గ్రామంలో లైబ్రెరీ ఏర్పాటు చేయాలనుకున్నాడు. అమెరికా నుంచి వచ్చేశాడు. లైబ్రరీని మొదలు పెట్టడానికి తగినంత డబ్బు లేకపోయినా తన దగ్గర ఉన్న కొద్దిమొత్తం చిన్నపాటి లైబ్రెరీ ఏర్పాటు చేశాడు.

అక్షరచైతన్యం..


Purnachandar
లైబ్రెరీ స్థాపించడానికి ఇంట్లో ఎవరూ అంగీకరించలేదు. అయినా లెక్కచేయలేదు. బంధువులు, ఫ్రెండ్స్ అందరినీ సాయం కోరాడు. తనకోసం కాకుండా ఇతరులకోసం చేస్తున్నాడని కొంతమంది స్నేహితులు డబ్బు సాయం చేశారు. తనకు వచ్చే జీతంలో లైబ్రెరీ కోసం కొంత కేటాయించేవాడు. ఇంటి ఖర్చులకు డబ్బులు సరిపోక అప్పుడప్పుడు డబ్బుల విషయంలో ఇంట్లో గొడవలయ్యేయి. అయినా వెనుకడుగు వేయలేదు. ఈ సమయంలోనే పూర్ణచందర్ తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత నాలుగేడ్లకు తండ్రి జ్ఞాపకార్థం లైబ్రెరీ ప్రారంభించాడు. దానికి అక్షరచైతన్య అని నామకరణం చేశాడు. యాభైవేల రూపాయలు ఖర్చు చేసి 1200 పుస్తకాలు ఏర్పాటు చేశాడు. పూర్ణచందర్ హైదరాబాద్‌లో ఉండడం వల్ల లైబ్రెరీ చూసుకోవడం కుదిరేది కాదు. లైబ్రెరీ చూసుకోవడానికి ఒక వ్యక్తిని నియమించాడు. లైబ్రెరీకి వెళ్లి చదువుకుంటే ఏమైనా డబ్బులు చెల్లించాల్సి వస్తుందేమో అని ఊర్లో వాళ్లు లైబ్రరీకి వచ్చేవారు కాదు. లైబ్రెరీ పెట్టింది డబ్బు సంపాదించడానికి కాదు గ్రామంలోని విద్యార్థులు చదువుకోసం అని అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు. అప్పట్నుంచి ఒక్కొక్కరుగా లైబ్రెరీకి రావడం మొదలుపెట్టారు. ఐదవ తరగతి నుంచి ఐఏఎస్, ఎంబీఏ, ఐఐటీ వంటి పోటీపరీక్షలకు సంబంధించిన అన్నీ పుస్తకాలను అందుబాటులో ఉంచాడు. ఇక్కడ దొరకని పుస్తకాలను ఢిల్లీ నుంచి తెప్పించేవాడు.

గైడెన్స్ కూడా..

ప్రతిరోజూ లైబ్రెరీకి 50 మంది వచ్చేవారు. వాళ్లంతా విద్యార్థులే. లైబ్రరీని చూసుకునే బాధ్యతవాళ్లకే అప్పగించాడు. వాళ్లు లైబ్రెరీని జాగ్రత్తగా చూసుకునేవారు. లైబ్రెరీకి వెళ్లాలంటే ఎలాంటి కండీషన్స్ లేవు. ఎవరైనా, ఎప్పుడైనా వచ్చి చదువుకోవచ్చు. స్కూల్, కాలేజీలో దొరకని పుస్తకాలు లైబ్రెరీలో దొరికేవి. డబ్బులు పెట్టి పుస్తకాలు కొనలేని వారు లైబ్రెరీలోని పుస్తకాలు ఉచితంగా చదువుకునేవారు. చాలామంది లైబ్రెరీలోనే చదువుకొని, అక్కడే నిద్రపోతుంటారు. నెలసరి జీతం, సాయం చేసిన డబ్బులతో పూర్ణచందర్ ఎప్పటికప్పుడు లైబ్రెరీని అప్‌డేట్ చేస్తున్నాడు. అక్కడికొచ్చే పిల్లలతో మాట్లాడి వారి స్కిల్స్, తెలివితేటలను గమనిస్తా. డిగ్రీ పూర్తయిన తరువాత ఏం చేయాలో, ఏం చేస్తే బాగుంటుందో గైడెన్స్ ఇస్తున్నా. చాలామంది పిల్లలు సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారు. వారికి కావాల్సిన పుస్తకాలు, గైడెన్స్, న్యూస్ అప్‌డేట్స్ ఇస్తుంటాడు. సొంతంగా లక్ష ఖర్చుపెట్టి లైబ్రెరీలో ప్రొజెక్టర్ ఏర్పాటు చేశాడు. ఈ లైబ్రరీకి విద్యార్థులే కాకుండా ప్రైవేట్ ఉపాధ్యాయులు, రిటైర్ అయిన వాళ్లు, ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు ఇలా అందరూ రావడం మొదలైంది. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేవారు వాళ్ల సబ్జెక్ట్ చదువుకోవడం పూర్తయిన తర్వాత డిజిటల్ క్లాస్ తీసుకొని అందరికీ వివరించేవారు. మొన్నటి ఎస్‌ఐ పరీక్షలో లైబ్రెరీ ప్రిపేరైన వాళ్లు 25 మంది సెలెక్ట్ అయ్యారు.

తీర్చిదిద్ధాలి..


Library1

1200 పుస్తకాలతో మొదలయిన లైబ్రరీ 4,000 పుస్తకాల గ్రంథాలయంగా మారిపోయినది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాస్త అక్షరచైతన్య చైర్మన్ అయ్యాడు. అప్పటి సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్ కూడా లైబ్రరీలోని పుస్తకాలు చూసి నేను చదువుకునేటప్పుడు కూడా ఇన్ని పుస్తకాలు నాకు దొరకలేదు అన్నారు. సిరిసిల్ల గ్రామ విద్యార్ధులకు పూర్ణచందర్ చేస్తున్న కృషి, పట్టుదలకి అభినందనలు తెలిపారు. లైబ్రరీ అవసరమా గొడవపడ్డ వాళ్లందరూ అక్కున చేరి ఇలా చేస్తే బాగుంటుందని ఇప్పుడు సలహాలిస్తున్నారు. ఇప్పుడు పూర్ణచందర్‌కు చాలామంది అండగా నిలబడుతున్నారు. ఇప్పటివరకు వ్యక్తిగతంగానే డబ్బు సహాయం అందింది. విషయం తెలుసుకొని ఏ సంస్థ అయినా ముందుకొస్తే లైబ్రరీని మరింత అభివృద్ధి చేసి ముందుకు నడిపిస్తానని చెప్పుకొచ్చాడాయన.

...?వనజ వనిపెంట

914
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles