పర్యాటక ఉత్సవాలకు... రాచకొండ పిలుస్తోంది!


Tue,February 13, 2018 01:19 AM

కోటలకు పుట్టినిల్లు లాంటిది రాచకొండ. అత్యంత ఎత్తయిన ప్రతాప రుద్రకోట.. రామగిరి ఖిల్లా తర్వాత ఎత్తయిన కోట రాచకొండలోనే ఉందని చరిత్రకారులు చెప్తున్నారు. మొదటి సింగ భూపాలుడు ఈ కోటకు అంకురార్పణ చేయగా అనపోతన రాజు విస్తరింపజేశారని చెప్తుంటారు. దీని పొడవు పది గుట్టల మధ్యన సుమారు 40 కిలోమీటర్లు ఉంటుంది. శతృ దుర్భేద్యంగా నిర్మితమైన రాచకొండలో ఎన్నో చారిత్రక కట్టడాలు.. ఆలయాలు.. కోట గోడలు.. బావులు.. విశ్రాంతి గదులు.. నాట్య మందిరాలు నిర్మించారు రాజులు. ఎన్నో వేల ఏళ్లనాడు పునాది వేసుకున్న నాటి వైభవ కట్టడాలు.. వాటి చుట్టూ వెలసిన ప్రకృతి నేడు పర్యాటకంగా ఆకర్షిస్తున్నది. స్వరాష్ట్రంలో సంబురంగా పర్యాటక ఉత్సవాలు జరుపుకొంటున్నది!గుప్పిట్లో గుట్టల్ని బంధించి.. చుట్టూతా చెట్టూ చేమల్ని చేరదీసి.. ఆకాశానికి ఆనుకున్నట్లు.. బండలపై పరుపేసినట్లు కనిపిస్తున్నదో కొండ! ఏమా రాచఠీవి..? ఏమా తేజస్సు..? ఇది.. రాళ్లు పొదిగిన రాతికొండనో.. నిర్మానుష్యంగా ఉన్న నిషేధిత కొండనో మాత్రం కాదు! చరిత్రకు చెక్కు చెదరని సాక్ష్యం. పాలనా వైభవానికి పట్టంగట్టే ఆధారం! నాటి రతనాల కొండ.. తెలంగాణ సాంస్కృతిక వైభవపు అండ రాచకొండ! మహాశివ రాత్రిని పురస్కరించుకొని ఫిబ్రవరి 12 నుంచి రాచకొండ పర్యాటక ఉత్సవాలు జరుగుతున్నాయి. పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న రాచకొండ రాజసంపై ప్రత్యేక కథనం! ఎక్కడ ఉన్నది?: యాదాద్రి భువనగిరి జిల్లా.. రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో హైదరాబాద్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో రాచకొండ గ్రామంలో ఉన్నది.
rachakonda

ఎలా వెళ్లాలి?:

rachakonda4
నాగార్జునా సాగర్ జాతీయరహదారి నుంచి వెళ్లాలనుకుంటే ఇబ్రహీంపట్నం.. మంచాల మీదుగా వెళ్లే తిప్పాయిగూడెం వస్తుంది. తిప్పాయిగూడెంకు ఆనుకునే రాచకొండ గ్రామం.. రాచకొండ కోట దర్శనమిస్తాయి. విజయవాడ జాతీయరహదారి నుంచి వెళ్లాలనుకుంటే చౌటుప్పల్.. సంస్థాన్ నారాయణపూర్ నుంచి వెళితే రాచకొండ వస్తుంది.

ఉత్సవాలు ఏంటి?:

rachakonda2
ఒకప్పుడు తెలంగాణకు రాజధాని రాచకొండ. ఎన్నో చారిత్రక ఘట్టాలకు.. వీరోచిత విజయాలకు కేంద్రం. అద్భుత కట్టడాలకు.. ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవు. అందమైన ప్రకృతికి స్థావరం. అలాంటి రాచకొండ వైభవాన్ని రాష్ట్రవ్యాప్తంగా.. దేశ్యాప్తంగా చాటిచెప్పేందుకు మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం తరపున పర్యాటక శాఖ నిర్వహిస్తున్న పర్యాటక ఉత్సవాలు.

ఎన్ని రోజులు జరుగుతాయి?:

పర్యాటకంగా రాచకొండను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే ఫిబ్రవరి 12, 13, 14 తేదీలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనికి రాచకొండ చారిత్రక.. పర్యావరణ.. పర్యాటక పరిరక్షణ సమితి సహకారం అందిస్తున్నాయి. మూడ్రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వేలాది మంది తరలిరానున్నారు.
rachakonda3

నేపథ్యం:

క్రీస్తుశకం 1400 సంవత్సరాల క్రితం రాచకొండ పట్టణం వెలసిందని చరిత్రకారులు చెప్తున్నారు. తదనాంతరం సింగమ వంశస్థులు.. అనుపోతనాయుడు.. రావు మాదవ తదితర వంశస్థులు రాజులుగా పరిపాలన సాగించారు. రేచర్ల గోత్రం కలిగిన పద్మనాయకులు ఇక్కడి రాజులే. వీరి పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడలేదట. రాచకొండ.. దేవరకొండ.. ఓరుగల్లు.. అమనగల్లు పట్టణాలు రాచకొండ పరిధిలో ఉండేవి. తెలంగాణకు రాజధానిగా రాచకొండ విరాజిల్లింది. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో రాచకొండ పట్టణం చిన్నాభిన్నమైంది.

చారిత్రక కట్టడాలు:

వేల సంవత్సరాల క్రితం రాజులు నిర్మించిన కట్టడాలు రాచకొండలో చాలా ఉన్నాయి. అవి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. గత పాలకులు రాచకొండను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పైగా ధ్వంసం చేయడానికీ వెనకాడలేదు. కానీ తెలంగాణ సర్కారు రాచకొండకు పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నది. మొదటగా దీనిని పర్యాటక ప్రాంతంగా గుర్తించేందుకు నిర్ణయం తీసుకున్నది. రాచకొండలో శివాలయం, రామాలయం, బైరన్నగుడి, వీరన్నగుడి, బోగందాని మంచెం, కుమ్మరి మట్టం, చాకలి మఠం సోరంగ మర్గాలు, శత్రుసైన్యాల నుంచి కాపాడుకోవడానికి రాతితో ప్రహరీ గోడ, గాడ్‌పీర్ల దర్గా, రాజుల కాలం నాటి స్నానాల గది తదితర కట్టాడాలు ఇప్పటికి ఉన్నాయి. వీటిని చూడటానికి నిత్యం పర్యాటకులు వస్తుంటారు.

సిరుల ఖిల్లా:

రాచకొండ పాలకులు ప్రజలను ఎలాంటి ఇబ్బందులకూ గురిచేయలేదు. శిస్తులు.. పన్నులకు వారిని వేధించలేదు. దీనికంతటికీ కారణమూ ఉన్నది. ఇక్కడ సిరిసంపదలకు ఎలాంటి కొదువ లేకుండెనట. శతృదుర్భేద్యమైన కోటలను నిర్మించడమే కాదు.. శతృవులను తుదముట్టించడంలో రాచకొండ రాజులది పైచేయిగా కొనసాగింది. అలా ఎన్నో రాజ్యాలను కూల్చి రాచకొండలో కలుపుకొన్నారు. అలా గెలిచి శతృరాజ్యాల ధాన్య భాండాగారాలను స్వాధీనం చేసుకునేవాళ్లు. దానితో లభ్యమైన ధనంతో చెరవులు.. కుంటలు.. బావులు తోడేవారట. వీటిని వ్యవసాయ అవసరాలకు చక్కగా వినియోగించేవారట. అనపోత సముద్రం.. రాయసముద్రం.. సంకెల్లబావి.. కొలువుకూటం అన్నీ వాళ్లు నిర్మించినవే. రాచకొండ సమీప గ్రామాల్లో ఇప్పటికీ కొన్ని బావులు వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతున్నాయట. ఇలా సాగునీరు ఏర్పాట్ల ద్వారా పుష్కలంగా పంటలు పండి ప్రజలు సిరిసంపదలతో తులతూగేవారట. చారిత్రక కట్టడాలే కాదు.. సాహితీ పరిమళాలు కూడా ఇక్కడ వెదజల్లేవనీ.. సాహితీ ఉత్సవాలు ఇక్కడ జరిగేవని చరిత్రకారులు చెప్తున్నారు.

పిక్‌నిక్ స్పాట్:

చారిత్రక.. ఆధ్యాత్మిక.. పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతున్న రాచకొండ గురించి నేటి తరానికి తెలవాల్సిన ఆవశ్యకత ఉన్నది. రాతిగుట్టలుగానో.. కొండ కోనలుగానో మిగిలివుండి గుప్పిట్లో గుళ్లూ గోపురాలను.. చరిత్ర మూటను పదిలంగా భద్రపరిచిన రాచకొండ ఎప్పటికీ వైభవోపేతంగానే కనిపించాలి. అలా ఉండాలి.. మన చరిత్ర నిలవాలి అంటే ఇలాంటి ఉత్సవాలు ఇంకా ఎన్నో జరిగాలి. అందులో ప్రజల భాగస్వామ్యం ప్రత్యక్షంగా కనిపించాలి. కాబట్టి ప్రాథమికంగా దీన్ని నేటి తరానికి తెలియజేసేందుకు పిక్‌నిక్ స్పాట్‌గా ఎంచుకోండి. తర్వాత్తర్వాత దాని గొప్పదనమేంటో తెలియజేయండి. రాజసానికి.. నిదర్శనమైన రాచకొండను ఎల్లకాలం వెలిగేలా చేయండి.

సందర్భమేంటి?:

rachakonda5
గతేడాది కూడా ఇలాంటి ప్రయత్నం చేసి ఉత్సవాలు నిర్వహించారు. పర్యాటకులు.. చరిత్రకారులు.. ఆధ్యాత్మిక వేత్తల నుంచి మంచి ఆదరణ లభించింది. అయితే వేసవి కావడంతో పర్యాటకులు కొంత అసౌకర్యంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని వేసవికి ముందే ఉత్సవాలు నిర్వహించాలనుకున్నారు. రాచకొండ మార్గంలో స్వయంభుగా వెలసిన శివలింగం.. రాచకొండ కోటలోని శివాలయం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ సందర్భంగా పర్యాటక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఆధ్యాత్మిక కేంద్రం:

rachakonda6
రాచకొండ ఆధ్యాత్మిక కేంద్రంగా ఇప్పటికీ విరాజిల్లుతున్నది. కోటలో ఉండే శివాలయం దూపదీప నైవేద్యాలు అందుకొని భక్తుల పూజలందుకుంటున్నది. రాచకొండకు వెళ్లే మార్గంలోనే శివలింగం వెలసింది. రాచకొండ అటవీ ప్రాంతంలో వెలసిన మరొక ఆలయం సరళ మైసమ్మ. పక్కనే గాడ్ పీర్ల దర్గా ఉన్నది. వైష్ణవాలయం.. రామాలయం.. నరసింహస్వామి ఆలయం ఇలా చాలా ఉన్నాయి. ఇంతటి వైభవాన్ని.. సంపదను పరిరక్షించడానికి స్వచ్ఛందంగా రాచకొండ పరిరక్షణ సమితి.. రాచప్ప కమిటీ.. పర్యావరణ సంఘాలు బాధ్యతగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం.. పర్యాటకశాఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తూ వైభవంగా పర్యాటక ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి.
-దాయి శ్రీశైలం

1063
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles