దివ్యత్వాన్నిచ్చే రాత్రి..!


Tue,February 13, 2018 01:17 AM

మహా శివరాత్రి అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్న అతి పెద్ద రాత్రి. యోగ సంప్రదాయల నుంచి పుట్టిన ఆదిగురువైన శివుని కరుణా కటాక్షాలందించే వేడుకైన రాత్రి. మహా శివరాత్రి నాడు గ్రహాల స్థితిగతులు మానవ శరీర వ్యవస్థకు సహజమైన శక్తిని ఇవ్వగలిగేలా ఉంటాయి. అందుకే శివరాత్రి నాడు రాత్రంతా నిటారుగా కూర్చుని, మేలుకుని ఉండడం అవసరం. తద్వారా శారీరక, ఆధ్యాత్మిక ఆరోగ్యం చేకూరుతుంది.
lord-shiva
శివ అని సూచించబడుతున్న అనంతమైన ఈ శూన్యం పరిమితిలేని నిరాకార స్వరూపం. దానికి మొదలూ, చివరా లేవు. అది శాశ్వతమైనది. అయితే మనిషి అవగాహన, రూపానికి పరిమితమైపోయింది. కాబట్టి మన సంస్కృతి, సంప్రదాయాల్లో ఈ శివ తత్వానికి ఎన్నో అద్భుతమైన స్వరూపాలను సృష్టించుకున్నాం. నిగూఢమూ, అగోచరమూ అయిన ఈశ్వరునిగా, మంగళకరుడైన శంభునిగా, అమాయకత్వంతో మనల్ని నిర్వీర్యులను చేసే భోళా శంకరునిగా, సకల వేదాలూ, శాస్ర్తాలూ, తంత్రాలూ బోధించిన గొప్ప గురువు దక్షిణామూర్తిగా, ఎవరినైనా ఇట్టే క్షమించేసే ఆశుతోషునిగా, ఆ సృష్టికర్త రక్తాన్నే శరీరానికి అలముకున్న కాలభైరవునిగా, ప్రశాంతతకు ప్రతిరూపమైన అచలేశ్వరునిగా, బ్రహ్మాండ నృత్యకారుడైన నటరాజుగా ఆపాదింపబడ్డాయి.

మంచీ చెడూ.. అన్నీ శివుడే!

సాధారణంగా దైవత్వంగా భావించే వాటిని మంచిగా సూచిస్తారు. కానీ శివపురాణం చదివితే శివుణ్ణి మంచివాడనీ అనలేరు, చెడ్డవాడనీ అనలేరు. సర్వస్వమూ ఆయనే. ఆయనే కురూపీ, ఆయనే సుందరమూర్తీను. దుష్టుడూ ఆయనే, ఉత్తమోత్తముడూ ఆయనే. దేవతలూ, రాక్షసులూ మొదలైన సకల జీవరాశులూ ఆయన్ని కొలుస్తాయి. నాగరికతగా పిలువబడే సంస్కారం శివుణ్ణి గురించి మనం జీర్ణించుకోలేని కథలన్నింటినీ తుడిచిపారేసింది. కానీ శివతత్తమంతా అక్కడే ఉంది!జీవితంలో ఒకదానికొకటి విరుద్ధమైన పార్శాలన్నీ శివుని వ్యక్తిత్వంలో నెలకొల్పబడ్డాయి. ఈ సమస్త సృష్టిలోని జటిలమైన లక్షణాల సమాహారాన్ని శివ అనబడే ఈ వ్యక్తిలో ఎందుకు సమ్మేళితం చేశారంటే.. ఈ ఒక్కరిని మీరు పూర్తిగా అంగీకరించగలిగితే మీరిక జీవితాన్ని దాటేసినట్టే! అసలు జీవితంలో ఎప్పుడూ ఎదురయ్యే పెద్ద సమస్య - ఏది మంచి, ఏది చెడు, ఏది సుందరం, ఏది కాదు అనేది నిర్ణయించాల్సి రావడం. జీవితంలోని సంక్లిష్ట లక్షణాల సమాహారమైన ఈ ఒక్క వ్యక్తిని మనస్ఫూర్తిగా అంగీకరించగలిగితే ఇక మరెవరితోనూ ఏ సమస్యా ఉండదు.

పురాణం కాదు... శాస్త్ర విజ్ఞానం!

శివపురాణంలోని కథల్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అందులో ఆధునిక భౌతిక శాస్త్రమంతా కథల రూపంలో ఎంతో అందంగా చెప్పారని గ్రహిస్తారు. విజ్ఞాన శాస్ర్తాన్ని కథనాల ద్వారా చెప్పారు. ప్రతీదానికి ఓ వ్యక్తిత్వం ఇవ్వబడింది. కాలక్రమంలో ఎక్కడో ఆ కథల్లోంచి శాస్త్రం విస్మరించబడి కథలు మాత్రమే కొనసాగించబడ్డాయి. ఆ కథలు కూడా ఒక తరం నుండి మరో తరానికి మారేసరికి అతిశయోక్తులతో చిలవలు పలవలుగా అల్లబడ్డాయి. ఆ కథల్లోకి విజ్ఞానాన్ని చొప్పించగలిగితే శాస్ర్తాన్ని మళ్లీ ఎంతో అందంగా చెప్పవచ్చు. మానవ ప్రకృతిలోని చేతనని ఉత్కృష్ట శిఖరాలకు తీసుకెళ్లగల మహోన్నతమైన విజ్ఞాన ఖనియైన ఈ శివపురాణం అందమైన కథలుగా చెప్పబడింది. కొద్దిగా తరచి చూస్తే శివపురాణమూ, యోగశాస్త్రమూ అవిభాజ్యంగా కనిపిస్తాయి. ఒకటి కథలంటే మక్కువ ఉన్నవారికీ, రెండవది ప్రతి విషయాన్నీ శాస్త్రీయ దృక్పథంతో మాత్రమే చూసి తెలుసుకోవాలనుకునేవారికీ. రెండింటిలోనూ మౌలిక విషయాలు ఒక్కటే.

ఆధునిక విద్యావిధానపు రీతుల గురించి శాస్త్రవేత్తలిప్పుడు ఎన్నో పరిశోధనలు జరుపుతున్నారు. అందులో వారు తెలుసుకున్న విషయమేమిటంటే, 20 ఏళ్ల పాటు ఒక పిల్లవాడు ఒక సంప్రదాయిక విద్యావిధానంలో చదువుకొని బయటకు వస్తే ఆ పిల్లవాని వివేచన శక్తి చాలావరకు తిరిగి కోలుకోలేనంతగా నాశనమైపోతుందని. ఇంకోమాటలో చెప్పాలంటే అతనొక విషయ పరిజ్ఞానం గల మూర్ఖునిగా బయటకొస్తాడు! అందుకే ఈ శాస్త్రవేత్తలిప్పుడు ఆటపాటల ద్వారా, కథా-కథనాల ద్వారా విద్యాబోధన చేయమని సలహా ఇస్తున్నారు. ఈ దిశగా చిన్న చిన్న ప్రయత్నాలు జరిగినప్పటికీ, స్థూలంగా ప్రపంచంలోని విద్యావిధానం చాలావరకు వివేకాన్ని అణచేదిగానే కొనసాగుతోంది. క్రమపద్ధతిలో అందివ్వకపోతే, ఎక్కువ సమాచారం అందించడం వివేచనని అణచివేస్తుంది. ఆ పద్ధతుల్లో కథా రూపకమైన బోధన ఉత్తమమైనది. సంస్కృతిలో గహనమైన వైజ్ఞానిక కోణాలను కథల రూపంలో అందజేశారు.
Sadhguru-Jaggi-Vasudev
- సద్గురు

798
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles