శిగాలు, పూనకాల్లో


Mon,February 12, 2018 11:06 PM

శిగాలు, పూనకాలు జాతర్లలో, క్రతువుల్లో సాధారణంగా కనిపిస్తుంటాయి. ఒంటిపైకి దేవుడు వచ్చాడని, దేవత పూనిందని అంటుంటారు. దానికి ప్రభావితులైన వ్యక్తులు వింతవింతగా ప్రవర్తిస్తుంటారు. ఏమేమో మాట్లాడుతుంటారు. జనాలు వాటిని దేవతల పలుకులుగానే భావిస్తుంటారు. నిజంగా శిగాలు, పూనకాలకు గల కారణం వారి ఒంటి మీద దేవుడు పూనడమేనా? ఇంకేమైనా ఇతర కారణాలున్నాయా? ఒక్కొక్కసారి కొందరు విపరీతంగా ప్రవర్తించడం, పెద్ద పెద్ద బండరాళ్లు ఎత్తడం, బిందెలకొద్దీ నీళ్లు తాగడం, పెద్దపెద్ద చెట్లు ఎక్కడం వంటి వింత చేష్టలు చేస్తుంటారు. ఈ మధ్య కొంతమంది బ్రదర్స్ అని చెప్పుకొంటూ స్వస్థత కూటముల పేరుతో ఏవేవో అరుస్తూ ఉంటే అక్కడ హాజరైనవారు వింతవింతగా ఊగుతుండడం కనిపిస్తున్నది. వాళ్లంతా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. తమకున్న దైవిక శక్తులతో ఒంటిమీద సైతాన్‌ని పారదోలుతున్నామని, దీనితో రోగాలు తగ్గుతాయని, చనిపోయిన వారు కూడా సజీవంగా తిరిగివస్తారని .. అక్కడ స్టేజీపై ఉన్నవాళ్లు చెబుతుంటారు. ఇవన్నీ నిజంగా నిజమేనా? అసలు వీటి వెనుకున్న అసలు కారణమేమిటి?
poonakam
పూనకాలు, శిగాలు ఊగేవాళ్లు చెప్పేవన్నీ నిజాలనీ, స్వస్థత కూటములలో వింతప్రవర్తనలు అతీత శక్తులకు నిదర్శనమనీ అనుకొంటారు చాలామంది. అందులో ఎంత మాత్రం నిజం లేదు. సాధారణంగా ఇవి రెండు రకాలు. వాటిల్లో ఒకటి.. కావాలనే ఇలా ప్రవర్తించి జనాలను మోసం చేయడం. ఇలాంటివారి నాటకాలను పసిగట్టి, వారి బండారాన్ని బట్టబయలు చేయొచ్చు.

ఇంకొకటి మానసిక బలహీనలతల కారణంగా వచ్చిన మానసిక లోపం. ఈ లోపాలనే వాడుక పరిభాషలో హిస్టీరియా అంటారు. ఈ పదం గ్రీకు నుంచి వచ్చింది. గ్రీకు భాషలో హిస్టెరీ అంటే గర్భసంచి అని అర్థం. ఎక్కువగా ఈ మానసిక లోపం మహిళల్లోనే తలెత్తుతుందని దీనికీ పేరు పెట్టారు. ఒకేసారి అనేకమందికి ఇలాంటి లోపం తలెత్తితే మాస్ హిస్టీరియా అంటారు.

కానీ వైజ్ఞానిక పరిభాషలో దీన్ని కన్వర్షన్ డిజార్డర్ అంటారు. ఈ రుగ్మతలు డిసోసియేటివ్ అని, సొమటోఫార్మ్ అని రెండు రూపాల్లో ఉంటాయి. ఈ రుగ్మతలకు గురైనవారిలో.. పరిస్థితికి గల కారణాలను గుర్తించి సరిచేయగలిగితే మరోసారి అలా ప్రవర్తించరు. ఈ చికిత్స జాగ్రత్తగా నిపుణులైన సైకియాట్రిస్టుల ద్వారానే జరుగాలి.

ఈ మానసిక రుగ్మతలు ఎందుకొస్తాయ్?

అసలు మనిషిలో ఇలాంటి మానసిక రుగ్మతలు ఎందుకొస్తాయి? మానసిక ఆందోళనలు జంకు, బిడియం ఉండడం, ఒంటరితనంగా భావించడం, గాలి సరిగ్గా తీసుకోకపోవడం, నరాల నిస్సత్తువ, సరైన రక్తప్రసరణ లేకపోవడం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడడం, తమకున్న బలీయమైన కోరికలు అణచివేయబడడం.. ఇలా అనేక కారణాలు హిస్టీరియాకు దారి తీయవచ్చు. అయితే ఈ హిస్టీరియా లక్షణాలు ఎక్కువగా మహిళల్లో కనబడుతుండడం గమనార్హం. ఇందుకు కారణం బాల్యవివాహాలు, చిన్నతనంలోనే తల్లులవడం, ఎక్కువమంది పిల్లలను కనడం, తమ ఆకాంక్షలను బలవంతంగా మనసులోనే అణిచివేసుకోవాల్సి రావడం, పిల్లలు పుట్టకపోవడం వల్ల సూటిపోటి మాటలతో ఇబ్బంది పడడం వంటి పరిస్థితులు ఆడవారిని తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయి. అందుకే హిస్టీరియా బారిన పడుతున్నారు.

ఇంకొంత మంది తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, తమ బాధలు ఎవరికీ పట్టడం లేదని.. ఈ రకంగా ప్రవర్తిస్తారు. దేవతలు పూనినట్టుగా శిగాలు ఊగిపోవడం ద్వారా అంతకు ముందు తమను గుర్తించనివారు, పట్టించుకోని వారూ.. తమ పట్ల శ్రద్ధ చూపించడం కూడా దీనికి కారణమవుతుంది. వారికి ఎలాంటి రుగ్మత లేకున్నా కూడా తమకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కాలనే ఆశతో ఇలా వింతగా ప్రవర్తిస్తుంటారు. లేని వాటిని ఉన్నట్టుగా భ్రమిస్తుంటారు.

ఇలా శిగాలు, పూనకాలు ఊగేవారు చేస్తున్నది నటనా? లేక నిజంగానే సమస్యలతో బాధపడుతూ ఇలా చేస్తున్నారా? అనే విషయాన్ని గమనించాలి. సమస్యలతో బాధపడుతూ విపరీత ధోరణిలో ప్రవర్తిస్తున్నవారి పరిస్థితిని సానుభూతితో అర్థం చేసుకోవాలి. వారితో చాలా ఓపికగా మసలుకోవాలి. నిపుణులైన సైకియాట్రిస్టులతో చికిత్స చేయించాలి.
-టి. రమేష్
ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్

429
Tags

More News

VIRAL NEWS