వాళ్లది భిన్నమైన మెదడు


Mon,February 12, 2018 11:04 PM

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు బ్రెయిన్స్‌లో క్రియేటివ్ బ్రెయిన్స్ వేరుగా ఉంటాయట. సృజనాత్మకతమైన ఆలోచనలు చేసే మెదడుపై తాజా పరిశోధన ఆసక్తికరవిషయాలను వెల్లడించింది.
different-mind
మిగితావారితో పోలిస్తే క్రియేటివ్ మైండ్‌సెట్ ఉన్నవారు ఈ ప్రపంచాన్ని భిన్న కోణంలో చూస్తారు. వినూత్నంగా ఆలోచిస్తారు. ప్రతిక్షణం కొత్తదనాన్ని ఆవిష్కరించే దిశగా వారి ఆలోచనలు సాగుతుంటాయి. అసలింతకూ వీరి ఆలోచనాధోరణి అలా ఉండేందుకు కారణం ఏమిటి? ఇదే విషయంపై హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వీళ్ల ఆలోచనలే కాదు, మెదడు నిర్మాణం కూడా భిన్నంగానే ఉంటుందని తేల్చారు. సృజనాత్మక వ్యక్తుల ఆలోచన భిన్నంగా ఉండడానికి.. వాళ్ల మెదడు నిర్మాణం భిన్నంగా ఉండడమే కారణమని తేల్చారు. క్రియేటివ్ ఆలోచనలలో ముందుకొచ్చే కొందరిని ఎంపిక చేసుకొని, స్కాన్ చేయడం ద్వారా వారి మెదడులో జరిగే నిరంతర క్రియను అధ్యయనం చేశారు.

కొత్త ఆలోచనల్లో మెదడు నిమగ్నమై ఉన్నప్పుడు డిఫాల్ట్ మోడ్ నెట్‌వర్క్, ది సాలియన్స్ నెట్‌వర్క్, ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ నెట్‌వర్క్ అనే మూడు సబ్‌నెట్‌వర్క్‌లు ముఖ్య పాత్ర పోషిస్తాయని గుర్తించారు. డిఫాల్ట్ మోడ్ నెట్‌వర్క్ జ్ఞాపకశక్తి, మానసిక అనుకరణలో క్రియాశీలకంగా ఉంటే, సాలియన్స్ నెట్‌వర్క్ ముఖ్యమైన సమాచార సేకరణలో, ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ నెట్‌వర్క్ ఉపయోగకరమైన ఐడియాల మీద ఫోకస్ పెడుతుందట. మొత్తానికి ఈ నెట్‌వర్క్‌ల మధ్య బందం దృఢంగా ఉండడమే క్రియేటివ్ మైండ్‌సెట్ ఉన్నవాళ్ల బలమని పరిశోధనకులు కనుగొన్నారు. మిగితా వారిలో ఈ నెట్‌వర్క్‌ల మధ్య కనెక్షన్లు అంత దృఢంగా ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. క్రియేటివ్ బ్రెయిన్ నిర్మాణం మిగితావాటితో పోలిస్తే భిన్నంగా నిర్మాణమై ఉండడం కూడా ఒక కారణం కావొచ్చంటున్నారు. అందుకే వాళ్ల ఆలోచనావిధానం అందరికీ భిన్నంగా, వినూత్నంగా ఉంటుందని చెబుతున్నారు.

662
Tags

More News

VIRAL NEWS