క్లిక్ చేస్తే.. డెవలపర్ చరిత్ర


Sat,January 19, 2019 01:25 AM

ఫ్లాటు కొనడానికి వెళితే.. అక్కడి ఎగ్జిక్యూటివ్ ఆకర్షణీయమైన మాటలతో ఆకట్టుకుంటాడు. ఫ్లాట్లన్నీ దాదాపుగా బుక్ అయిపోయాయని మొదట్లో బుకాయిస్తాడు. ఆయా ప్రాజెక్టు స్థల యజమాని గురించి అడిగితే తన నోటి నుంచి మాట రాదు. కొనాలనుకునే ఫ్లాట్ కార్పెట్ ఏరియా గురించి చెప్పమంటే చెప్పకపోవచ్చు. ఆయా ప్రమోటర్‌కి సకాలంలో ఫ్లాట్లను అందజేసే ఘనచరిత్ర గురించి అడిగినా పట్టించుకోడు. ఇంటికి సంబంధించిన అనుమతి పత్రాల్ని చూపించమంటే చిర్రెత్తుకొస్తుంది. చివరికీ, ఇష్టముంటే కొనండి.. లేకపోతే లేదు.. అని మొహం మీదే చెప్పేస్తాడు. ఇప్పటివరకూ సర్వసాధారణమైన ఇలాంటి సన్నివేశాలు ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కనిపించవు. ఎందుకంటే, ఒక క్లిక్ కొడితే చాలు.. ఇంటి చరిత్రతో బాటు ప్రమోటర్ చరిత్ర కూడా ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది. అదెలా అంటారా?
rera
మీరు హైదరాబాద్‌లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారా? భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవడానికి ప్లాటు కొంటారా? లేక మీ బడ్జెట్‌లో నచ్చిన ఫ్లాట్ తీసుకోవాలని అనుకుంటున్నారా? మీ అవసరాలు ఏవైనా.. భవిష్యత్తులో ఎలాంటి బాదరాబందీల్లేకుండా ఉండాలని కోరుకునే వారి కోసమే.. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రెరా అథారిటీని ఏర్పాటు చేసింది. రెరా పోర్టల్ ప్రారంభించింది. ఇందులో (rera.telangana.gov.in)కి వెళితే చాలు.. మీకు నచ్చిన వెంచర్లు లేదా ప్రాజెక్టుల సమాచారం ఇట్టే లభిస్తుంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా.. కాస్త ఓపికగా వివరాల్ని చూసుకోవడమే.

రెరా సైటు హోమ్ పేజీలోని సర్వీసెస్‌కు వెళ్లి క్లిక్ చేస్తే చాలు.. సెర్చ్ రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ అండ్ ఏజెంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే.. మీకో కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో (శుక్రవారం నాటికి) సుమారు 173 ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం ఉంది. ఆయా ప్రాజెక్టు పేరు, ప్రమోటర్ పేరు, ఎప్పుడు రెరా అనుమతి లభించింది వంటి వివరాలు ఇట్టే తెలుస్తాయి. వ్యూ డిటెయిల్స్ మీద క్లిక్ చేస్తే చాలు.. ప్రమోటర్ పేరు, చిరునామా, ఫోన్ నెంబరు, సంస్థ వెబ్‌సైటు, ప్రాజెక్టు పేరు వంటి వివరాల్ని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, ఆయా బిల్డర్ ఎంత విస్తీర్ణంలో నిర్మాణం చేపడుతున్నారు? అతని స్థలం చుట్టుపక్కల ఉన్న సరిహద్దుల వివరాలు, ఎంత బిల్టప్ ఏరియా కడతాడు? అందులో తనఖా పెట్టిన స్థలమెంత వంటివి సులువుగా అర్థమవుతాయి.

ఎన్ని అమ్మేశాడు?

మనం ప్లాటు లేదా ఫ్లాటు కొనాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు.. ఏదైనా వెంచర్ లేదా ప్రాజెక్టు వద్దకు వెళితే ఆయా ప్రమోటర్ పేరు తెలుసుకోవడం కష్టమవుతుంది. కానీ, ఇక్కడ మాత్రం ప్రమోటర్ పూర్తి వివరాలు తెలిసిపోతాయి. ప్రమోటర్ నిర్మించేది సొంత స్థలంలోనా? లేక స్థల యజమానితో ఒప్పందం కుదుర్చకుని నిర్మాణం చేపడుతున్నారా? ప్రమోటర్లు లేదా స్థల యజమానులు ఎంతమంది ఉంటే.. అంతమంది వివరాలు రెరా పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. అందులో ఎన్ని ప్లాట్లు లేదా ఫ్లాట్లను నిర్మిస్తారు? ఇప్పటివరకూ ఏమైనా విక్రయించారా? వంటివి కళ్ల ముందే కనిపిస్తాయి.

సాధారణంగా రియల్ ఎస్టేట్ డెవలపర్లు బయటికి చెప్పని సమాచారం రెరాలో పొందుపరుస్తారు. ఆయా ప్రాజెక్టులో అంతర్గత రోడ్లు వేస్తున్నారా? మంచినీటి సరఫరా ఉందా? మురుగునీటి సౌకర్యం కల్పించారా? ఎస్టీపీని ఏర్పాటు చేశారా? వరద నీటి కాల్వలను పొందుపరిచారా? వీధి దీపాలు ఏ స్థాయిలో ఉన్నాయి? పార్కులు, ఇంధన వినియోగం, అగ్ని వ్యాపించకుండా ఎలాంటి చర్యల్ని తీసుకున్నారు? విద్యుత్తుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నారా? మొత్తం వచ్చే ఖాళీ స్థలమెంత? ఇలా ఒక ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి. ఏయే అంతస్తులో ఎన్ని ఫ్లాట్లు వస్తాయి? అందులో తనఖా ఫ్లాట్లు ఎన్ని? ఒక్కో ఫ్లాటు విస్తీర్ణమెంత? వంటివీ తెలుస్తాయి.

కట్టడంలో ఉపయోగించేదేమిటి?

ప్రస్తుతం నిర్మాణం ఏ స్థాయిలో ఉంది? ఎన్ని పునాదులొస్తాయి? పోడియంల సంఖ్య, స్టిల్ట్ ఫ్లోరు, సూపర్‌స్ట్రక్చర్ శ్లాబులెన్ని? అంతర్గత ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్, శానిటరీ ఫిట్టింగులు, మెట్లు, లిఫ్టులు, ఓవర్ హెడ్/అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకులు, ప్లంబింగ్ పనికి సంబంధించిన వివరాలు, వాటర్ ప్రూఫింగ్ చేశారా? మొత్తం వాటర్ పంపులెన్ని? కామన్ ఏరియాస్‌లో వినియోగిస్తున్న ఎలక్ట్రికల్ ఫిట్టింగులు, ప్రహారీ గోడ వంటి వివరాల్ని ఇట్టే తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఆయా ప్రాజెక్టు ఆర్కిటెక్ట్, స్ట్రక్చరల్ ఇంజినీర్ వివరాలూ పొందుపరిచి ఉంటాయి.

పత్రాలన్నీ అక్కడే..

మనం ప్లాటు లేదా ఫ్లాటు కొనాలనుకున్నప్పుడు.. ఆయా భూయాజమాన్య హక్కుల్ని తెలుసుకోవాలనుకుంటాం. అయితే, అందుకు సంబంధించిన వివరాల్ని నోరు తెరిచి డెవలపర్‌ని అడిగితే పెద్దగా స్పందించకపోవచ్చు. మరికొందరేమో ఇష్టం ఉంటే కొనండి.. లేకపోతే లేదు.. అనే సమాధానాన్ని మొహం మీదే చెప్పేస్తుంటారు. అయితే, రెరాలో మాత్రం మీరు కొనాలనుకుంటున్న ప్లాటు లేదా ఫ్లాటుకు సంబంధించిన భూయాజమాన్య హక్కుల్ని ఇట్టే తెలుసుకోవచ్చు. ఆయా స్థలానికి సంబంధించి ఈసీ, అప్రూవల్ ప్లాన్, ఒప్పంద పత్రం నమూనా, స్థానిక సంస్థ అనుమతి పత్రం, ఆర్కిటెక్ట్ సర్టిఫికెట్, నిర్మాణం ఎప్పట్నుంచి చేపడతారు. ఫామ్-బి.. ఇలా మీరు కొనాలనుకునే ఫ్లాటుకు సంబంధించిన ప్రతిఒక్క విషయాన్ని రెరా పోర్టల్‌ల్లో చూస్తే తెలుస్తుంది.

కింగ్ జాన్సన్ కొయ్యడ కొనుగోలుదారులకు పూర్తి స్థాయి భద్రత..

తెలంగాణ రాష్ట్రంలో ఇండ్ల కొనుగోలుదారులు ఇక నుంచి పూర్తి భరోసాగా ఉండొచ్చు. రెరా అనుమతి పొందిన ప్రాజెక్టుల్లో ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులుండవు. నిర్మాణం చేపట్టే బిల్డర్ సకాలంలో ఫ్లాట్‌ను అందజేస్తారు. పైగా, ఇల్లు కొన్న తర్వాత ఐదేండ్ల పాటు నిర్మాణంలో ఎలాంటి లోపాలున్నా బిల్డరే బాధ్యత వహిస్తాడు. రెరా వెబ్‌సైటులో ప్రాజెక్టులను చూస్తే.. వాటిలో ఫ్లాటు కొనాలా? వద్దా? అనే తుది నిర్ణయానికి ఎవరైనా ఇట్టే రావొచ్చు. రెరాలో నమోదయ్యే వెంచర్లలో ప్లాట్లు కొనేవారు తమ స్థలం గురించి నిశ్చింతగా ఉండొచ్చు. అట్టి ప్రమోటర్లతో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా రెరాకు ఫిర్యాదు చేస్తే చాలు.. వారే సమస్యను పరిష్కరిస్తారు. తను వినకపోతే జైలుకూ పంపిస్తారు.

550
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles