
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అన్ని నివాస, వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్ స్థలంలో 20 శాతం స్థలాన్ని ఎలక్ట్రిక్ వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయించాలంటూ కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల మార్గదర్శకాల్ని విడుదల చేసింది. దీని ప్రకారం పార్కింగ్ ఏరియా, నిర్మాణాల రకం ఆధారంగా వాహనాల ఛార్జింగ్ పరికరాలను అమర్చుకోవటంతో పాటు, తగినంత విద్యుత్ సరఫరా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా నిర్మాణాల్లో ఉండే వాహన వినియోగదారులు ఛార్జింగ్‌కు అయ్యే ఖర్చును యజమానికి చెల్లించాలి. దీంతో పాటు సందర్శకుల ఎలక్ట్రికల్ వాహనాల కోసం ప్రత్యేకంగా ఓపెన్ మీటరింగ్‌ను ఏర్పాటు చేసి ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పించాలి. విద్యుత్ సరఫరా విషయంలో తగినంత ఏర్పాట్లను విద్యుత్ పంపిణీ కంపెనీలు చేయాల్సి ఉంటుంది. వాహనాల ఛార్జింగ్ పరికరాల ఏర్పాట్ల విషయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని మార్గదర్శకాల్లో సూచించింది.
నగరంలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్, జాతీయ రహదారిపై ప్రతి 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. వాహనాలకు అందించే ఛార్జింగ్‌కు గాను సరఫరాకు అవుతున్న సరాసరి ఖర్చు కంటే 15 శాతం అదనంగా వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. నూతనంగా ఏర్పాటు చేసే ప్రజా సర్వీస్ ఛార్జింగ్ స్టేషనల్లో సర్వీస్ ఛార్జీలను ఎంత వసూలు చేయాలనే విషయాన్ని ఆయా రాష్ట్రాలకు అప్పగించింది.