నందులు పరిపాలించిన నాందేడ్


Fri,January 4, 2019 12:33 AM

పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉంది నాందేడ్. నాందేడ్‌ను నందులు పరిపాలించారని అంటారు. మరఠ్వాడా ప్రాంతంలో రెండో అతిపెద్ద నగరం నాందేడ్. సిక్కులకు ఇది పవిత్ర ప్రదేశం. వనవాస కాలంలో శ్రీరాముడు ఇక్కడ కొన్నాళ్లు గడిపాడని అంటారు. మహారుషి వాల్మీకి, మహాకవి కాళిదాసు, భవభూతి వంటివారు తమ రచనల్లో నాందేడ్ గురించి ప్రస్తావించారు. విదేశీ పర్యాటకుడు టోలమీ తన గ్రంథంలో సైతం నాందేడ్ ప్రముఖ వాణిజ్య కేంద్రంగా భాసిల్లిందని పేర్కొన్నారు.
Nadhend
నాందేడ్ పట్టణం మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతం మధ్య భాగంలో ఉంటుంది. పర్యాటకులు ఈ పట్టణాన్ని తప్పక సందర్శించాలి. ఈ పట్టణంలో ప్రసిద్ధి గాంచిన సిక్కుల పుణ్యక్షేత్రం హజూర్ సాహిబ్ కూడా ఉంది. ఇది గురు గోబింద్ సింగ్ మరణం తర్వాత నిర్మితమై సచ్ ఖండ్ గురుద్వారాను పోలి ఉంటుంది. మొఘల్ సామ్రాజ్యాధినేత ఔరంగజేబు కాలంలో సిక్కు మత గురువు గురు గోబింద్ సింగ్ నాందేడ్‌ను సందర్శించారని అంటారు. గురు గోబింద్ సింగ్ తన ప్రాణాలను ఇక్కడే వదలడంతో సిక్కులు పవిత్ర గురుద్వారాను ఏర్పాటుచేసుకున్నారు. ఈ గురుద్వారా నిర్మాణానికి 1835లో మహారాణా రంజిత్ సింగ్ ఆర్ధిక సాయం అందించారని చెబుతారు. మొగలాయిలు భారత ఉపఖండాన్ని పాలించినప్పటి నుంచి నాందేడ్ ప్రాముఖాన్ని సంతరించుకొంది. కాలక్రమేణా ఇది ఒక పవిత్ర నగరంగా విరాజిల్లుతున్నది.


ఎందరో పాలకులు

నాందేడ్ గురించి పురాణాలలో ప్రస్తావన ఉంది. పాండవులు ఈ ప్రాంతంలో సంచరించారని అంటారు. నాందేడ్‌ను పూర్వకాలం నందితత్ అని పిలిచేవారు. శాతవాహనులు కూడా నాందేడ్‌ను పరిపాలించారని చరిత్రకారులు పేర్కొంటున్నారు. చాళుక్య వంశ రాజు నందదేవుడు నాం దేడ్ రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. రాష్ట్రకూటు లు, చాళుక్యులు, కాకతీయులతో పాటు దేవగిరి యాదవ రాజులు నాందేడును తమ రాజ్యంలో భాగంగా అభివృద్ధి చేశారు. బహమనీ సుల్తానుల కాలంలో తెలంగాణ సుభా కింద నాందేడ్ ఉండేది.

చూడాల్సిసిన ప్రాంతాలు

నేడు నాందేడ్ అనేక సిక్కు పుణ్యక్షేత్రాలకు, మసీదులకు పేరు గాంచింది. అంతేకాదు, నాందేడ్‌లో ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి. కాంధార్‌దర్గా, బిహోలి మసీదు, గోవింద్ పార్క్, పట్టణానికి 100 కి.మీ.ల దూరంలో గల ఇసాపూర్ డ్యామ్ కూడా చూడొచ్చు. నాందేడ్‌లో హిందువుల ప్రసిద్ధ పండుగ అయిన నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. నాందేడ్ పట్టణ వీధులు విక్రయాలతో కళ కళ లాడుతూ ఉంటాయి. వివిధ రకాల వస్తువులు అమ్మే వారు, మతపర వస్తువుల, బట్టలు, ఆభరణాల దుకాణాల్లో అధిక వ్యాపారం జరుగుతుంటుంది.
Nadhend1

మాహూర్

శ్రీ మహావిష్ణువు సోదరి పార్వతీ అమ్మవారి శక్తి పీఠాల్లో ఒకటి మాహూర్యం. వైకుంఠ నాథుడైన శ్రీమన్నారాయణ అవతారాల్లో ఒకటైన పరశురాముడి జనని రేణుకా దేవి ఇక్కడే జన్మించిందని పురాణాల్లో ప్రస్తావించారు. రేణుకా అమ్మవారి గుడిని యాదవ వంశ రాజు నిర్మించారు. ఇక్క డ అనేక దేవాలయాలు ఉన్నాయి. నాందేడ్ నుంచి 126 కి.మీ., నాగపూర్ నుంచి 250 కి.మీ. దూరం లో ఉంది మాహూర్.

నాందేడ్ కోట

గోదావరి నది ఒడ్డున నాందేడ్ కోట ఉంది. నాందేడ్ కోటకు మూడువైపులా గోదావరి నది ఉంది. నాందేడ్‌లో ఇంకా పురాతన కోటలు కాంధార్, ధారూర్ , కుంతలగిరి వంటివి ఎన్నో ఉన్నాయి . ఈ మరాఠా కోటలన్నీ ఫొటోగ్రఫీ చేసేవారికి ఎంతోగానో ఉపయుక్తం కాగా పర్యాటకులకు తమ కాలినడకన వీటిని చూసి ఆనందించేవిగా ఉంటాయి. నాందేడ్‌లో ట్రెక్కింగ్ చేయడానికి అనువైన ప్రాంతాలు అనేకం ఉన్నాయి. పర్యాటక రంగానికి పెద్ద పీట వేసేలా పలు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టు బడులు పెట్టడానికి ఆసక్తి చూపుతుండడంతో నాందేడ్ పర్యాటక, వాణిజ్య ప్రాంతంగానూ విలసిల్లుతున్నది.

శీతాకాలం ఉత్తమం

నాందేడ్ సందర్శనకు శీతాకాలం ఎంతో ఉత్తమం. నాందేడ్‌లో వేడి, పొడితోకూడిన వేసవులు, తక్కువ నుండి ఒక మోస్తరు వర్షాలు పడతాయి. శీతాకాలం చలిగానే ఉంటుంది. నాందేడ్ చేరాలంటే, అన్ని రవాణాలు అంటే, రోడ్డు, రైలు, విమానం ఉన్నాయి. ఇటీవలే, నాందేడ్ స్ధానిక విమానాశ్రయం మరమ్మతులు చేసి ఆధునీకరించారు. ముంబై, న్యూఢిల్లీ వంటి నగరాలకు వెళ్ళే పెద్ద విమానాలను కూడా ఇక్కడ నిలుపుతారు. నాందేడ్ పట్టణం ఇండియాలోని అన్ని ప్రధాన నగరాలకు రైలుతో అనుసంధానించారు. చెప్పాలంటే, నాందేడ్ ఇండియాలోని అరుదైన ప్రదేశాలలో ఒకటి.
Nadhend2

ఎలా వెళ్లాలి?

నాందేడ్ ముంబై నగరం నుండి 576 కి.మీ.ల దూరంలో ఉంది. నేషనల్ హైవే 7 ద్వారా చేరవచ్చు. మహారాష్ట్ర, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి నాందేడుకు బస్సులున్నాయి.

రైలు ప్రయాణం- ఉత్తర భారతదేశంలోని పర్యాటకులు అతిగా ఇష్టపడేది రైలు ప్రయాణం మాత్రమే. ఇది చాలా సౌకర్యం తూర్పు దిశగా నాగపూర్ నుండి ముంబై నగరం నుండి ఇక్కడకు రైలులో చేరవచ్చు. సికింద్రాబాద్-మన్మాడ్ మార్గంలో ఉంది నాందేడ్ రైల్వేస్టేషన్. ఇక్కడి నుంచి ముంబయి, నాగపూర్, న్యూఢిల్లీ, సికింద్రాబాద్, బెంగళూరులకు నేరుగా రైళ్లు ఉన్నాయి.

విమాన ప్రయాణం-హైదరాబాద్ (284 కి.మీ.) సమీపంలోని విమానాశ్రయం. ముంబై, పూనే, నాగపూర్ నగరాలనుండి ప్రసిద్ధి చెందిన విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇటీవలే ఇక్కడి విమానాశ్రయాన్ని ఆధునీకరించారు.
మధుకర్ వైద్యుల

1036
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles