చండీ కటాక్షం!


Thu,January 17, 2019 11:30 PM

ప్రచండ శక్తి, పరబ్రహ్మ స్వరూపిణి, సమున్నత దేవత
ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ రెండో పర్యాయం దిగ్విజయం సాధించిన తర్వాత, తిరిగి రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన మన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మరోసారి శక్తివంతమైన, మహిమాన్వితమైన యాగదీక్షకు పూనుకున్నారు. సోమవారం(21వ తేది) మహారుద్ర సహిత సహస్ర చండీయాగాన్ని గజ్వేలు దగ్గర్లోని వారి వ్యవసాయ క్షేత్రంలో ప్రారంభించనున్నారు. శుక్రవారం (25వ తేది) వరకు అయిదు రోజుల పాటు జరగనున్న ఈ బృహత్ యజ్ఞం సందర్భంగా.. ప్రచండ శక్తి, పరబ్రహ్మ స్వరూపిణి, సమున్నత దేవత అయిన చండికా మాత మహోన్నతమైన దివ్యమంగళ విశేషాలను క్లుప్తంగా తెలుసుకుందాం.
chandi-kataksham
నాటి రాజులు, ఋషుల నుంచి నేటి పాలకులు, యోగుల వరకూ అందరూ అత్యధిక ప్రాధాన్యమిచ్చే యాగాలలో చండీదే ప్రథమ స్థానం. 1997 నుంచి మన కేసీఆర్ నిర్వహించిన పలు యాగాలలో చండీ అమ్మవారువే అత్యధికం. తెలంగాణ రాష్ట్రం సాధించాక 2015 డిసెంబర్‌లో ఆయన నిర్వహించిన ఆయత (సుదీర్ఘమైన, గొప్పనైన) చండీయాగం తర్వాత ఇప్పుడు మరింత విశిష్ఠ స్థాయిలో మహారుద్ర సహితంగా సహస్ర చండీని నిర్వహిస్తున్నారు. సహస్రాని (వెయ్యి)కి పదిరెట్లు (పది వేలు) ఆయతం. (దీనికి పదిరెట్లతో లక్ష చండీయాగమూ ఉంటుంది).


ప్రత్యేకించి చండీయాగానికి ఎందుకింత ప్రాధాన్యం? అసలు ఎవరీ చండీమాత? దేవతల నుంచి మానవాది జీవులన్నీ ఆమె కరుణా కటాక్షం కోసం ఎందుకింతగా తపించిపోతుంటాయి? ఆమె స్వరూప స్వభావాలు, శక్తి పరాత్పరత, ఉపాసనా బలం ప్రతి ఒక్కరూ తెలుసుకోదగ్గవి. ఆమె కటాక్షం కోసం వేడుకోదగ్గవే.


చండి లేదా చండిక వంటి పేర్లలోనే మహోగ్రమనే శబ్దం దాగుంది. సృష్టి, స్థితి, లయలకు, చరాచర జీవరాశులకు అన్నింటికీ మూలాధారం ఆమెనే. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమెనే పరాశక్తి, పరాత్పరిణి, పరదేవత, పరబ్రహ్మ స్వరూపిణీ, సకల దేవతలకందరికంటే సమున్నతమైంది. ఆమె వదనం ఎంత ప్రచండమో, అంత ప్రసన్నం. అద్భుతమైన, అనితర సాధ్యమైన ఆ తల్లి స్తోత్ర మహత్తు, గొప్పతనం, తేజోభరిత విశేషాలను తెలుసుకోవాలంటే శ్రీ చండీ సప్తశతిలోకి వెళ్లాల్సిందే. సాక్షాత్తు వ్యాసభగవానుని సృష్టే ఈ సప్తశతి స్తోత్రం. దీనినిబట్టి, చండీ ప్రాశస్త్యం, విలువ ఎంతటివో మనకు తెలుస్తాయి.


జగత్తులోని అన్ని విశేష శక్తులకూ ఆత్మ (నిజానికి పరమాత్మే) చండిక. శివునాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అన్న శాస్ర్తోక్తి మాదిరిగానే చండిక సకల కార్యాల్లోనూ అంతర్లీనంగా ఆసీనురాలై ఉంటుందనీ వేద పండితులు అంటారు. అన్ని శక్తులకూ ఆమెనే ఉపాదానం (మూలం). కాబట్టి, ఈమెను సామాన్య రూపిణిగానూ పిలుస్తారు. అటు బ్రహ్మదేవునికి చిన్మాత్ర రూపమని, ఇటు పరమేశ్వరునికి అర్ధ శరీరిణి అనీ శ్వేతాశ్వతరోపనిషత్ చెబుతున్నది. అలాగే, మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ ముగ్గురమ్మల మూలపుటమ్మ కూడా చండీయే. మొత్తంగా ఆమె పరదేవత (ఆదిపరాశక్తి)గానే సప్తశతిలో ఘనమైన స్తుతిని పొందుతున్నది. సూత సంహితలో పేర్కొన్నట్టు పరదేవతా స్వరూపమైన చండిక శక్తికి, పరమేశ్వరునికి మధ్య భేదమే లేదని సాక్షాత్ శ్రీ శంకర భగవత్పాదులు (ఆది శంకరాచార్య) వారే వ్యాఖ్యానించారు.


మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, బ్రహ్మరూపమే బ్రహ్మధర్మిణిగా, పరమేశ్వరుని రూపమే పరమేశ్వరీగా కూడా ఆమెనే సాక్షాత్కరిస్తుంది. సకల జగన్మాతగా ఆమె అనుగ్రహాన్ని పొందడానికే పలు శాస్ర్తాలు తనను వివిధ రూపాలుగా అభివర్ణించాయి. చండీదేవినే పుంరూపాన్ని, బ్రహ్మరూపాన్నీ పొందినట్లు, గాయత్రి, త్రిపురాసుందరి.. ఇలా అనేక పేర్లతో, రూపాలతో ఆమె కొలువబడుతున్నట్లు శ్రుతులు, స్మృతులు, పురాణాలు పేర్కొంటున్నాయి.


అన్ని అవతారాలకు మూలమైన మహాలక్ష్మీ స్వరూపం, మహాకాళీ రూపంతోపాటు చంద్రకాంతితో దగద్ధాయమానంగా వెలుగొందే మహాసరస్వతీ స్వరూపాన్ని కూడా త్రిగుణాల (సత్వ, రజో, తమో)ను అనుసరించి చండికయే పొందినట్లు శ్రీ సప్తశతి వెల్లడించింది. ఈ శక్తులన్నీ భర్తృరహితాలని, స్వాతంత్య్రాలని, విషయ వాసనలు లేనివని కూడా ఆ స్తుతి మంత్రాలు పేర్కొన్నాయి. ఈ ముగ్గురు తల్లులూ మాయాశక్తి సామర్థ్యంతో పురుషభావాన్ని కూడా పొందినట్లు చెప్తారు. కాబట్టే, ఈ పరాశక్తిని మాయ, నిద్ర, తామసి అని కూడా వ్యవహరిస్తున్నారు. ఇదే ప్రళయానంతరం కూడా కారణబీజంగా మారుతున్నట్లు పండితులు పేర్కొన్నారు. ఈ మాయాబీజంలోని బీజాక్షరమన్నా చండికయే అని, ఆత్మన ఆకాశ: సంభూత: అంటూ శ్రుతివాక్యాలలో చెప్పినట్టు సూక్ష్మ, స్థూల దేహాలు ఉత్పన్నమవుతాయని సప్తశతి తెలిపింది. ఈ రకంగానే బ్రహ్మదేవునికి మూలమంత్రంగా ప్రణవం ఆవిర్భవించిందని వారు అంటారు.
- దోర్బల బాలశేఖరశర్మ


chandi-kataksham2

ఉగ్రరూపానికే తొలి వందనం!

ప్రచండ రూపంలో ఉన్న చండికను ప్రసన్నం చేసుకోవడానికి ముందు ఆమె ఉగ్రరూపానికే వందనాలు సమర్పించాలని వేద పండితులు చెప్తారు. నమస్తే రుద్రమస్యవే.. అంటూ వేడుకోవాలి. శ్రీ సప్తశతీ స్తోత్రం వల్లే ఆమె అనుగ్రహం లభిస్తుందని, సకల అభీష్టాలూ సిద్ధిస్తాయని మార్కండేయ పురాణమూ పేర్కొన్నది. వేదమంత గొప్పది, అనాదిది, అద్భుత శక్తివంతమైంది సప్తశతి. కనుకనే, చండికకు, చండీహోమానికి అంతటి ప్రాధాన్యం. యావత్ కలియుగానికే ఈ చండీ ఉపాసన అత్యంత శ్రేష్ఠమని, శక్తిదాయకమనీ వారు అంటారు. వారాహి తంత్రం మేరకు భగవద్గీత, విష్ణుసహస్ర నామస్తోత్రాలతో సమానంగా చండీ సప్తశతి, చండీ సహస్రనామ స్తోత్రం ఉన్నాయని, ఈ నాలుగూ అత్యంత ప్రసిద్ధమని పోతుకూచి శ్రీరామమూర్తి విరచిత గ్రంథం శ్రీ చండీ సప్తశతీ మీమాంస (సాధన గ్రంథ మండలి, తెనాలి) పేర్కొంది.

744
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles