అలౌకిక ప్రేమామృతం


Fri,January 4, 2019 12:44 AM

గోదా కల్యాణానికి వేళ ఇదే!
ప్రస్తుత ధనుర్మాసం ముగిసే వేళ (14వ తేదీన) జరగనున్న గోదా రంగనాథుల కల్యాణ వైభోగం విష్ణుభక్తులందరికీ మహావేడుక. ఈ సందర్భంగా విలక్షణమైన ఆండాళ్ తల్లి దివ్య ప్రేమ ప్రబంధాన్ని తెలియజేసే ప్రత్యేక రచన.
premamrutham
లోకకల్యాణం కోసమైతేనేం, మనకు స్ఫూర్తినివ్వడానికి అయితేనేం, ప్రతి ఏటా దేవతల పెండ్లిళ్లు జరుపుకోవడం ఆనవాయితీ. సీతాకల్యాణం, పార్వతీ కల్యాణం, భద్రాకల్యాణం, పద్మావతీ కల్యాణం.. ఇలా వీటి కోవలోకి వచ్చేదే గోదా కల్యాణం. అయితే, వాటన్నింటికంటే భిన్నమైంది గోదాదేవి ఇతివృత్తం. అద్భుత వేదోపనిషత్తుల సారాన్ని ముచ్చటగా ముప్పయి పాశురాలలో పాడి, అనంత ప్రేమామృతాన్ని రంగనాథునిపై కురిపించి, స్వామి అనుగ్రహానికి, మమకారానికీ పాత్రురాలవడమేకాక ఆఖరకు ఆయనలోనే విలీనమైన శ్రీ మహాలక్ష్మీ అవతారిణి ఆమె.


లౌకికమైనా, అలౌకికమైనా ప్రేమ ప్రేమే. అది ఎంత అజరామరమో అంత అద్భుతం. మనుషులకైనా, దేవుళ్లకైనా పెండ్లికి కల్మషం లేని ప్రేమ తప్పనిసరి. ప్రేమికులు పెండ్లితో కలవడమన్నది వారి పూర్వజన్మ సుకృతమేనన్న ప్రగాఢ భావనలో నిజం లేకపోలేదు. దీన్ని నిరూపించే ప్రేమకథలూ అనేకం. గత జన్మలో ప్రేమించుకొని ఒక్కటి కాలేక పోయిన వారే ఈ జన్మలో పరస్పరం ఇష్టపడి ఒక్కటవుతారన్న దానిని నిరూపించే సంఘటనలు పౌరాణికంగానూ అనేకం కనిపిస్తాయి. ఈ లెక్కన ప్రేమ పెండ్లిళ్లు నిన్న మొన్నటివి కాదు, యుగయుగాల నాడే ఆవిర్భవించాయన్నది స్పష్టం.


ఆదర్శ ప్రేమికులు ఎవరంటే చాలామందికి గుర్తొచ్చే వారు రాధాకృష్ణులే. కానీ, అదే విష్ణు అవతారానికి చెందిన రంగనాథుణ్ణి అంతే ఇదిగా ప్రేమించి, స్వామి ప్రేమను గెలిచి, ఎట్టకేలకు ఆయనలో విలీనమైన గోదాదేవి వృత్తాంతమూ తక్కువదేమీ కాదు. ఆమె అలౌకిక ప్రేమలోని స్వచ్ఛత, నిజాయితీ, మాధుర్యం అంత క్రితం ద్వాపర యుగానికి చెందిన శ్రీకృష్ణుని పట్ల గోపిక రాధ ప్రదర్శించిన ప్రేమను తలపించేవే తప్ప మరొకటి కాదు. మానవ స్త్రీలు దేవుళ్లనే భర్తలుగా భావించి కొలవడం ఒకింత సంక్లిష్టంగా కనిపించినా అది వారి అమలిన హృదయానికి నిదర్శనమనే చెప్పాలి. రంగనాథునికే గోదాదేవి తనను తాను సమర్పించుకోవడమూ ఇలాంటిదే. రంగనాథుడంటే ఎవరో కాదు, గత జన్మలో శ్రీకృష్ణుడు. అలాగే, గోదాదేవి ఎవరో కాదు, పూర్వజన్మలో సత్యభామ. ఇంతేకాదు, గోదా అంటే భూమి అని, ఆమె భూదేవికి ప్రతిరూపమనీ చెప్తారు.


గోదాదేవి పుట్టుపూర్వోత్తరాలు, రంగనాథుని పట్ల తాను ప్రదర్శించిన ప్రేమ పారవశ్యం, ఇరువురి నడుమ నడిచిన దివ్య ప్రేమ బంధం, చివరాఖరకు ఆమె స్వామిలో విలీనం కావడం వంటివన్నీ మనసుకు హత్తుకునేలా తెలుసుకోవాలంటే శ్రీ కృష్ణదేవరాయలు (16వ శతాబ్దంలో) రచించిన ఆముక్త మాల్యద ప్రబంధం చదవాలి. ఈ విషయంలో దీనిని మించిన రచన మరొకటి లేదు. (ఇది అల్లసాని పెద్దన విరచితమని, కాదు విష్ణువాగ్రేసరుడిదని వాదించే వారూ ఉన్నారు). గోదాదేవికి ఆ విజయనగర సామ్రాజ్యాధినేత, సాహితీ సమరాంగణ సార్వభౌముడు పెట్టిన మరో పేరే ఆముక్తమాల్యద. అంటే, తాను సిగలో ధరించిన పుష్పమాలనే స్వామికి సమర్పించే కన్యామణి అని అర్థం. ప్రబంధాలనగానే శృంగారమయం అనుకొనే వారికి ఇది పూర్తిగా మినహాయింపు. ప్రకృతి వర్ణనల నుంచి రాజనీతి శాస్ర్తాల వరకు, గోదాదేవి శిశువుగా తులసీవనంలో లభ్యం కావడం నుంచి రంగనాథుడే స్వయంగా ఆమెను పెండ్లి యాడడం వరకు ప్రతీ సన్నివేశం ఉత్కంఠపూరితమే.


ఆముక్తమాల్యదనే విష్ణుచిత్తీయం అని కూడా అంటా రు. గోదాదేవిని పెంచుకున్న తండ్రి (విష్ణుచిత్తుడు) పేరుమీదే ఈ గ్రంథాన్ని కూడా పిలుస్తున్నారంటే కారణం, దీని ప్రధాన ఇతివృత్తం ఇదే కనుక. అంతేకాదు, తెలుగు సాహిత్యంలోని పంచకావ్యాలలో ఒకటిగా పేర్గాంచిన ఈ ప్రబంధం ఆనాటి మనుచరిత్ర, పారిజాతాపహరణం వంటి గొప్ప ప్రబంధాలు వచ్చిన కాలంలోనిదే. గోదాదేవి కథంతా తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు, శ్రీరంగం కేంద్రంగా నడిచేదే. ఈమెనే ఆండాళ్ (భక్తుల మేలు కోరునది) అని, చూడి కొడుత్తామ్మాల్ (స్వామికి తాను ధరించిన పూమాలలు ఇచ్చునది) అని కూడా పిలుస్తారు. విల్లిపుత్తూరులో ఇప్పటికీ పురాతనమైన ఆండాళ్ ఆలయం ఉంది. ఈ దేవాలయం 2000 ఏండ్ల కిందటిదిగా చరిత్ర చెబుతున్నది. ఈ ఆలయ గోపుర చిత్రాన్నే తమిళనాడు ప్రభుత్వం అధికారిక చిహ్నంలో వాడుతుండడం విశేషం.


భారతావనిలో ప్రత్యేకించి దక్షిణదేశంలో భక్తి ఉద్యమాలు (శైవ, శ్రీవైష్ణవ, శక్తి, స్మార్త) రావడానికి పూర్వమే అంటే సుమారు 8వ శతాబ్ద కాలం (క్రీ.పూ.776) లోనే గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులో జన్మించినట్లు చరిత్రకారుల కథనం. అక్కడి మన్ననారు స్వామి కోవెలలో శ్రీకృష్ణుడు మర్రిఆకుపై తేలియాడుతూ లోకాన్ని రక్షించినట్లు చెప్తారు. ఆ గుడిలోని అర్చకుడు భట్టనాథుడు. (ఈయన పూర్వజన్మలో పూరీలోని వసంతాచార్యుడనే విష్ణుభక్తుడు. జగన్నాథుని పక్కన శ్రీలక్ష్మీ విగ్రహం లేకపోవడం, సోదరి సుభద్రకు మాత్రం స్థానం లభించడం ఆయనను వేదనకు గురి చేయగా, ఎట్టకేలకు మరుజన్మలో లక్ష్మీదేవి తనకే కూతురుగా పుట్టేలా స్వామి నుంచి వరం పొందుతాడాయన). ఆయన చిత్తమెప్పుడూ విష్ణువుపైనే ఉంటుంది కాబట్టే, అతనిని విష్ణుచిత్తుడు అని, ఆళ్వారులందరిలో పెద్దయాళ్వారు గానూ ఆయన్ని పిలుస్తారు. సంతానం లేని ఆయనకు ఒకనాడు తులసీవనంలో ఆడశిశువు లభించడంతో దైవదత్తంగా భావించి, ఇంటికి తీసుకెళ్లి పెంచుకొంటాడు. ఆ భార్యాభర్తలు ఆమెకు గారాబంగా పెట్టుకున్న కోదై (పూలమాల) అన్న పేరే క్రమంగా గోదాగా మారినట్టు కథనం. పూరీలో తాను లేని లోటును తీర్చడానికే శ్రీలక్ష్మీదేవియే ఆయనకు గోదాగా జన్మించినట్టు చెప్తారు.


పెరిగి పెద్దదవుతూనే గోదాదేవి కృష్ణుని భక్తురాలిగా మారింది. యుక్తవయసు వచ్చేసరికి ఆమెలోని భక్తి కాస్తా ప్రేమ అయ్యింది. కళ్లు మూసినా, తెరిచినా తనకు కృష్ణుడే కనిపిస్తాడు. ఆమె ప్రేమ అంతటితో ఆగక, అసలు తాను గత జన్మలో సత్యభామనేనని, తానున్న ఊరు నందగోకులమనీ నమ్ముతుంది. తన స్నేహితురాళ్లనూ అప్పటి గోపికలుగానే భావించింది. కథ ఇక్కడితో ఆగలేదు. గుడిలోని కృష్ణుడికి రోజుకొకటి చొప్పున వేయాల్సిన పూలమాలలను గోదాదేవి ముందు తానే ధరించి, అద్దంలో చూసుకొని తృప్తి పడి, దానినే తిరిగి తండ్రికిస్తే అదేమీ తెలియని ఆయన స్వామికి అలంకరించే వారు. ఇది ఎన్నాళ్లో దాగదు కదా. విష్ణుచిత్తుడు అలా చేయడం తప్పని, ఆ రోజు స్వామికి మాల వేయడు. చాలా చిత్రంగా కృష్ణుడే ఆయన కలలోకి వచ్చి తనకు గోదా ధరించిన మాలలంటేనే ఇష్టమని చెప్పాట్ట. ఇదీ ప్రేమకు లొంగడమంటే!


గోదాదేవిలోని కృష్ణప్రేమ మరింత పెరిగింది. తనకు పెండ్లంటూ జరిగితే కృష్ణునితోనే అంది. గోపికలతో కలిసి కాత్యాయనీ వ్రతం (తిరుప్పావై ధనుర్మాస వ్రతం) మొదలుపెట్టింది. దీనినే ద్వాపర యుగంలో గోపికలంతా అత్యంత అట్టహాసంగా జరిపారు. ఈ వ్రత ఫలితానికి తిరుగుండదు. దీనిని భక్తిశ్రద్ధలతో ఆచరించే కన్నెపిల్లలకు తాము కోరుకున్న వ్యక్తులతో పెండ్లి జరుగుతుందంటారు. ఇంకేం, 30 రోజులపాటు అద్భుత పాశురాలను పాడుతూ తోటి చెలికత్తెలను మేల్కొలుపుతూ, వారితోకూడి, ఆఖరకు కృష్ణ దర్శనమే పరమార్థంగా గోదాదేవి వ్రతాన్ని పూర్తి చేసింది.


ఇంత జరిగాక, గోదాదేవి కోసం సాక్షాత్తు విష్ణుమూర్తి దిగి రాకుండా ఉంటాడా! క్షణాల్లో వచ్చేశాడు. ఆమె తండ్రికి కలలో కనిపించి, తననే ఇష్టపడుతున్న గోదాదేవిని శ్రీరంగానికి తీసుకెళ్లి అక్కడి రంగనాథునితో వివాహం జరిపించమనీ చెప్పాడు. అంతే, కాలం ఏ మాత్రం ఆగలేదు. మకర సంక్రాంతికి ముందు వచ్చే భోగినాటికి గోదాదేవి పెండ్లి ఆ గుడిలోని రంగనాథ స్వామితో అట్టహాసంగా జరుగుతుంది. వలచిన ఆ స్వామిని తిరుప్పావై వ్రతంతో పొందిన అదృష్టం గోదాదేవిదైతే, వలచి వచ్చిన తన ఇష్టసఖే అయిన ఆమెను గ్రహించిన ఘనత రంగనాథుల వారిదే.


premamrutham2

ఏకైక మహిళా ఆళ్వారు తల్లి!

అల పన్నిద్దఱు సురులందును సముద్యల్లీలగా.. అంటూ శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో అభివర్ణించిన పన్నెండుగురు శ్రీ వైష్ణవ మతాచార్యులైన ఆళ్వారులలోని ఏకైక మహిళా ఆళ్వారు తల్లి గోదాదేవి. ఆమె గుడిలోని శ్రీ కృష్ణుడిని ఉద్దేశించి, తనను పెండ్లాడితే 100 కప్పుల చక్కెర పొంగలి, 100 కప్పుల వెన్నను సమర్పించుకొంటానని మొక్కింది కూడా. కాలక్రమంలో (12వ శతాబ్దంలో) ప్రసిద్ధ శ్రీవైష్ణవ మతాచార్యుడు, విశిష్టాద్వైత ప్రతిపాదకులు రామానుజాచార్యుల వారు అదే విల్లిపుత్తూరులోని శ్రీ కృష్ణునికి ఏకంగా 100 కుండల చక్కెర పొంగలి, 100 కుండల వెన్నతో ఆండాళ్ తల్లి మొ క్కును చెల్లించి, ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టారంటారు.

1693
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles