శ్రావణ శోభకు స్వాగతం!


Thu,August 9, 2018 11:10 PM

జడివానలతో జీవితాలను పండించే మాసం కనుకే శ్రావణానికి శుచి మాసమనీ పేరుంది
మహిళలకు, మరీ ముఖ్యంగా ముత్తయిదువుల మనసు దోచిన మాసం శ్రావణం. నోములు, వ్రతాలు, పూజలు, ప్రత్యేక ఆరాధనలతో అత్యంత శోభాయమానంగా వెలుగులీనే కాలమిది. నెల ఆసాంతం శుభప్రదమే. ఏ గుడిని చూసినా, ఏ ఇంట అడుగిడినా, ఎవరిని పలుకరించినా.. భక్తి రసాత్మకత, శుభకార్యాల తోరణాలు, ఆధ్యాత్మిక పారవశ్యత ఆశ్చర్య పరుస్తాయి. ఆఖరుకు శ్రావణమాసం శోభనం అంటూ ఒక సినీకవి రక్తి కవిత్వానికీ ఈ ముప్పయి రోజుల పెళ్లి వేడుకలు అద్దం పడతాయి.
lakshmi-devi
శ్రవణా నక్షత్రంతో పున్నమి వెన్నెల నెమలి పింఛంలా విచ్చుకొనే సమయమిది. కాబట్టే, ఈ నెలకు శ్రావణం అని పేరొచ్చిందని పంచాంగ కర్తలు అంటారు. ఈ నెలను ఒక్కమాటలో వర్ణించాలంటే, శుభకార్యాలకు స్వాగతం పలుకుతుంది. పండుగలు, పబ్బాలకు నట్టింటి వరండాలో పీటలు వేసి పవిత్రంగా కూర్చో పెడుతుంది. అధిక జ్యేష్ఠ, ఆషాఢాల రెండు నెలల శూన్యకాలం తర్వాత పెండ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి గొప్ప శుభముహూర్తాలకు ఈ మాసంలోనే తలుపులు బార్లా తెరచుకోవడం విశేషం.


శ్రావణ మాసం ఎంత విశిష్టమంటే.. అటు విష్ణుమూర్తికి, ఇటు ఈశ్వరునికి, మరోపక్క లక్ష్మీదేవికి, వేరొకపక్క లలితా పరమేశ్వరికి, ఇంకా గణపతి ఆదిగా శ్రీవేంకటేశ్వరస్వామి నుంచి శనీశ్వరుని వరకు హైందవ దేవతందరికీ.. ఈ నెల పొడుగునా అత్యంత అట్టహాసంగా పూజాదికాలు జరుగుతాయి. ఈ నెలంతా, వారం మొత్తంలో ప్రతీ రోజూ ఏదో ఒక శుభకార్య సందోహం కానవస్తుంది. మహావిష్ణువుకు ఈ కాలం ఎందుకు ప్రీతికరమంటే, స్థితికారుడైన ఆ స్వామి జన్మించిన మహాశుభ నక్షత్రం శ్రవణం కనుక! ఈ మాసంలోని ప్రతీ సోమవారం నాడు ఈశ్వరుని విశేష ఆరాధనకూ సరైన కారణం లేకపోలేదు. పౌరాణిక కథల ప్రకారం ఈ మాసంలోనే పరమశివుడు పాలసముద్ర మథనవేళ వెలువడిన హాలాహలాన్ని నోట మింగి, కంఠంలో నిక్షిప్త పరచి నీలకంఠుడైనాడని పురాణాలు చెప్తున్నాయి.


హైందవులు ఈ మాసంలోని ఒక్కోరోజు ఒక్కో దైవాన్ని వారం రోజుల పాటు ఆరాధిస్తారు. శ్రావణ సోమవారం పేరు చెబితేనే శివ భక్తుల మనసులు పులకించి పోతాయి. ఈ రోజు విధిగా గుడికి వెళ్లి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయించే వారూ కోకొల్లలు. ప్రతీ శివాలయం భక్తులతో క్రిక్కిరిసి పోతుంది. గుళ్లకు వెళ్లలేని వాళ్లు కనీసం తమ ఇళ్లల్లో అయినా ఈశ్వరారాధన చేయడం ఈరోజు అత్యంత పుణ్యప్రదం. అలాగే, ప్రతీ మంగళవారం కొత్తగా పెళ్లయిన ముత్తయిదువులు మంగళగౌరీ నోములను నోచుకొని తోటి, పెద్ద ముత్తయిదువులకు తాంబూలాలిస్తారు. ప్రతీ ముత్తయిదువనూ గౌరీదేవి స్వరూపంగా భావించి, వారి కాళ్లకు తమ స్వహస్తాలతో పసుపు పెట్టి, పళ్లు-పూలతో ఆరాధించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ.


ప్రతీ బుధవారం విఠలేశ్వరునికి పూజలు చేస్తే, ప్రతీ గురువారం దత్తాత్రేయస్వామిని ఆరాధిస్తారు. ప్రతీ శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు ఈ నెల విశేషం. ముఖ్యంగా రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. శనివారం నాడు శ్రీ వేంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిలతోసహా శనీశ్వరుణ్ణీ ఆరాధిస్తారు. ఇవే కాక, ఈ నెలలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలనూ ఆచరిస్తారు. ఇంకా నాగపంచమి, గరుడపంచమి, రాఖీ (జంధ్యాల) పూర్ణిమ, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పర్వదినాలూ ఈ నెలలోనే జరుపుకుంటాం.


ఇక, ఈ వారం ప్రారంభంలోనే అంటే రేపు (శనివారం, 11వ తేది) చుక్కల అమావాస్య. పేరుకు అమావాస్యే అయినా ఇదీ ముత్తయిదువులకు ఒక పర్వదినమే. ఇవాళ్టితో ఆషాఢమాసం ముగుస్తుంది. ఇదొక రకంగా పిండపితృ యజ్ఞకార్యాలతో పాటు ముత్తయిదువులు ఈ రోజు ప్రత్యేకించి పార్వతీదేవికి చుక్కల వ్రతం ఆచరిస్తారు. బియ్యం పిండిలో కాసిన్ని పాలు కలిపి, ముద్దలుగా చేసి అమ్మవారికి నివేదన చేస్తారు. చుక్కల అమావాస్య అని దీనిని ఎందుకంటారనడానికి పెద్ద ముత్తయిదువులు ఒక పురాణకథ చెప్తారు. మర్నాటి నుంచి శ్రావణమాసం మొదలు. బుధవారం (15వ తేది) నాగపంచమి, గరుడపంచమిలతోపాటు సూర్యపూజ, సూర్యషష్ఠీ వ్రతం వంటివీ జరుపుకుంటారు. ఇదే రోజు ప్రసిద్ధ భారతీయ యోగపురుషుడు అరవింద్ ఘోష్ జయంతి. అంతేకాక, మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన శుభసమయం కూడా.


ఇంతేనా, ఇంకా ఉన్నాయి. శ్రావణ పూర్ణిమ నాడే శ్రీ సంతోషీమాత జయంతి. కాబట్టి, ఆ అమ్మవారి పేరుమీద ముత్తయిదువులు వ్రతమాచరిస్తారు. ఆ రోజు విష్ణుమూర్తి స్వరూపంగా భావించే హయగ్రీవ జయంతి కూడా. వారి ద్వారా ఉపదేశితమైన శ్రీలలితా సహస్రనామ స్తోత్రాన్ని ఆనాడు పారాయణంగా చదువుకొని, గుగ్గిళ్లు నైవేద్యం పెట్టడం ఆచారం. అంతేకాక, విష్ణుమూర్తి వేదాల రక్షణ కోసమే హయగ్రీవునిగా జన్మించినందున ఈ పుణ్యదినాన వేదపారాయణమూ ఎంతో శ్రేష్ఠమని పండితులు చెప్తారు. ఇక, శ్రావణ బహుళ ఏకాదశి రోజూ ప్రత్యేక వ్రతం, శ్రావణ అమావాస్య నాడు వృషభ పూజ అత్యంత విశేష ఫలాలనిస్తాయనీ వారు అంటారు. ఇదంతా ఒక ఎత్తయితే.. ఆయా నోముల సందర్భంగా ముత్తయిదువులు చెప్పుకొనే ప్రత్యేక పురాణ, ప్రాచీన కథలు మరో ఎత్తుగా.. తరతరాలుగా స్ఫూర్తిదాయకమవుతున్నాయి.


lakshmi-devi2

అటు వరలక్ష్మీ, ఇటు మంగళగౌరి

కోరిన వైభోగాలనిచ్చే లక్ష్మీదేవి వరలక్ష్మిగా, శక్తి స్వరూపిణి పార్వతీదేవి మంగళగౌరిగా అవతరించింది శ్రావణ మాసంలోనే! అటు ప్రతీ శుక్రవారం, ఇటు ప్రతీ మంగళవారం నెలంతా ఇద్దరమ్మలూ ఘనంగా పూజలందుకుంటారు. అష్టయిశ్వర్యాలతో తులతూగేలా చేయమని వేడుకొంటూ ఎందరో ముత్తయిదువులు ఆ అమ్మవార్లను తమ ఇళ్లకు రమ్మంటూ మనసారా ఆహ్వానం పలుకుతారు. కన్నులపండువుగా నోములు నోచుకొని నిండైన హారతులు సమర్పిస్తారు. ఈ నెలలోనే పున్నమికి ముందు వచ్చే (రెండో) శుక్రవారం ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రతాన్ని, అలాగే, ప్రతీ మంగళవారం (నాలుగైనా, అయిదైనా) మంగళగౌరీ నోములను ఉన్నంతలో వైభవంగా జరుపుకుంటారు.

935
Tags

More News

VIRAL NEWS