సృజనాత్మకత అంటే.. ఓ కొత్తదనాన్ని కోరుకోవడం.. ఓ నవీన అంశానికి జీవం పోయడం.. ఓ నూతన విషయాన్నివిష్కరించడం. మరి ఇక్కడ సృజనాత్మకత అంశం ఏమిటి అంటే..? ఒక సామాజిక మాధ్యమాన్ని సృష్టించడం.. దాని పేరు దునియా స్టార్ మన తెలంగాణ యువకుడు సృష్టించిన సరికొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంతవేగంగా విస్తరిస్తున్న టెక్నాలజీలో చాలా అంశాలు సామాజిక మాధ్యమాల ద్వారా బయటికి వస్తున్నాయి. ఇంటర్నెట్ ప్రపంచంలో వివిధ దేశాలకు సంబంధించిన చాలా యాప్‌లు, సైట్లు ఉన్నాయి. మన దేశానికి, మన రాష్ర్టానికి, మన ప్రాంతానికి చెందినది, సంబంధించినది ఏదీ లేదు. మన అనేది కూడా ఒకటి ఉండాలన్న ఆలోచనతో దునియా స్టార్‌ను సృష్టించాడు సతీష్. దీంతో ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రత్యేకతలు చాటుకున్నాడు. ఉన్నత చదువు చదివి దానికి తగ్గ ఉద్యోగం రాక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఏదైతేనేం చేయాలన్న తపన ఉండడంతో ఉద్యోగం చేసుకుంటూనే వినూత్నంగా ఆలోచించి దొరికిన కొద్ది సమయంలో అధ్యయనం చేయడం ప్రారంభించాడు. అలా పుట్టుకొచ్చిందే కొత్త సోషల్ నెట్వర్కింగ్ సైట్.. దునియా స్టార్.

మనకు తెలిసిన సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్.. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్.. ఇవే. మనకు తెలియని సైట్లు ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని వందల యాప్స్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. సోషల్‌మీడియాలో నెట్వర్కింగ్ సైట్ ప్రారంభించాలన్న ఆలోచన, అది అన్నింటికన్నా వేగంగా భిన్నంగా ఉండాలని ఆలోచించాడు సతీష్. ఉద్యమం జరుగాలన్నా, ప్రభావితం చేయాలన్నా సోషల్‌మీడియా ఇప్పుడు కీలకంగా పనిచేస్తున్నది. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న అంశాల్లో సోషల్‌మీడియా ముఖ్య వరుసలో నిలుస్తున్నది. కొన్ని దేశాల్లో విప్లవాలకు దారి తీస్తే.. కొన్ని ప్రాంతాల్లో సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చడానికి, ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిలువడానికి, క్షణాల్లో సమాచారం తెలుసుకోవడానికి సామాజిక మాధ్యమాలు ఎంతగానో పనిచేస్తున్నాయి. అలాంటి సామాజిక మాధ్యమాన్ని తయారు చేశాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్ గ్రామానికి చెందిన సతీష్. అతడు రూపొందించిన యాప్ పేరే దునియా స్టార్.

కొత్త ఆవిష్కరణకు బీజం పోసి సామాజిక మాధ్యమాన్ని తయారు చేశాడు సతీష్. ఫేస్‌బుక్‌లాంటి ఒక సైట్‌ని రూపొందించి దానికి దునియా స్టార్ అని పేరు పెట్టాడు. ఇప్పడిది ముంబై, బెంగళూరులోని పారిశ్రామికవేత్తలను ఆకర్షించింది. అయితే సతీష్ ఇది రూపొందించడానికి చాలా కష్టపడ్డాడు. అతను చదివింది ఎంటెక్, ఎల్ఐసీలో అడ్వయిజర్ చైర్మన్ క్లబ్ మెంబర్‌గా పనిచేస్తున్నాడు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన సతీష్ దునియా స్టార్‌ని మల్టీ నేషనల్ కంపెనీగా తీర్చదిద్దాలనుకుంటున్నాడు. సొంతంగా ఐటీ సంస్థను స్థాపించాలన్న లక్ష్యంతో, ఆశయంతో ముందుకెళ్తున్నాడు. ప్రారంభించిన కొత్తలో దూరప్రాంతాల్లోని స్నేహితులను, బంధువులను, పరిచయస్తులను కలుపడానికి ఉపయోగపడ్డ సోషల్‌మీడియా ఇప్పుడు వ్యాపారాలు, వృత్తులు, మార్కెటింగ్ వంటి పనులు చేసుకోవడానికి సహకరిస్తున్నాయి. ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకొని దునియా స్టార్‌ని తయారు చేశాడు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 13 వేల మందికి పైగా వినియోగదారులున్నాయి. వీరి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. దునియా స్టార్ వాడే వారిలో ఎక్కువమంది వృత్తివిద్యా కోర్సులు అభ్యసిస్తున్న వాళ్లే ఉన్నారు. అమెరికా వంటి దేశాల్లో విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు దీన్ని వాడుతుండడం విశేషం.

ఫేస్బుక్లో లేని ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆన్లైన్ స్టడీ మెటీరియల్ కోసం నిరంతరం సైట్లను వెతికి, వాటిని స్నేహితులకు షేర్ చేయడానికి వీలుగా వర్డ్, పీడీఎఫ్‌ల వంటి అన్ని ఫార్మాట్ ఫైల్స్ ఇందులో పంపవచ్చు. డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్ వెర్షన్లలో ఇది అందుబాటులో ఉన్నది. వినియోగదారుల డాటాను సమర్ధవంతంగా పరిరక్షించేందుకు పటిష్టమైన సెక్యురిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యువతకు ఉపయోగపడే చాలా ఫీచర్లు దొరుకుతాయి. ఫోరం, మ్యూజిక్, బ్లాగ్ వీడియోస్, గ్రూప్స్, పేజీలు, మెసెంజర్ వంటివి కూడా ఇందులో పొందుపరిచాడు. దునియా స్టార్ సైట్లో మార్కెట్ ప్లేస్ ద్వారా వస్తువుల అమ్మకాలు, కొనుగోలు కూడా చేయవచ్చు. ఈ ఫీచర్లు ఒక క్లాసిఫైడ్ సెక్షన్‌గా ఉపయోగపడుతాయి. ఇలాంటి సెక్షన్లు కొన్ని వందలున్నాయి.
-అజహర్ షేక్