శ్రవణ్ నేసిన ఇక్కత్ జీన్స్!


Tue,May 15, 2018 11:35 PM

చేనేతలో సరికొత్త ఒరవడి. జీన్స్‌లో నూతన కూర్పు. ఫ్యాషన్ రంగంలో విప్లవాత్మక మార్పు. ఏంటా మార్పు? దాన్ని సృష్టించిన యువకుడు ఎవరు? ఎక్కడ ప్రదర్శించారు? మన ఇక్కత్‌కు.. ఫ్యాషన్‌కు ఉన్న అనుబంధం ఎలాంటిది?
ikkat-jeans

గజం శ్రవణ్.. ఫ్యాషన్‌కే సరికొత్త హంగులు అద్దుతున్నాడు. ఇండియన్ రన్‌వే ఫ్యాషన్ వీక్‌లో ఈ తెలంగాణ యువకుడు తన క్రియేటివిటీని చాటి చెప్పాడు. హ్యాండ్లూమ్ ఇక్కత్‌కు మరోసారి ఆధునికతను జోడించడం ద్వారా మరొక కొత్త చాప్టర్‌కు శ్రీకారం చుట్టాడు శ్రవణ్.

ఏం చేశాడు?

ఫ్యాషన్ ప్రపంచంలో సుపరిచితమైన డెనిమ్ జీన్స్‌ను ఇక్కత్ ద్వారా రూపొందించాడు శ్రవణ్. ఇండియన్ రన్‌వే ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శన ఇవ్వడంతో ఇక్కత్ డెనిమ్ జీన్స్ ఫ్యాషన్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయింది. పేరు పొందిన ఫ్యాషన్ డిజైనర్లు సైతం హ్యాండ్లూమ్ డెనిమ్ ఇక్కత్‌పై ఎలా చేస్తారనే ఆలోచనలో పడేలా చేశాడు. చేనేత నేపథ్యమున్న కుటుంబానికి చెందిన శ్రవణ్ తన సృజనాత్మకతతో ఒకవైపు ఫ్యాషన్ రంగంలో రాణిస్తూనే మరోవైపు చేనేతను బతికించే తన వంతు బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఇక్కత్‌లో డెనిమ్ జీన్స్ వంటి కొత్త రూపకల్పనలు చేస్తూ ప్రశంసలందుకుంటున్నాడు.

ఎవరీ శ్రవణ్?

చేనేత రంగంలో విశేష సేవలందిస్తున్న పద్మశ్రీ గజం అంజయ్య కొడుకు గజం శ్రవణ్. యాదాద్రి భువనగిరిజిల్లా సంస్థాన్ నారాయణపూర్ కుటుంబ నేపథ్యమున్న శ్రవణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఉంటున్నాడు. ఫ్యాషన్‌లో పదునైన ప్రతిభ ఉన్న అతను ఇటీవల ఢిల్లీలో జరిగిన సాకేత్ ఇండియన్ రన్‌వే ఫ్యాషన్ వీక్‌లో సందడి చేశాడు. అతను తయారుచేసిన హ్యాండ్లూం డెనిమ్ ఇక్కత్ ఉత్పత్తులను ధరించిన ముద్దుగుమ్మలు హోయలొలుకుతుంటే ఫ్యాషన్ డిజైనర్లు చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. శ్రవణ్ సొంత బ్రాండింగ్ వీవర్ సోల్.

ఫ్యాషన్‌లో తెలంగాణ కళ

డెనిమ్ జీన్స్ ఓ వైవిధ్యమైన వస్త్రం. దానిలో స్ట్రెచబుల్ సదుపాయం కూడా ఉంటుంది. అలాంటి వస్త్రం చేనేతలో సాధ్యమా? మందంగానూ, సౌకర్యవంతంగానూ ఉండే వస్ర్తాన్ని చేతి మగ్గం మీద నేయడం సాధ్యమా? అంటే కష్టమనే చెప్పాలి. కానీ ఆ కష్టాన్ని ఎదుర్కొని మార్కెట్లోకి సరికొత్త జీన్స్ వచ్చేసింది. అచ్చుగుద్దినట్లుగా.. కాదు కాదు! అంతకంటే సౌకర్యవంతమైన ఫీచర్స్‌తో హ్యాండ్లూం డెనిమ్ ఇక్కత్ (చేతి మగ్గం మీద నేసిన జీన్స్ వస్త్రం) ఉత్పత్తులు ఇప్పుడిప్పుడే ఆరంభమయ్యాయి. అగ్గిపెట్టెలో అమరే పట్టు చీరలు.. అచ్చెరువొందే ఫ్లోరల్.. పద్మాంజలి.. కంచి చీరలే కాదు. ఆధునిక ఫ్యాషన్‌కు తగ్గ వస్ర్తాలనూ తెలంగాణ చేనేత కార్మికులు, మాస్టర్ వీవర్లు సృష్టించగలరని శ్రవణ్ సృజనాత్మకతతో మరోసారి రుజువైంది.

ఇక్కత్‌లో జీన్స్ ఎట్లా?

ఏడాది కాలంగా వీవర్స్ సోల్ నుంచి అనేక రకాల ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి. ఐతే చేనేతలోనే మంచి ప్రయోగం చేయాలన్న గజం శ్రవణ్ ఆలోచనకు రూపకల్పన, తండ్రి గజం అంజయ్య సహకారంతో ఈ జీన్స్ ప్రయోగం ఫలించింది. ఒక్క చీరలు, ఇతర సాధారణ వస్ర్తాల ఉత్పత్తి నుంచి వైవిధ్యాన్ని చాటుకోవాలని శ్రవణ్ జీన్స్ లాంటి వస్ర్తాలను మగ్గం మీద నేయించాలని అనేక ప్రయోగాలు చేశారు. పైగా స్ట్రెచబుల్ సదుపాయం కూడా ఉంటే వినియోగదారులను ఆకట్టుకుంటుంది. అలాంటప్పుడు సాగే గుణం కలిగిన దారంతో మగ్గం మీద నేయడం ఎట్లా? అని యోచించారు. దాంతో నిలువు కాటన్, పేక (అడ్డం) లైక్రా (స్ట్రెచబుల్ గుణం) దారం వినియోగించారు. లైక్రా యార్న్ కూడా బెంగళూరు నుంచి దిగుమతి చేసుకున్నారు. దాంతో వస్ర్తానికి సాగే గుణం లభించింది. ఐతే జీన్స్‌లో వెలిసిపోయిన ఇండిగో కలర్ ఉంటేనే మరింతగా ఆకట్టుకుంటుంది. అందుకు అనుగుణంగా ముంబాయిలో వస్ర్తాలను ప్రత్యేకంగా వాషింగ్ చేయించారు. సాధారణంగా చేనేత వస్ర్తాలు ఒకసారి ఉతికితే కుచించుకుపోతాయి. ఈ డెనిమ్ ఇక్కత్ కూడా అలాగే అయ్యింది.

సినీ నటుల ఆసక్తి

ఉతికిన తర్వాత ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించిన వైవిధ్యమైన డిజైన్లల్లో డ్రెస్సులు కుట్టించారు. అంతర్జాతీయ మార్కెట్, ఫ్యాషన్ వీక్, ర్యాంప్ వాక్‌లకు అనుగుణంగా ఉండే నమూనాల్లో డిజైన్లు సిద్ధం చేశారు. వాటినే సినీ నటి రాగిణిఖన్నా, ముంబైకి చెందిన మోడళ్లతో ఢిల్లీ ఇండియన్ రన్‌వే వీక్‌లో ప్రదర్శించారు. వివిధ షేడ్స్‌లో ఇండిగో కలర్స్‌తో కూడిన వస్ర్తాలు ఆకట్టుకున్నాయి. కాటన్ సౌకర్యవంతంగా ఉంటుంది. లైక్రా స్ట్రెచబుల్‌గా ఉంటుంది. రెండూ కలిసి ఫ్యాషన్‌ప్రియులను రారమ్మంటూ ఆహ్వానిస్తున్నాయి. స్లిమ్ ఫిట్, లూజ్ ఫిట్, రిలాక్సుడ్ ఫిట్, క్యాజువల్ టాప్, జాకెట్, డ్రెస్సెస్, స్కర్ట్స్ వంటి అనేకం వీవర్స్ సోల్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఫ్యాషన్ రంగంలోకి చేనేత

చేనేత రంగం పాత సంప్రదాయ పద్ధతులపైనే ఆధారపడితే కష్టాలు తప్పవు. అంతర్జాతీయ స్థాయి డిమాండ్‌ను గుర్తించిన మాస్టర్ వీవర్లు, వారిపై ఆధారపడిన కార్మికులకు చేతినిండా పని దొరుకుతుంది. ఇంకా పాతతరం ఉత్పత్తులనే నేసే వారికి ఆదరణ అంతంత మాత్రంగానే ఉన్నది. అందుకే సరికొత్త ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టే తరానికి చేనేత రంగం కీర్తి కిరీటం తెచ్చిపెడుతున్నది. దాంతో పాటే వ్యాపార వాణిజ్య రంగంలోనూ వారు విరాజిల్లుతున్నారు.

-శిరందాస్ ప్రవీణ్‌కుమార్,
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి

Shravan-IRW

ఏడాది కష్టానికి తగిన గుర్తింపు

మా నాన్నను ఆదర్శంగా తీసుకొని చేనేత రంగంలోనే అనేక పరిశోధనలు తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. ఇప్పటికే వీవర్స్ సోల్ బ్రాండ్‌తో అనేక కలెక్షన్లను మార్కెట్లోకి తీసుకొచ్చాం. ఏదైనా ప్రత్యేకంగా రూపొందించాలన్న పట్టుదలతో జీన్స్‌లాంటి వస్ర్తాలను చేనేత మగ్గం మీద నేయాలనుకున్నాను. కాటన్, లైక్రా యార్న్‌తో రూపొందించిన డెనిమ్ ఇక్కత్ జీన్స్ ఫ్యాషన్ డిజైనర్ల మన్ననలు పొందింది. ఢిల్లీలో ప్రదర్శించినప్పుడు చేనేతలో ఈ ఉత్పత్తులు చేయించడం పట్ల అందరూ ప్రశంసించారు. ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని వీవర్స్ సోల్ స్టోర్‌లో అనేక నమూనాలున్నాయి.
-గజం శ్రవణ్, వీవర్స్ సోల్ ఎండీ

991
Tags

More News

VIRAL NEWS