కాలసర్ప చక్రబంధం


Tue,January 8, 2019 01:28 AM

recycle
ఖగోళ శాస్త్రవేత్తలకు సుదీర్ఘకాలంగా అంతుబట్టకుండా ఉన్న అతిపెద్ద విశ్వరహస్యాలలో కాలసర్ప భావన ఒకటి. ఇప్పుడిప్పుడే మళ్లీ తెరమీదికి వస్తున్న ఈ సిద్ధాంతాన్ని స్థిరంగా బలపరుస్తున్న అంశాలు అత్యంత ఆసక్తికరంగానే కాక వాస్తవికంగానూ ఉన్నాయి. న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసర్చి ఇన్‌స్టిట్యూట్, డివిజన్ ఆఫ్ ఫిజిక్స్ రిటైర్డ్ ప్రొఫెసర్, హెడ్ ఎ.వి.మొహరిర్ ఇటీవలి తన వ్యాసంలో వెల్లడించిన కీలక చర్చనీయాంశాలలో ఇదొకటి.


కవులు కాలాన్ని సర్పంతో ఎందుకు పోల్చారో చెప్పడానికి నిరూపణలు అక్కర్లేదు. సృష్టిలోని ప్రతీ వస్తువూ ఎప్పుడో ఒకప్పుడు కాలగర్భంలో కలిసి పోవాల్సిందే. అది ఎంతటి వస్తువైనా సరే. పరమాణువుల నుంచి బ్రహ్మాండం వరకూ ప్రతీ ఒక్కటీ కాలసర్పం కడుపులోకి చేరవలసిందే. చాలా చిత్రంగా అలా చేరిన పదార్థమంతా ఆవృత (cyclic) విధానంలో మళ్లీ మళ్లీ పుడుతూ, మళ్లీ మళ్లీ అంతరిస్తూ ఉండాల్సిందే. ఇదే కాలసర్ప సిద్ధాంతం. సమస్త చరాచర సృష్టీ కాలసర్ప చక్రబంధంలోకి వస్తుందని కొందరు ఖగోళ శాస్త్రజ్ఞులు ఘంటాపథంగా చెబుతున్నారు. సృష్టితోపాటు పుట్టి, పెరుగుతూ వున్న కాలం (time) తన మనుగడ కోసమైతేనేం, ఆకలి తీర్చుకోవడాకో అయితేనేం తనను పుట్టించిన పదార్థాన్నే మొత్తంగా కబళించేస్తూ, తిరిగి ఉద్భవింపజేస్తున్నదన్నది ఇందులోని సూత్రీకరణ. దీనిలోని నిజానిజాలను వారు విశ్లేషించిన వారికి ఆసక్తికరమైన విషయాలెన్నో బోధపడ్డాయి. న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసర్చి ఇన్‌స్టిట్యూట్, డివిజన్ ఆఫ్ ఫిజిక్స్ రిటైర్డ్ ప్రొఫెసర్, హెడ్ ఎ.వి.మొహరిర్ ఇటీవల యూనివర్సిటీ న్యూస్ మేగజైన్‌లో ప్రచురించిన వ్యాసంలో దీనిని ఉటంకిస్తూ అనేక మూలాధారాలను వెల్లడించారు.


ఈ సందర్భంలోనే ప్రాచీన ఈజిప్టియన్ ప్రతిమాశాస్త్రం (Iconongraphy) లోని ఆరోబోరస్ లేదా యూరోబోరస్ (Ouroboros or uroborus) చిహ్నం ప్రస్తావనకు వచ్చింది. ఇందులో తన తోకను తాను తినేసే భీకరసర్పం (డ్రాగన్) ఉంటుంది. దీనిని సృష్టి అంతటికీ వర్తింపజేస్తూ కాలసర్ప భావనను పై శాస్త్రవేత్తలు తెరపైకి తెచ్చారు. ఇది ప్రాచీన గ్రీకుల నుండి ఆధునిక శాస్త్రవేత్తల వరకూ వచ్చింది. తన తోకను తానే తినేసే సర్పాలు నిజంగా ఉంటాయా? అన్న చర్చాక్రమంలో అసలు ప్రకృతిలో తన అవయవాలను తానే తినేసే (autocannibalism) జంతువులూ కొన్ని లేకపోలేదన్న అంశం ఒకటి వెలుగుచూసింది. దీనినే మొత్తం జగత్తు కాలానికి వర్తింపజేస్తూ కాలసర్ప సిద్ధాంతాన్ని వారు ప్రతిపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరోబోరస్ జగత్తును సమర్థించే పలు అంశాలను వారు వెల్లడించారు.


భూమిమీది మూలకాలు, వాతావరణం, ప్రకృతి వంటివి మాత్రమే ఆవృత లక్షణాలు గలవిగా అనుకుంటే మనం పొరపడినట్లేనని పై శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఈ ఆవృత వ్యవస్థ కేవలం మన భూమివద్దే ఆగిపోలేదని, మొత్తం జగత్తంతా వ్యాపించిందన్నది వారి వాదన. సృష్టి ఆవిర్భావ సమయంలో పుట్టిన మూల (ప్రాథమిక) పదార్థాలన్నీ కాలం తీరిన తర్వాత అంతరిస్తూ చర్విత చరణంగా మళ్లీ పునరుద్భవిస్తూ ఉన్నాయని వారు అంటున్నారు. ఈ పదార్థాలన్నీ వివిధ రూపాలను సంతరించుకొంటూ చిట్టచివరకు మొత్తంగా విడివడి పోయి తమ పూర్వస్థితికే వస్తున్నాయనీ వారు చెబుతున్నారు. విశ్వావిర్భావం నాటి ప్రాథమిక (మౌలిక) పదార్థాలు, మూలకాల పరిస్థితి మొత్తం ఇంతేనన్నది వారి అభిప్రాయం.భూమి, చంద్రుని భ్రమణాలు, సూర్యుని చుట్టూ వాటి పరిభ్రమణాలు, ఋతువులు, పూలు, పండ్లు, ధాన్యాలు, పంటలతోకూడిన అన్ని రకాల వృక్ష ఉత్పత్తి, జంతుజాల పునరుత్పత్తి, రాత్రి పగళ్ల దివాసంబంధాలు, జీవుల సృష్టి స్థితి లయ (biological rhythm), ఉష్ణోగ్రతలు ఇలాంటివన్నీ సర్వసాధారణ ఆవృత వ్యవస్థకు లోబడే ఉంటున్నాయన్నది ఇక్కడ గమనార్హం. భూమ్యయస్కాంతత్వంలోని ఆవృత మార్పులవల్ల ఉత్పన్నమయ్యే సంకేతాలతోసహా కాంతి ఋణావేశం, ఉష్ణ అస్థిరత, పరమాణు ప్రేరేపణలన్నీ పైన పేర్కొన్న ఆవృత సాధారణ దృగ్విషయం కిందికే వస్తాయని పై ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమ్మీది ఈ రకమైన స్థితిగతులే ఇతర గ్రహాలు, నక్షత్ర మండలాలు, విశ్వాలన్నింటా ఉన్నాయన్నది వారి సైద్ధాంతిక భావన.


మనిషి విశ్వ ప్రతిధ్వనికారి (Cosmic Resonator) అని, ఋతు సంబంధ ఆవృతాలతోనే కాకుండా సూర్యుడు, భూమి, చంద్రునితో సైతం మనుగడకు కావలసిన సామరస్య గుణాల్ని కలిగి ఉంటాడన్న సంగతిని ప్రసిద్ధ రచయిత విలియమ్ ఎఫ్ ప్యాటర్‌సన్ (1891-1980) తన పుస్తకం మ్యాన్, వెదర్ అండ్ సన్‌లో 1947లోనే వ్యక్తపరిచినట్టు ఎ.వి. మొహరిర్ తన వ్యాసంలో పేర్కొన్నారు. భూమిమీది అన్ని రకాల జీవజాతుల మనుగడకు సూర్యుడు అత్యావశ్యకమైన శక్తిని అందిస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే. అలాగే, వాతావరణ మనుగడకు చంద్రుడూ అవసరం. మనం ఉన్న ఈ పరిస్థితే సరిగ్గా విశ్వమంతా వ్యాపించి ఉందన్నది స్పష్టమవుతున్నట్టు ఆయన చెప్పారు.పదార్థ నియంత్రణ వ్యవస్థ ఇక్కడితో ఆగిపోకుండా జీవ శరీరాలలోనూ వ్యాపించింది. మనిషి శరీర సుప్తావస్థలోని నియమితకాలిక లయ, సంయోగ ప్రవర్తన, శరీర ఉష్ణోగ్రత, రక్త నిర్మాణం, దాని పరిమాణం, చిక్కదనం, పీడనం వంటి వాటితో సహా పలు రకాల శరీర, ప్రవర్తనా విధానాలన్నీ భౌగోళికం, విశ్వ కదలికల (terrestrail and cosmic disturbances) తోనే ప్రేరేపితమవుతాయని పై శాస్త్రజ్ఞులు అంటున్నారు. దీనితోపాటు పైవన్నీ మనిషి శరీరంలోని హైపోథాలమస్ (మెదడులోని థాలమస్ కింది భాగం), పైనియల్ (మెదడులోని శంఖాకారపు నిర్మాణం), పీయూషగ్రంథి, తదితర గ్రంథుల ద్వారా సదృశ్యకంగా ప్రేరేపితమవుతాయన్న విషయాన్నీ వారు ఈ సందర్భంగా ఉటంకించారు. వీటన్నింటితోపాటు మొత్తంగా మానవ శరీర ధర్మాలు, ఆలోచనలు, చర్యలన్నింటిపైనా మనిషి మెదడు భారీ నియంత్రణ (మాస్టర్ కంట్రోల్)ను కలిగి ఉండడమూ ఇక్కడ గమనార్హమని వారంటున్నారు.ఈ నేపథ్యంలో మనిషి భూమిపై ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన, సామరస్య పూర్వక జీవనాన్నే కనుక కోరుకుంటుంటే అతను ప్రకృతి సూత్రాలను అవగాహన పరచుకొని, వాటి పరిధిలోనే కొనసాగుతూ, అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తూ ఉండాల్సి ఉంటుందని పై శాస్త్రవేత్తలు వివరించారు. తెలిసైనా, తెలియకైనా, ఏ రకమైన నిర్లక్ష్యమైనా, పెడధోరణినైనా, స్వేచ్ఛాపోకడనైనా వాటికి వ్యతిరేకంగా ప్రదర్శిస్తే పర్యవసానం దారుణ విపత్తులకో, ప్రళయానికో పరిణమించవచ్చునని కూడా వారు హెచ్చరిస్తున్నారు.


recycle2

మస్తిష్క వ్యవస్థ మరో పెద్ద రహస్యం

మన మస్తిష్కంలోని నాడీకణాలదైతే మరో అనూహ్య విస్తరణాత్మక వ్యవస్థ. ఇందులోని నాడీకణాల నడుమగల వందలాది బిలియన్ల అంతర సంబంధాలు శరీర ప్రసారాలను ఉత్తేజ పరచడం, హార్మోన్ సంబంధ సమాచారాల్ని వివిధ అయవాలకు చేరవేయడం వంటి ప్రక్రియలను జరుపుతాయి. ఇవన్నీ ప్రాకృతిక నియంత్రణతో, స్థిర ఉష్ణోగ్రత వద్దే జరుగుతుండడం ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం. మెదడు ఉష్ణోగ్రతలో సంభవించే మార్పులు అనిశ్చితమైన, అనూహ్య ప్రతిస్పందనలకు దారితీస్తాయి. ఇలాంటి ప్రత్యక్ష ప్రవర్తనలన్నీ ఒక్క మనిషిలోనే కాదు, జంతువులు, కీటకాలలో సైతం సంభవిస్తాయని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఆఖరకు మొక్కలుకూడా తమ పరిసర పర్యావరణాల నుంచే ఉత్తేజితమవుతూ, శరీర, జీవరసాయన సంబంధ ప్రేరణల మాదిరిగానే ప్రతిస్పందిస్తాయని వారు అంటున్నారు. ఇక్కడే అసాధారణ మిస్టరీ ఒకటుంది. మనతోపాటు అనేక క్షీరదాలు, పక్షులు ఏకీకృతమైన స్థిర ఉష్ణోగ్రత (సుమారు 37.5 డిగ్రీల సెల్సియస్)ను వివధ రకాల వాతావరణాల నడుమ (అది అర్కిటిక్‌లోఅయినా, ఆఫ్రికా సహారా ఎడారిలో అయినా సరే) ఎలా నిర్వహించుకో గలుగుతున్నాయన్నదే అంతుబట్టని విషయమని వారు అంటున్నారు.


- దోర్బల బాలశేఖరశర్మ

801
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles