సమర్థత..నమ్మకం.. కేసీఆర్


Sun,January 13, 2019 12:37 AM

టీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలి...అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్మారు కాబట్టే తాజా ఎన్నికల్లో పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టారని అన్నారు సీనియర్ సినీ నటుడు నరేష్. రెండోసారి 90 సీట్లు గెలువడమనేది కేసీఆర్ పనితీరు, పరిపాలన విధానం వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అన్ని రాష్ర్టాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని ప్రశంసల్ని కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, తెలుగు సినీ పరిశ్రమకు కేసీఆర్ అందిస్తున్న తోడ్పాటును గురించి నరేష్ పంచుకున్న ముచ్చట్లివి..
actor-naresh
కుల, మత, ప్రాంతీయ భేదాలకు తావులేకుండా సుఖసంతోషాల మధ్య ప్రజలు భద్రతతో కూడిన జీవనం సాగించడానికి కేసీఆర్ అన్నివిధాలుగా తోడ్పాటును అందిస్తున్నారు. రైతుబంధుతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల తాలూకు నగదు నేరుగా పేద ప్రజలకు అందుతున్నది. ఆంధ్రాలో కేసీఆర్‌కు అభిమానులు ఉన్నారు. సోషల్‌మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు అన్ని విషయాల్ని గమనిస్తున్నారు. విజ్ఞతతో ఆలోచిస్తున్నారు. మంచి పరిపాలన కావాలనే కోరిక అందరిలో ఉంది. ఎలాంటి లోపాలు లేని మంచి పాలనను కేసీఆర్ అందిస్తాడని అన్ని ప్రాంతాలవారు నమ్ముతున్నారు.


రైతుబిడ్డగా కేసీఆర్

ప్రకృతి విపత్తులు, ఇతర సమస్యల కారణంగా గత ప్రభుత్వాల పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ రైతుబిడ్డ, రైతుపక్షపాతిగా కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ర్టాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయి. వెనుకబడిన ప్రాంతాల్లో ఇదివరకు బాల్యవివాహాలు జరిగేవి. కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత బాల్యవివాహాలు చాలా వరకు ఆగిపోయాయి. ఈ పథకం వల్ల సమాజానికి మంచి జరుగుతున్నది. పెళ్లి అనేది ఆర్థికంగా భారంగా పరిణమించిన తరుణంలో కల్యాణలక్ష్మి పథకం వేలాది కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పనులు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు కేసీఆర్. ప్రాంతీయ విభేదాలతో సంబంధం లేకుండా తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమకు చెందిన వారందరూ ఇక్కడే ఉండాలని, సినీ పరిశ్రమ హైదరాబాద్‌లోనే స్థిరపడాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. కేసీఆర్ కళాప్రియులు. కళాకారులంటే ఆయనకు చాలా అభిమానం. సినీ పరిశ్రమకు సంబంధించి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, కల్పించిన సదుపాయాలు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అందిస్తున్న ప్రోత్సాహం పట్ల ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ సంతృప్తితో ఉన్నారు.


ఉన్నతమైన నగరంగా హైదరాబాద్..

హైదరాబాద్ నగరానికి ఐదు వందల యేండ్ల చరిత్ర ఉంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని మతాలు, భాషాల వారు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. కేసీఆర్ పరిపాలనలో నగరం మొత్తం ప్రశాంతంగా ఉంది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. హైదరాబాద్‌లో అద్భుతమైన అభివృద్ధి జరిగింది. రాజుకు మంచి సేనాధిపతులు ఉండటం ముఖ్యం. అలా కేసీఆర్‌గారు హైదరాబాద్ అభివృద్ధి కోసం మంచి అధికారులను నియమించారు. భవన నిర్మాణరంగం, ఫార్మాతో పాటు అన్ని రంగాల్లో హైదరాబాద్ ముందంజలో నిలుస్తున్నది. దేశంలోనే ఉన్నతమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది.


ఏకైక నాయకుడు కేసీఆర్

ప్రస్తుతం దేశ రాజకీయ పరిణామాల పట్ల ప్రజల్లో అభద్రతా భావం నెలకొన్నది. కాంగ్రెస్ వస్తే పరిస్థితి ఏమిటి? బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వస్తుందా? రాదా? అనే అనుమానాలు మొదలయ్యాయి. సింగిల్ పార్టీ అధికారంలోకి రావడం ప్రస్తుతం కష్టంగా మారింది. వివిధ పార్టీలను కలుపుకొంటూ పోయే బలమైన థర్ట్‌ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకంగా మారింది. ఈ తరుణంలో అందరి బంధువుగా ప్రతి ఒక్కరినీ కలుపుకొనిపోగల సమర్థత, నమ్మకం కలిగిన ఏకైక వ్యక్తిగా కేసీఆర్ కనిపిస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు దక్షిణాది రాష్ర్టాల్లో ఉన్న నాయకులతో పోలిస్తే కేసీఆర్ ఒక్కరే ఆ శక్తిసామర్థ్యాలు కలిగిన నాయకుడిగా ఉన్నారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకొంటూ వ్యూహాత్మకంగా దేశానికి బలం చేకూర్చగలిగే సత్తా కేసీఆర్‌కు ఉంది. తెలంగాణలో ఘనవిజయం తర్వాత దేశంలోని చాలామందిలో కేసీఆర్ పట్ల ఒక ఆశ నెలకొంది. కచ్చితంగా అది నెరవేరుతుందని నమ్ముతాను. కేంద్ర రాజకీయాల్లో గొప్ప రాజనీతిజ్ఞుడిగా కేసీఆర్ నిలుస్తాడు. అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చే దమ్ము అయనలో ఉంది.


తెలుగు నటుల కొరత ఉంది..

ఇండస్ట్రీలో తెలుగు నటుల కొరత చాలా ఉంది. పరాయి భాషల నుంచి నటుల్ని దిగుమతి చేసుకొనే పద్ధతి నాకు నచ్చదు. మన భాషా, భావోద్వేగాలపై ఇతరులకు అంతగా పట్టు ఉండదు. నటుడిగా ఎస్వీ రంగారావు నాకు ఆదర్శం. ఆయనలా ఎలాంటి పాత్రనైనా తెలుగునటులు చేయగలరని నిరూపించుకోవాలని ఉంది. దృశ్యం, గుంటూరు టాకీస్ నుంచి రంగస్థలం, మహానటి వరకు నవరసాల్ని పడించే అవకాశం దొరికింది. వైవిధ్యమైన పాత్రల వల్లే వరుస విజయాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం చాలామంది రచయితలు, దర్శకులు నన్ను దృష్టిలో పెట్టుకొని కొత్త పాత్రల్ని సృష్టిస్తున్నామని చెప్పడం గర్వంగా ఉంది. ఆ మాటలకు మించిన అవార్డ్ ఏదీ లేదు.


తుది శ్వాసవరకు..

సినిమా వాతావరణంలోనే పుట్టి పెరిగాను. కెమెరా, మేకప్‌లతోనే నా జీవితం గడుస్తున్నది. ఇతర వ్యాపకాలు నాకు లేవు. ఉదయం నిద్రలేచింది మొదలు నిద్రపోయేవరకు కథలు వినడం, మంచి పాత్రలు చేయడం, అలాంటి వాటి కోసం ఎదురుచూడడంతోనే గడిచిపోతుంది. ఆ పాత్రలకు లభిస్తున్న ప్రశంసలు వింటూ సంతోషపడుతుంటాను. ఆఖరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటాను.


తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్

కేసీఆర్‌కు పెద్ద వరం కేటీఆర్. తండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్ పనితీరు, ప్రవర్తన ఆయన తీసుకునే నిర్ణయాలు, భాషాప్రావీణ్యత, విదేశీ వ్యవహారాల పట్ల ఆయనకున్న పరిజ్ఞానం అద్భుతం అనన్యసామాన్యం. కేటీఆర్‌కు టీఆర్‌ఎస్ పార్టీ పగ్గాలు అప్పచెప్పడం శుభసూచకం. కేటీఆర్ రూపంలో మనకు మంచి యువనాయకుడు ఉన్నాడని భవిష్యత్ తరాలు గర్వంగా చెప్పుకోవచ్చు.


47యేండ్ల నట ప్రయాణం..

నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టి 47 యేండ్లు అవుతుంది. హీరోగా పలు సక్సెస్‌లు చూసిన నేను సహాయనటుడిగా మారిన తర్వాత ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. చాలా రోజుల విరామం తర్వాత చిత్రసీమలోకి పునరాగమనం చేయడంతో నాకు ఎలాంటి పాత్రలు సరిపోతాయో తెలియని సందిగ్ధంలో ఎవరూ అవకాశాలు ఇవ్వలేకపోయారు. ఆ ఇబ్బందుల్ని దాటుకొని సక్సెస్‌లను అందుకోవడానికి పదేళ్లు పట్టింది.


మూడు తరాల దర్శకులతో..

జంధ్యాల, బాపు నుంచి వెంకీ అట్లూరి, వెంకీ కుడుముల వరకు మూడు తరాల దర్శకులతో పనిచేసే అవకాశం నాకు దొరికింది. స్వతహాగా నేను దర్శకుడి నటుడిని. ఇమేజ్‌లకు కట్టుబడడం నచ్చదు. పాత్రకు కావాల్సిన నటనను ప్రదర్శించి దర్శకుడిని సంతృప్తిపరుచడానికే ప్రయత్నిస్తాను. విశ్వసాథ్, జంధ్యాల, విజయనిర్మల వంటి గొప్ప దర్శకులతో ఏ విధంగా భయం, భక్తితో పనిచేశానో అలాగే కొత్త దర్శకులతో పనిచేస్తాను.
-నరేష్ నెల్కి
-సీఎం ప్రవీణ్‌కుమార్

1126
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles