ట్రాన్స్‌లేట్ లవ్!


Sun,January 13, 2019 12:36 AM

అబ్బాయేమో ఇటాలియన్, అమ్మాయేమో బ్రిటిషర్. ఒకరి భాష ఒకరికి రాదు. అయినా వీళ్లు రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. త్వరలో పెండ్లి కూడా చేసుకోబోతున్నారు. ఒకే భాషలో మాట్లాడుకునే ప్రేమికులే సరిగా మాట్లాడుకోలేక లవ్‌కు బ్రేకప్ చెబుతుంటే.. వీరేమో భాషలు వేరైనా ప్రేమలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంతకీ వీళ్లు ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసా?
Google-Love
ఈ మధ్య టీవీ యాడ్స్‌లో.. వాయిస్ కమాండింగ్‌తో పనిచేసే గూగుల్ ట్రాన్స్‌లేట్ యాడ్ బాగా పాపులర్ అయింది. వేరే దేశానికి చెందిన వ్యక్తి.. మరో దేశానికి చెందిన వ్యక్తితో ఈ గూగుల్ ట్రాన్స్‌లేట్ ద్వారా మాట్లాడుకోవడం, సందేహాలు నివృత్తి చేసుకోవడం మనం చూస్తున్నాం. అచ్చం అలాగే.. గూగుల్ ట్రాన్స్‌లేట్‌తో వేర్వేరు దేశాలకు చెందిన ఓ ప్రేమజంట ఒక్కటైంది. అంతేకాదండోయ్ రెండేళ్లుగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు కూడా. లండన్‌కు చెందిన 23 యేండ్ల చ్లోయి స్మిత్, ఇటలీకి చెందిన 25 యేండ్ల డానియేల్ మార్సికో మోడ్రన్ లవర్స్‌కు కేరాఫ్‌గా మారారు. వీరు స్పెయిన్‌లోని ఇబిజ దీవిలో ఓ పార్టీలో కలుసుకున్నారు. డానియేల్‌ను చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మాదిరి మనసు పారేసుకున్నది చ్లోయి. ఎలాగైనా డానియేల్‌తో మాట్లాడాలని విశ్వప్రయత్నం చేసింది. కారణం ఇద్దరి భాషలు వేరు కావడమే.


చివరిగా గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌తో డానియేల్ సెల్ నంబర్ తీసుకుంది. తర్వాత అతనిపై తనకున్న ప్రేమను ట్రాన్స్‌లేట్ యాప్ ద్వారా వ్యక్తపరిచింది. అంత అందమైన యువతి, అందులోనూ వేరే దేశస్థురాలు లవ్ ప్రపోజ్ చెయ్యడంతో ఓకే అనేశాడు డానియేల్. ఇలా ఇద్దరూ హావభావాలు, వస్తువులు, పదార్థాలు, భాష.. వాటి గురించి తెలుసుకునేందుకు సబ్ టైటిల్స్ వచ్చే పాత సినిమాలు బాగా చూసేవారు. క్రమంగా ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని పెండ్లికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ లండన్‌లోనే ఉంటున్నారు. మొత్తానికి ప్రేమకు కుల మతాలు, ప్రాంతాలు, దేశాలు, భాషలు అడ్డుకాదని ఈ జంట నిరూపిస్తున్నది.

949
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles