మొహం పచ్చడి చేసింది!


Sun,January 13, 2019 12:35 AM

ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు.. లెజెండ్ సినిమాలో ఈ డైలాగ్ చాలా ఫేమస్. ఇప్పుడేం సందర్భం వచ్చిందనేగా మీ సందేహం? ఈ దొంగ పరిస్థితి కూడా అంతే. బొమ్మ తుపాకీ పట్టుకొని.. ఫైటింగ్ చాంపియన్‌ను బెదిరించాడు. ఆమె ఊరుకుంటదా..?! ఇలా మొహం పచ్చడి పచ్చడి చేసి పోలీసులకు అప్పగించింది.
Lady-Don
ఇంతకీ ఏం జరిగిందంటే.. బ్రెజిల్‌కు చెందిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) ఫైటర్ పోల్యానా వియనా.. తన ఇంటి బయట ఉబర్ క్యాబ్ కోసం ఎదురుచూస్తున్నది. ఇంతలో ఈ దొంగ వచ్చి ఆమెకు సమీపంలో కూర్చున్నాడు. కొద్దిసేపు అయ్యాక టైం ఎంతైంది అని అడిగాడు. ఆమె టైమ్ చెప్పింది. అయినా దొంగ అక్కడి నుంచి కదల్లేదు. దీంతో అతడిపై వియానాకు అనుమానం కలిగింది. వెంటనే తన పర్స్, ఫోన్ దాచే ప్రయత్నం చేస్తుండడంతో.. అతను తుపాకీ తీసి బెదిరించే ప్రయత్నం చేశాడు. నా దగ్గర గన్ ఉంది. ఇక్కడ ఏమీ జరగనట్లే ఉండు. కదిలావంటే కాల్చి పడేస్తా.. నీ దగ్గర ఉన్న డబ్బులు, ఫోన్ నా చేతిలో పెట్టి వెళ్లిపో అంటూ జులాయి సినిమాలో బ్రహ్మానందంలా బెదిరించాడు.


అయితే, అతని చేతిలో ఉన్న గన్.. డమ్మీదని గుర్తించింది వియానా. వెంటనే సివంగిలా రెచ్చిపోయింది. మార్షల్ ఆర్ట్స్ రింగ్‌లో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డట్లు.. పంచ్‌ల వర్షం కురిపించింది. తనకు వచ్చిన అన్ని పంచ్‌లను అతడిపై ప్రయోగించింది. దీంతో అతగాడి రూపురేఖలే మారిపోయాయి. ముఖం నుంచి కాళ్ల వరకు రక్తం కారేలా కొట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే పచ్చడి చేసింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చింది. 26 యేండ్ల వియానా అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ (యూఎఫ్‌సీ) ఫైటర్. ఆమె ఫైటింగ్ రింగులోకి దిగితే ఎదుర్కోవడం ఎవరి తరం కాదు. ఇప్పటి వరకు ఆమె 12 పోటీల్లో పాల్గొని 10సార్లు విజేతగా నిలిచింది.

1856
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles