సాధారణంగా ఏ ఆటగాడైనా విషాదాన్ని చూసి భయపడడు. లక్ష్య సాధనలో ఎన్నో సార్లు పడతాడు, లేస్తాడు, మళ్లీ పరిగెడతాడు, మళ్లీ పడతాడు లేస్తాడు. కానీ, వెనకడుగు వేయడు. అది అసలైన ఆటగానికి ఉండే స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే చందీప్ సింగ్ దేశానికి పేరు తెచ్చాడు. ఇంతకీ ఇతను ఏం చేశాడో తెలుసా ?

చందీప్ సింగ్‌ది జమ్ము కశ్మీర్. 11 యేండ్ల వయసులో అతను కరెంట్ షాక్‌కు గురయ్యాడు. సుమారు 11వేల వోల్టుల విద్యుత్ ప్రమాదం అది. డాక్టర్లు పరీక్షించి చేతులు పూర్తిగా తీసేయాలని చెప్పారు. ఫుట్‌బాల్ ఆటగాడిగా ఉన్న చందీప్ జీవితంలో ఈ ఘటనతో విషాదం చోటు చేసుకుంది. అయినా అతనూ, తల్లిదండ్రులు భయపడలేదు. చేతులు లేకుండా భవిష్యత్‌లో ఏం చేయొచ్చో ఆలోచించారు. చేతులు లేకుండా ఫుట్‌బాల్ ఆటలో రాణించటం కష్టం. అందుకు స్కేటింగ్‌ను ఎంచుకున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పారా స్కేటింగ్‌లో చాంపియన్ అయ్యాడు. వంద మీటర్ల దూరాన్ని కేవలం 13.95 సెకన్లలో చేరుకుని తాజాగా ప్రపంచ రికార్డు సాధించాడు. ఇది కేవలం సెకన్ల వ్యవధిలో సాధించిన విజయం కాదు.
స్కేటింగ్‌లో బ్యాలెన్సింగ్ ముఖ్యం. దాని కోసం తీవ్ర కసరత్తు చేశాడు. విషాదాన్ని తల్చుకుంటూ ఎన్నో రోజులు ఏడ్చాడు. వందల సార్లు పడ్డాడు. అయినా తిరిగి లేచాడు. ఇంతటి క్రీడాస్ఫూర్తి ముందు విజయం తలవంచక తప్పలేదు. ఇప్పుడు చాంపియన్‌గా నిలబడ్డాడు. అంతటితో చందీప్ ఆగలేదు. తైక్వాండోలో చేరి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. దక్షిణ కొరియాలో నిర్వహించిన తైక్వాండో చాంపియన్‌షిప్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్స్ తెచ్చాడు. అంతకు ముందే వియత్నాంలో జరిగిన ఆసియా, అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్స్ సాధించాడు. నిజానికి ఈ రెండు క్రీడల్లో చేతులు తప్పనిసరి. కానీ, వాటి అవసరం లేకుండానే చందీప్ దేశం గర్వపడేలా చేశాడు.