అద్భుత సందేశం


Mon,January 7, 2019 01:06 AM

నందగిరి హిల్స్‌లోని మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు నివాసంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాలు ఆదివారంతో 22వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి మాట్లాడుతూ గోదాదేవి ధనుర్మాస వ్రతంలో ఎవరెవరితో, ఎలా, ప్రవర్తించాలి అనే అంశాలను గురించి తెలిపిందని, పూర్వ ఆచార్యులు వాటిని వెలికితీసి మనకు చూపించారని చెప్పారు. ఈ ఉత్సవంలో జూపల్లి రామేశ్వరరావుతోపాటు ఆయన సతీమణి శ్రీకుమారి, వారి కుటుంబ సభ్యులు, నగరానికి చెందిన ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు.
Chinnaswamy
వేదం చెప్పే అన్ని విషయాలు తిరుప్పావైలో లభిస్తాయి. అందులో ఉన్న విశేషాలను మన పూర్వాచార్యులు వెలికితీసి మనకు తెలియజెప్పే ప్రయత్నం చేశారని చిన జీయర్ స్వామి అన్నారు. తిరుప్పావైలో ఉండే విలువైన విషయాలను తెలుసుకోవడం అవసరమని భగవత్ రామానుజాచార్య స్వామి వంటి మహనీయులు గ్రహించి ప్రతిరోజు తిరుప్పావైని అనుసంధించడం చేతనే సమాజానికి ఎంతో అద్భుతమైన హితాన్ని అందించగలిగారని స్వామివారు పేర్కొన్నారు. తిరుప్పావై ద్వారా సమాజానికి ఆండాళ్ తల్లి అద్భుత సందేశం ఇచ్చింది. సామాన్యుల దగ్గర నుంచి భగవంతుని వరకూ ఏవిధంగా ప్రవర్తించాలి? అనేటటువంటి అంశాలను గోదాదేవి పాశురాల ద్వారా మనకు తెలిపిందని చిన జీయర్ స్వామి వివరించారు. భగవంతుణ్ణి ఎటువంటి మార్గంలో వెళితే చేరుకోగలుగుతామో అదే మార్గాన్ని ఎంచుకోవాలని ఆయన సూచించారు. నీలాదేవిని మేల్కొల్పే సమయంలోనప్పినై, నంగాయ్, తిరువేఅనే విశేషణాలతో ఆమెను గోదాదేవి లేపింది. నప్పినై అంటే సర్వాంగీణ సౌందర్యం కలదని, నంగాయ్ అంటే పరిపూర్ణురాలు, తిరు అంటే సాక్షాత్తూ సంపదలకు మూలమని అర్థం.


ఈ మూడు విశేషణాలతోపాటు భగవంతుడిని తనలో పెట్టుకున్న నీలాదేవి. భగవంతుడిని కూడాతనలో ఇముడ్చుకున్న గొప్ప శక్తి నీలాదేవి కలిగి ఉన్నదని స్వామివారు తెలిపారు. మనం భగవంతుణ్ణి చూడడానికి, మనకు భగవంతుడిని ఇవ్వగలిగినటువంటి మనం చూట్టూ చూసే ప్రకృతే నీలాదేవని, దేవుడు అణువణువునా ఉంటాడని ప్రకృతి ంతో సౌందర్యమైనదని చిన జీయర్ స్వామి వివరించారు. ప్రకృతి చాలా అందమైనది. దాన్ని ఎంత చూసినా అలాగే చూడాలనిపిస్తుంది భగవంతుడు కూడా అంతేనని, సంపదలన్నీ ధరించేది ప్రకృతే కనుక వసుంధర అని పేరు పెట్టారన్నారు.ప్రకృతిలో ఉన్న 24 ద్రవ్యాల్లో వేటికీ లేని ఆలోచనా జ్ఞానం ఒక్క జీవుడికి మాత్రమే ఉందని, జీవుడు అంటే మ కారమని మ అంటే మనిషి అని చిన జీయర్ స్వామి వివరించారు. మనమంతా బ్రతికేది భగవంతుని కోసమని, సర్వకాలాలలోనూ ఆయనకే చెందినవాడిగా ప్రకృతిలో ఉన్న వస్తువులను జాగ్రత్తగా కాపాడుకుంటూ బ్రతకాలని, నీలాదేవి ద్వారా భగవంతుని చెంతకు చేరే విధానాన్ని గోదాదేవి మనకు నేర్పిస్తుందని స్వామివారు పేర్కొన్నారు. కృష్ అంటే చాలా అని, ణ అంటే ఆనందం. కృష్ణుడు అంటే అపరిమితమైన ఆనందమని, జగత్తులో అసలైన ఆనందం సాత్విక ఆనందమేనని చినజీయర్ స్వామి తెలిపారు.
Chinnaswamy1

గోదాదేవి ఎవరు?

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఆయన అసలు పేరు భట్టనాథుడు. అయితే నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది. ఆ భగవంతుణ్ణి నిత్యం కొలవడం చేత భట్టనాథుని పేరు విష్ణుచిత్తుడుగా మారింది. విల్లిపుత్తూరులో శ్రీకృష్ణుడు మర్రిఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్ముతుంటారు. ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవంగా శ్రీకృష్ణుడే కొలువై ఉంటాడు. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణపరమాత్మకు భక్తి ప్రపత్తులతో పూజలు చేసేవాడు. ఆయన్ను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి, పెరియాళ్వారు అనే గౌరవాన్ని ఇచ్చారు. విష్ణుచిత్తుడు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తూ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచి పెద్ద చేయసాగాడు. ఆమెకు కోదై అని పేరు పెట్టాడు. కోదై అంటే పూలమాల అని అర్థం. అయితే కొన్నాళ్ల తర్వాత కోదై అనే పేరు క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి చిన్న నాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది.

యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారింది. కళ్లు మూసినా, తెరచినా ఆ పరమాత్ముడే కనిపించేవాడు. గోదాదేవి తన స్నేహితురాళ్ళను గోపికలుగానూ, తాను ఉండే విల్లిపుత్తూరును ఒకనాటి గోకులంగా భావించింది. తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను తన మెడలో వేసుకుని తనలోనే శ్రీకృష్ణుని చూసుకుని మురిసిపోయేది. గోదాదేవి అలా మురిసిపోతున్న దృశ్యాన్ని ఓ రోజు విష్ణుచిత్తుడు చూసి, తన కూతురు దేవదేవుని పట్ల అపచారం చేసిందని బాధపడతాడు. అదే రోజు రాత్రి విష్ణుచిత్తిడికి కలలో కనిపించిన శ్రీకృష్ణుడు ఆమె చేసిన పనికి తాను బాధపడడంలేదని, అలాచేయడం చాలా సంతోషంగా ఉందని చెబుతాడు. అంతేకాదు గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు ఎటువంటి అపచారం కలుగలేదని స్పష్టం చేస్తాడు. ఆ తర్వాత పరిణామాలన్నీ గోదాదేవి కృష్ణుణ్ణి మరింతగా ప్రేమించేలా చేశాయి. తనకు పెళ్ళి జరిగితే ఆయనతోనే జరగాలని అనుకున్నది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది.

పసుపులేటి వెంకటేశ్వరరావు

1077
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles