లాలాజల గ్రంథిలో కణతులు ప్రమాదమా?


Mon,January 7, 2019 12:35 AM

మా అబ్బాయి వయసు 18 సంవత్సరాలు. ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఆర్నెళ్లుగా అతడు తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడు. ముఖ్యంగా చెవి నుంచి దవడ కింది భాగం వరకు వాపు వచ్చింది. దానిని పట్టుకొని చూస్తే గట్టిగా కణతుల మాదిరిగా ఉన్నాయి. చలికాలం కాబట్టి తీవ్రత ఎక్కువగా ఉంది. శీతల పానీయాలు తాగినా.. చల్లటి వాతావరణంలో బయటకు వెళ్లినా వాపు పెరిగిపోతున్నది. నొప్పి కూడా ఉంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఆపరేషన్ చేయాలన్నారు. లాలాజల గ్రంథిలో వాపు అన్నారు. ఇక తెలిసినవాళ్లేమో ఈ కణతులు చాలా ప్రమాదకరమనీ.. అవి క్యాన్సర్‌కు సంకేతాలని చెప్పారు. ఇది నిజంగానే క్యాన్సర్ అంటారా? అసలీ కణతులు ఏంటి? ఎందుకు వస్తాయి? ఎలా తగ్గుతాయి? చికిత్స ఏంటి? తెలుపగలరు.
- ఆర్. సుజాత, సూర్యాపేట

Counselling
సుజాత గారూ.. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ అనుమానమంతా మీ అబ్బాయి దవడ భాగంలో ఏర్పడిన గడ్డలు క్యాన్సర్ గడ్డలేనా? అనే కదా. కానీ అన్ని గడ్డలూ క్యాన్సర్ గడ్డలు కావు. లాలాజల గ్రంథిలో సమస్యల వల్ల ఇలాంటివి వస్తుంటాయి. ఆ గ్రంథిలో ఏవైనా చిన్నపాటి రాళ్లలాంటివి ఏర్పడినా కణతులకు దారితీస్తాయి. గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నా ఇలాంటి కణతులకు ఆస్కారం ఉంది. కొందరికి టీబీ ఉండటం వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఇంకోటి మీరు చెప్పినదానిని బట్టి చూస్తే ఆ కణతులు నొప్పి ఉన్నాయి కాబట్టి ఎలాంటి భయం అవసరం లేదు. నొప్పిలేని కణతులే ప్రమాదకరం. టాన్సిల్స్‌లో వాపులు రావడం వల్ల కూడా ఇవి వస్తుంటాయి. ఇన్ని చెప్పాం కదా.. వీటిలో ఏది కారణమో తెలియాలంటే మాత్రం కచ్చితంగా పరీక్షలు జరపాల్సిందే. ఎఫ్‌ఎన్‌ఏసీ పరీక్ష ద్వారా లాలాజల గ్రంథికి చికిత్స చేసి అసలు విషయం ఏంటో నిర్ధారిస్తారు. ఇక క్యాన్సర్ అని నిర్ధారించడానికి ఆ కణతుల్లోని కొంత భాగాన్ని తీసుకొని బయాప్సీ పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్ష ద్వారానే క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేవా అని స్పష్టం చేస్తారు. కాబట్టి మీరు చింత పక్కనపెట్టి ముందుగా ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌ను కలవండి. అప్పటివరకు ఇన్ఫెక్షన్స్, వాపు తగ్గేందుకు మందులు వాడాలి. యాంటీ బయాటిక్స్ తప్పనిసరి. చలికాలం కాబట్టి ఎక్కువగా చలి ఉన్నప్పుడు మీ అబ్బాయిని బయటకు వెళ్లకుండా నివారించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో నిండా దుస్తులు ధరించి వెళ్లాలని సూచించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ శీతలపానీయాలు తాగరాదని చెప్పాలి. కాచి చల్లార్చిన నీటిని ఇవ్వండి. ఆల్ ది బెస్ట్.


డాక్టర్ ఎల్ సుదర్శన్‌రెడ్డి
ఈఎన్‌టీ స్పెషలిస్ట్
గవర్నమెంట్
ఈఎన్‌టీ హాస్పిటల్, హైదరాబాద్

1073
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles