ప్రపంచంలోనే చిన్నవయసు సీఈవో శ్రీలక్ష్మీ సురేష్


Sun,April 15, 2018 11:27 PM

యువత అనగానే స్నేహితులు, సినిమాలు, షికార్లు, మొబైల్స్... ఇదే వారి లోకం అంటారు చాలామంది. ప్రపంచంతో పనిలేదన్నట్లు ఎంతసేపూ సోషల్‌మీడియాలో ఉండడం వారి నైజం అనుకుంటారు. కానీ పందొమ్మిదేళ్ల శ్రీలక్ష్మి మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. చిన్నవయస్సులోనే పారిశ్రామికవేత్తగా మారి ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మూడు వందల మందికి పైగా క్లయింట్లను కలిగిన కంపెనీకి ఆమె సేవలందిస్తున్నారు. తన ప్రతిభతో ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులెన్నోసాధించారు. దేశంలోనే కాక ప్రపంచంలోనే అతి చిన్నవయస్సు సీఈవోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలక్ష్మీ సురేష్ సక్సెస్‌మంత్ర.
Laxmisuresh
శ్రీలక్ష్మీ సురేష్ కేరళ కోళిక్కోడ్ ప్రాంతానికి చెందిన యువతి. వయసు పందొమ్మిది సంవత్సరాలు. సెయింట్ జోసెఫ్స్ కాలేజీలో బి.బి.ఏ. ఫైనల్ ఇయర్ చదువుతున్నది. శ్రీలక్ష్మి పది సంవత్సరాల వయసు ఉండగానే అంటే నాలుగో తరగతిలోనే ఇండిజైన్ టెక్నాలజీస్ అనే ఓ కంపెనీ స్థాపించింది. నాలుగేళ్ళ వయసులోనే కంప్యూటర్‌ను ఆపరేట్ చేయడం మొదలుపెట్టింది. అక్షరాలు నేర్చుకోవడానికి నోట్‌ప్యాడ్‌ను ఉపయోగించేదట. ఇక బొమ్మలు గీయడానికి మైక్రోసాఫ్ట్ పెయింట్ అప్లికేషన్‌ను ఉపయోగించేదట. ఏదైనా వెబ్‌సైట్ ముఖచిత్రాన్ని చూసినప్పుడు దాన్ని ఓ బొమ్మలాగే అనుకునేదట. అది గమనించిన ఆమె తల్లిదండ్రులు విజు సురేశ్, సురేశ్ మీనన్‌లు ఆమెను ప్రోత్సహించారు. వెబ్‌డిజైనింగ్ నేర్పించారు. చిన్నవయసులో ఈ కోర్సు నేర్చుకున్న శ్రీలక్ష్మి ఎనిమిదేళ్ళు వచ్చేసరికి అందులో ఆరితేరిపోయింది. ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరాలంటే అకుంఠిత దీక్ష, పట్టుదల అవసరం. ఇవి ఉంటే జీవితంలో అనుకున్నది సాధించేయొచ్చు అని ఆమె చిన్నతనంలోనే నిరూపించింది.

వెబ్ డిజైనర్‌గా..

నాలుగో తరగతి చదివేటప్పుడు శ్రీలక్ష్మి తన స్కూల్ వెబ్‌సైట్‌ను డిజైన్ చేసింది. అదే ఆమె తయారుచేసిన తొలి వెబ్‌సైట్. అది అందరికీ బాగా నచ్చింది.. అలా మొదటిసారి శ్రీలక్ష్మి గుర్తింపు తెచ్చుకుంది. స్కూలు ప్రిన్సిపాల్, టీచర్లు, స్నేహితులు శ్రీలక్ష్మిని బాగా ప్రోత్సహించడం, పత్రికల్లో వార్తలు రావడంతో ఆమెకు వెబ్‌సైట్ డిజైన్ చేయమంటూ బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. దాంతో ఏడాది తిరిగేసరికల్లా శ్రీలక్ష్మికి నేషనల్ చైల్డ్ అవార్డ్ ఫర్ ఎక్సెప్షనల్ ఎచీవ్‌మెంట్ వచ్చింది. న్యూఢిల్లీలో సోనియాగాంధీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుంది శ్రీలక్ష్మి. తరువాత పదేళ్ళకే అమ్మానాన్నల అంగీకారంతో కంపెనీని మొదలుపెట్టింది. స్కూల్లో క్లాసులు అయిపోయాక ఇంటికొచ్చి వెబ్ డిజైనింగ్ మొదలుపెట్టేది. అప్పట్లో ఆమెకు బోలెడు ఆఫర్లు వచ్చాయి. వాటన్నిటినీ చేసేది. స్కూలును ఎప్పుడూ ఎగ్గొట్టేది కాదు. తనకంటూ ఓ ప్రణాళిక వేసుకుని చదువుకుంటూనే తన కంపెనీకి పనిచేసేది. అలా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఆమెకు బోలెడన్ని అవకాశాలు, ప్రశంసలూ వచ్చాయి. దాంతో ఆమె మరింత ఉత్సాహంతో వెబ్ డిజైనింగ్‌లో వచ్చిన కొత్త విషయాలను కూడా నేర్చేసుకునేది.

తల్లిదండ్రుల ప్రోత్సాహం

చిన్నతనంలో శీలక్ష్మి చూపిస్తున్న ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు ఆమెను మరింత ప్రోత్సహించారు. ఆమె లక్ష్యాన్ని గుర్తించిన వారు ఆమెకు అవసరమైన అన్ని వసతులు కల్పించారు. దీంతో ఆమె మరింత ఉత్సాహంగా పనిచేసుకుంది. ఇప్పడు ఏ కంపెనీకైనా వెబ్‌సైట్ తప్పనిసరి అవుతుంది. దీంతో శ్రీలక్ష్మి పలు వెబ్‌సైట్లను పరిశీలించి స్వయంగా వెబ్‌సైట్ డిజైన్లను నేర్చుకున్నారు.అలా తన డోమిన్ నుండి అడ్వాన్స్‌డ్ డిజిటల్ టెక్నాలజీకి విస్తరించుకున్నారు. అలా ఎన్నో ఆధునాతన మెలకువలతో తన ప్రాజెక్ట్‌లు చేయడం మూలంగా తనకు క్లయింట్స్ పెరిగారని ఆమె చెబుతారు.

కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం

కంపెనీ ఆర్థిక విషయాలు చెప్పడానికి నవ్వుతూ నిరాకరించే శ్రీలక్ష్మి చెప్పిన మాటలివే.. ఈ రంగంలో బోలెడంత పోటీ ఉంది. నేను ఎంత మొత్తం తీసుకున్నాను అనేదానికన్నా అప్పగించిన పని ఎంత క్వాలిటీతో పూర్తిచేస్తున్నాననేదే చూస్తాను. అందుకే నా పనితనం గురించి తెలిసి నాకు ఆర్డర్లు ఇస్తుంటారు. ఇప్పటిదాకా శ్రీలక్ష్మి కంపెనీ ప్రచారం కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అంతేకాదు ఇప్పుడు ఆమె కొత్త పనులకు శ్రీకారం చుడుతోంది. మైక్రోసాఫ్ట్ విండోకు భిన్నమైన మరో యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించాలన్నదే శ్రీలక్ష్మి లక్ష్యం.

ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తలకు మీరిచ్చే సలహా ఏంటని అడిగితే మనం చేసే పనిపట్ల నమ్మకం ఉండాలి. మనం ఏ రంగంలో రాణించాలనుకుంటున్నామో ఆ రంగంలో అనుకున్న పనిని కష్టపడి చేస్తే విజయం తనంతట తను వస్తుంది, అంతేకాదు, మన లక్ష్యానికి మించిన విజయం వరిస్తుంది అంటారామె. అంతేకాదు, విక్టరీ అనేది ఎప్పుడూ యుద్ధాన్ని గెలిపించదు. కానీ మనం పడిపోతున్న ప్రతిసారీ లేవడానికి సాయం చేస్తుంది అని అంటున్న శ్రీలక్ష్మి ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుందాం.

ఆవార్డులు..

Laxmisuresh2
ప్రస్తుతం శ్రీలక్ష్మి బి.బి.ఏ. చదువుతూ వెబ్‌సైట్ డిజైనింగ్, తన కంపెనీ మెయిన్‌టెనెన్స్ మీదే దృష్టి పెట్టడంతో చాలా బిజీగా ఉంటున్నది. వెబ్‌సైట్ ప్రాజెక్టులు పూర్తిచేస్తూ పరీక్షలకు చదువుకోవడం కష్టమైన పనే.. కానీ శ్రీలక్ష్మి మాత్రం సులువుగానే చేసేస్తున్నారు. రోజుకు మూడు, నాలుగు గంటలు తన కంపెనీ పనిమీద కూర్చుంటారు. చాలాకాలంగా శ్రీలక్ష్మి చేస్తున్న ఈ కృషికి, వెబ్ డిజైనింగ్‌లో ఆమె చూపిన ప్రతిభకు అమెరికన్ వెబ్ మాస్టర్స్ అసోసియేషన్ వారు ఇచ్చే అత్యున్నత గోల్ వెబ్ అవార్డు ఆమెను వరించింది. ఆ అసోసియేషన్‌లోనే పద్దెనిమిది ఏళ్ళ కన్నా తక్కువ వయస్సులో సభ్యురాలైంది ఆమె ఒక్కరు మాత్రమే.

సక్సెస్‌కు కారణ

Laxmisuresh1
చిన్న వయస్సులోనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా మారిన ఈ అమ్మాయికి ఇప్పుడు ఓ కంపెనీని ఎలా నడపాలో తెలిసిపోయింది. అంతేకాదు తన సక్సెస్‌కు ప్రధాన కారణం హార్డ్‌వర్క్, చేసే పనిపట్ల అంకితభావం అంటారు శ్రీలక్ష్మి. నాకు ఇతర హాబీలు ఏం లేవు. అందుకే విజయం సాధించగలిగాను. నా సమయాన్ని కేవలం వెబ్‌సైట్లు డిజైన్ చేయడానికి మాత్రమే కేటాయిస్తాను. ఎందుకంటే, నేను నా పనినే ప్రేమిస్తాను కనుక అంటారామె. నా పనితనమే నాకు అనుభవాన్ని ఇచ్చింది. గడచిన సంవత్సరాలుగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రాధాన్యమిస్తూ వచ్చాను అంటారు శ్రీలక్ష్మి.

1317
Tags

More News

VIRAL NEWS