సర్జరీ తప్పదా?


Sun,April 15, 2018 11:22 PM

నా వయసు 48 సంవత్సరాలు. నేను కొద్ది కాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. ఈ మధ్య బాధ భరించలేక డాక్టర్‌కు చూపించుకున్నాను. ఆయన పరీక్షలు నిర్వహించి, రిపోర్టులు పరీక్షించి మోకాలి కీలు మార్పిడి అవసరమని చెప్పారు. ఇంత చిన్న వయసులో ఇలాంటి అవసరం ఏర్పడుతుందా? దీనికి మరేదైనా ప్రత్యామ్నాయం ఉందా? దయచేసి పూర్తి వివరాలు తెలియజేయగలరు.
విజయ్ కుమార్, సికింద్రాబాద్

paine
మీరు తెలిపిన వివరాలను బట్టి మీరు ఆస్టియోఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తున్నది. మోకాలి నొప్పులకు చాలా వరకు మోకాలి చుట్టూ ఉండే కండరం బలహీనంగా మారడమే ప్రధాన కారణంగా ఉంటుంది. మోకాలికి నలువైపులా ఈ క్యాడ్రిసెప్స్ కండరాలు ఒక కూడలిలా ఉంటాయి. తొడ కండరాల దారుఢ్యం మీదే వీటి బలం ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు ఏ వృత్తిలో ఉన్నవారికైనా శారీరక శ్రమ భాగంగా ఉంటుంది. అందుకే పాత తరం వాళ్లకి మోకాళ్ల నొప్పులు పెద్ద వయసు వారు అయ్యే వరకు వచ్చేవి కావు. ఇప్పుడున్న జీవనశైలీ అందుకు భిన్నంగా ఉంది. శారీరక శ్రమ నామమాత్రమే అయ్యింది. కాబట్టి ప్రత్యేకంగా వ్యాయామం చెయ్యడం తప్పనిసరి.
కీళ్లనొప్పులతో బాధపడే వారందరికీ సర్జరీ అవసరమవుతుందని అనుకోవద్దు. మొదటి రెండు దశల్లో ఉన్న వారికి కీళ్లు పట్టేసినట్టు ఉండడం, మెట్లు ఎక్కుతున్నపుడు నొప్పి ఉండడం, నడుస్తున్నప్పుడు శబ్దాలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ దశల్లో వ్యాయామాలు, కొన్ని రకాల మందులతో నొప్పిని తగ్గించవచ్చు. ఒకవేళ సమస్య ఇప్పటికే ముదిరిపోయి మూడో దశకు చేరుకొని ఉంటే మాత్రం కీలు మార్పిడితో తప్ప ఉపశమనం దొరకదు. కాబట్టి మీరు ఏ దశలో ఉన్నారో తెలుసుకొని ఏ రకమైన చికిత్స తీసుకోవాలో నిర్ణయించుకోవడం మంచిది.

డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి
కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్
కేర్ హాస్పిటల్స్
హైదరాబాద్

532
Tags

More News

VIRAL NEWS