కొత్త ప్రపంచం! ఆల్కహాలిక్‌ రంగులు


Wed,December 11, 2019 12:21 AM

Colours
పెయింటింగ్‌.. పేరు వినగానే క్యాన్వాస్‌ పేపర్‌, కుంచె పట్టుకొని తయారైపోతాం. వీటిమీద తప్ప మరి వేటి మీద పెయింటింగ్‌ వేద్దామన్న ఆలోచన రాదు. ఎందుకంటే వాటిపై రంగులు అంటుకోవు కాబట్టి. క్యాన్వాస్‌కే పరిమితమైన రంగులకు భిన్నంగా దేశంలోనే తొలి ఆల్కహాలిక్‌ కలర్స్‌ తయారీ సంస్థకు శ్రీకారం చుట్టారు యువతీ యువకులు. ఈ రంగులు అన్నిరంగులకంటే త్వరగా ఆరిపోతాయి. అంతేకాకుండా వీరిరువురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కావడం మరో విశేషం.


చేస్తున్నది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం. ఉదయం నిద్రలేవగానే కోడింగ్‌ ఎలా రాయాలనే ఆలోచన. తీరా ఆఫీసుకు వెళ్లాక అవుట్‌పుట్‌ రాకుంటే బాస్‌తో తిట్లు. ఇంటికొచ్చాక అయినా ప్రశాంతంగా ఉంటామని చెప్పలేం. ఆ పని ఈ పనంటూ తలప్రాణం తీసేస్తారు. వీటన్నింటి నుంచి విముక్తి పొందేందుకు నచ్చిన కళతో కాస్త కుస్తీపడితే చాలు అలసట మొత్తం మాయం అవుతుంది. ఆ కళే పెయింటింగ్‌. రంగులు తీసుకొని క్యాన్వాస్‌ పేపర్‌పై నచ్చిన చిత్రాన్ని చిత్రీకరించడం. అలా రోజూ చేసే పనిలో కూడా కొత్తదనం వెతికారు. పెయింటింగ్‌ అంటే క్యాన్వాస్‌పైనే వేయాలా? టేబుల్‌, ఫోన్‌, బాటిల్‌, బ్యాగ్‌.. ఇలా మన దగ్గరున్న వాటిపై పెయింటింగ్‌ వేయలేమా అనుకున్నారు హైదరాబాద్‌కు చెందిన హరీశ్‌, గాయత్రి గుప్తా.
Colours1
పెయింటింగ్‌ విషయంలో మరింత ముందుకు వెళ్లారు వీరు. పేపర్లపై చిత్రాలు గీయడం అందరికీ తెలిసిందే. ఇతర ఏ వస్తువుపై వేయాలన్నా కుదిరేది కాదు. అలాగే యూపోషీట్స్‌ (సింథటిక్‌)పై కొంత శోధించినప్పుడు ఎటువంటి సర్ఫేస్‌పై అయినా ఉపయోగించే ‘ఆల్కహాలింక్స్‌' పేరుతో ప్రపంచవ్యాప్తంగా అప్పటికే అందుబాటులో ఉన్న రంగులు వీరిని ఆకర్షించాయి. అయితే ఇవి విదేశాలకే పరిమితం అన్నట్లు ఉండేది. హరీశ్‌ అన్నయ్యకు యూపోషీట్స్‌ పేపర్లు తయారు చేసే బిజినెస్‌ ఉన్నది. ఆ పేపర్‌తో ఉపయోగాలు ఏమున్నాయని పరిశోధన చేశారు. అప్పుడు పెయింటింగ్‌ వేయొచ్చని తెలిసింది. అది ఇతర దేశాల్లోనే చేసేవారు. అలా ఆల్కహాలిక్‌ కలర్స్‌ గురించి తెలుసుకున్నారు. అవి ఇక్కడెక్కడా లేవు. అదే సమయంలో గాయత్రి యూఎస్‌లో ఉన్నది. రంగుల తయారీ గురించి తెలుసుకున్నది. హైదరాబాద్‌లో యూపోషీట్స్‌ అందుబాటులో ఉన్నాయి. రంగులు తయారు చేసేందుకు చాలామందిని కలిసి ఫార్ములా తెలుసుకున్నారు. ఎలాంటి ఫిగ్మెంట్‌ వాడాలి వంటివన్నీ తెలసుకొని కెమికల్‌ ఇంజినీర్స్‌తో కాంట్రాక్ట్‌ తీసుకున్నారు. ఆరునెలల పరిశోధన తర్వాత మార్చిలో ‘బియాండ్‌ ఇంక్స్‌' పేరుతో ఆల్కహాలిక్‌ రంగుల తయారీ మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 15 రకాల రంగులను తయారు చేశారు. బియాండ్‌ ఇంక్స్‌లో నలుగురు ఎంప్లాయ్స్‌ ఉంటారు. ఇంక్స్‌ బాటిల్‌లో నింపడం. వాటికి సీలింగ్‌, లేబుల్స్‌ అంటించడం ఇలా అన్ని పనులూ ఎంప్లాయీస్‌ చూసుకుంటారు.
Colours2

ప్రతీనెల వర్క్‌షాప్‌

ఆల్కహాలిక్‌ రంగుల గురించి చాలామందికి తెలియదు. వాటిని నేటి తరానికి పరిచయం చేసేందుకు ప్రతి నెలా వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. మార్చి నుంచి వర్క్‌షాపులు పెడుతున్నారు. హైదరాబాద్‌లో ఎక్కడైతే జనసమూహం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రదేశాన్ని ఎంచుకుంటారు. హైటెక్‌సిటీ, బంజారాహిల్స్‌లాంటి ప్రదేశాలు. వర్క్‌షాపుకు అయ్యే ఖర్చుబట్టి ఫీజు నిర్ణయిస్తారు. దాదాపు 500 నుంచి 2000 వరకు ఉంటుంది. హైదరాబాద్‌లోనే కాకుండా దేశంలోని అన్ని నగరాల్లోని ఆర్టిస్ట్‌లతో టైఅప్‌ అయి అక్కడ కూడా వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. పేపర్‌, ఇంక్స్‌ వారే సరఫరా చేస్తారు. అలా ఇప్పటివరకు 140కి పైగా నిర్వహించారు. వచ్చేనెల జనవరిలో వర్క్‌షాప్‌ ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి 1 వరకు ఉంటుంది. మధ్యాహ్నభోజనం కూడా అందిస్తారు. అన్నింటికీ కలిపి ఫీజు ఉంటుంది.

ఆన్‌లైన్‌ సదుపాయం

‘బియాండ్‌ ఇంక్స్‌ డాట్‌ ఇన్‌' వెబ్‌సైట్లో, అమెజాన్‌లో ఆల్కహాలిక్‌ రంగులు అందుబాటులో ఉన్నాయి. ఇదే కాకుండా చెన్నైలోని హెచ్‌టీసీ, రిలయన్స్‌, హిమాలయా అన్నింటినీ సైప్లె చేస్తారు. 25కు పైగా ఆర్ట్‌స్టోర్స్‌కు కూడా సరఫరా చేస్తారు. బ్లెండింగ్‌ సొల్యూషన్‌. ఆల్కహాలిక్‌ కలర్స్‌పై నీటి బిందువులుగా వేయడానికి ఉపయోగపడుతుంది. అలానే రంగులను తొలిగించేందుకు కూడా దీన్ని ఉపయోగిస్తారు.
Colours3

తయారీ..

ఇథనాల్‌, రెజెంట్‌ పాలిమర్స్‌, ఫిగ్మెంట్స్‌, డై. ఫిగ్మంట్‌ అనేది కలర్‌ పౌడర్‌లాగ. ప్రతిరంగుకు సాల్వెన్సీ ఉంటుంది. సాల్వెంట్‌లో ఫిగ్మెంట్‌ ఎంతఅవుతుందో నోట్‌ చేసుకుంటారు. దాన్నిబట్టి అన్ని షేడ్స్‌ ఎలా వస్తాయో చూసుకుంటారు. అలా ఏ రంగు ఇంక్‌ తయారు చేయాలో దాని ఫార్ములా చూసుకుంటారు. వీటిలో ఏది ఎక్కువైనా రంగుమారే అవకాశం ఉంది. చాలాజాగ్రత్తగా చూసుకోవాలి. ఇథనాల్‌ అంటే ఆల్కహాల్‌. ఈ పేరు చెబితేనే ఎవరైనా గుర్తుపడతారు. అందుకే దీనికి ఆపేరు పెట్టారు. ఇంత ప్రాసెస్‌ కెమికల్‌ ఇంజినీర్ల దగ్గర, ఆన్‌లైన్‌లో చూసి నేర్చుకున్నారు హరీశ్‌, గాయత్రి గుప్తా. ఈ రంగులు చాలా తొందరగా ఆరిపోతాయి. వీటిని బౌల్‌లో వేసుకొని పెయింట్‌ చేసుకోవచ్చు. గట్టిపడితే బ్లెండింగ్‌ సొల్యూషన్‌ కలుపుకోవచ్చు. చర్మానికి అంటుకుంటే పోవడానికి కనీసం ఐదు రోజులు పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి.
Colours4

అభిరుచినే వృత్తిగా..

నేను హరీశ్‌ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. ఇద్దరికీ పెయింటింగ్‌ అంటే ఇష్టం. ఆ అభిరుచే మా ఇద్దరితో బియాండ్‌ ఇంక్స్‌కు శ్రీకారం చుట్టేలా చేసింది. ఎక్కడ చూసినా భిన్నమైన ఆర్ట్స్‌ కనిపిస్తూనే ఉన్నాయి. అదే టైంలో నేను యూఎస్‌లో ఉన్నాను. ఆల్కహాలిక్‌ రంగులు నన్ను ఆకర్షించాయి. ఇక్కడ వాటిజాడే తెలియదు. హరీశ్‌వాళ్ల అన్నయ్యకు పేపర్‌ బిజినెస్‌ ఉంది. ఇద్దరం మాట్లాడుకొని స్టార్ట్‌ చేశాం. ఆఫీస్‌ పనిని ‘వర్క్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌' చేస్తారు. తల్లిదండ్రులూ ప్రోత్సహిస్తున్నారు.
- గాయత్రి గుప్తా

నాన్నకు మహాఎలక్ట్రానిక్స్‌ కంపెనీ ఉంది. అమ్మ గృహిణి. చిన్నప్పుడు ఆర్ట్‌ వేసేవాడిని. మరలా ఇప్పుడు వేస్తున్నాను. నాన్న ఆఫీసునే బియాండ్‌ ఇంక్స్‌గా ఉపయోగిస్తున్నాం. ఇక్కడ ఒక రూంని ల్యాబ్‌గా వాడుకుంటున్నాం. ఒక కలర్‌ రూ. 199. మూడు కలిపి రూ. 499. మొత్తం 15 రంగులు కలిపి రూ. 2,495 ఉంటుంది. పూర్తి వివరాల కోసం https://www.facebook.com/ beyondinks.in/ సంప్రదించండి.
- హరీశ్‌

- సరస్వతి వనజ గడసంతల శ్రీనివాస్‌

383
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles