బస్తర్‌కళకు పూర్వవైభవం


Sun,December 8, 2019 12:37 AM

అంతరించిపోతున్న ఆదివాసీ కళను కాపాడుకునేందుకు ఓ మహిళ ముందుకు వచ్చింది. అందుకోసం నాలుగు గ్రామాలకు చెందిన మహిళలను ఒక్కతాటిపైకి తెచ్చి తమ ప్రాచీన కళకు జీవం పోస్తున్నది.
bastar-arts
ఛత్తీస్‌గఢ్ బస్తర్ అటవీ ప్రాంతంలో పూర్వం బస్తర్‌కళకు విశేష ఆదరణ ఉండేది. ఈ ఆధునిక జీవన విధానంలో ఆ కళను పట్టించుకునే నాథులే కరువయ్యారు. దీంతో పర్మిళ అనే మహిళ నాలుగు గ్రామాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలను ఈ కళ వైపు మళ్లించింది. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఎన్‌ఐఆర్డీ(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రూరల్ క్రాఫ్ట్ మేళలో ఈ బస్తర్ కళాకృతులను పర్మిళ బృందం ప్రదర్శించింది. ఆదివాసీ తెగల్లోని కళల్లో బస్తర్ కళ ఒకటి. ఇప్పుడు అటువంటి కళాకృతులు తయారు చేసేవారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో బస్తర్ కళ రానురాను కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. ఇదే విషయాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌పూర్‌కు చెందిన పర్మిళ మర్కం అనే మహిళ గుర్తించింది. ఎంతో ప్రాచీనమైన ఈ బస్తర్ కళను భవిష్యత్ తరాల వారికి అందించాలని అనుకున్నది.


అందుకోసం ఆమె రాజ్‌పూర్ గ్రామంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు బస్తర్ కళాకృతుల తయారీలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. ప్రాచీన కాలంలో చెక్కతో మాత్రమే ఈ కళాకృతులు రూపొందించేవారు. అవి పదికాలాలపాటు మన్నికగా ఉండాలనే ఉద్దేశంతో పర్మిళ వాటిని ఇనుముతో తయారు చేయడం మొదలు పెట్టింది. ఇప్పుడు అక్కడి ప్రజల ఆర్థిక పరిస్థితిలో మార్పు వచ్చింది. బస్తర్ కళాకృతులు రూపొందిస్తూ నెలకు రూ. 10 వేల దాకా సంపాదిస్తున్నారు. తమ ప్రాచీన కళకు జీవం పోస్తూనే నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలు ఉపాధి పొందుతున్నారు. సూర్యుడు, జంతువులు, చెట్లు, పక్షులు, దేవుళ్లు వంటి 50 రకాల బస్తర్ కళాకృతులను రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకూ బస్తర్ ఉత్పత్తులు కేవలం రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే ప్రదర్శనల్లోనే అమ్ముతున్నాం,ప్రభుత్వ సహకారంతో త్వరలో ప్రముఖ ఈ- కామర్స్‌వెబ్‌సైట్ల ద్వారా వీటిని దేశవ్యాప్తంగా అందించనున్నామనిపర్మిళ మర్కం చెబుతున్నది.

-నర్రె రాజేశ్
bastar-arts1

390
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles