సమాజమా..! వింటున్నావా..?


Wed,December 4, 2019 01:21 AM

అప్పుడెప్పుడో గాంధీ గారి గురించి ఓ మాట విన్నాను. అతని ఊరు పోరు బందరు.. ఊరి పేరులోనే పోరుందని దడిచేరు కొందరు అని. నువ్వూ అలాగే కదా సమ అన్న పదాన్ని పేరులో పెట్టుకున్నదానివి. సమవర్తిగా న్యాయాన్యాయాలు సరిచూసుకోవాల్సిందానివి. సంగమ స్థలిగా, కూడలిగా, విభిన్న వర్గాలను - వర్ణాలను కలిపి ఉంచే చైతన్య ప్రకాశం నువ్వు. మరి నువ్వే గతి తప్పితే ఎలాగమ్మా? పంచభూతాలు ఆక్రోశిస్తాయి. సృష్టి తన పంజా విసిరి ఈ ప్రపంచాన్ని అంతం చేసి సరికొత్త జీవజాలానికి మళ్ళీ పురుడు పోస్తుంది. అందుకే నువ్వు తార్కికంగా, మానవీయంగా, శాస్త్రీయంగా ఆలోచించి కాస్త మా ఈ అసమానతల్ని, అన్యాయాల్ని, అత్యాచారాల్ని అమానవీయతల్ని సరిదిద్ది మానవాళిని కాపాడవా...
womenharassment
ఏమిటీ.. అలా తెల్లమొఖం వేసుకొని నా వంక చూస్తున్నావు. నేనెవరో నీకింకా అర్ధం కావట్లేదా? జస్టిస్ ఫర్ దిశని. అంత తేలిగ్గా మర్చిపోయే విషయమా నా జీవితం. ఐనా నీకు తెలియంది ఏముంది చెప్పు. పసిపిల్లల మీద అత్యాచారాలు, అతివలపట్ల అమానవీయత, ఉమెన్ ట్రాఫికింగ్ లేనిరోజు కనిపిస్తున్నదా! అసలు ఈ మాటలు రాస్తుంటేనే గుండె పగులుతున్నది తెలుసా.. ఎంత నికృష్టం కాకపోతే ఇలాంటి ఆలోచనలు మెదడులో మొలుస్తాయ్ చెప్పు!
అమ్మంటే కష్టాలకు,కన్నీళ్ళకు వీలునామాకాదు
కల్మషంలేని ప్రేమకు చిరునామా...
కోడలంటే కూడికల తీసివేతల లెక్కకాదు
మన వాకిట్లో పెరిగే తులసి మొక్క...
భార్య అంటే దించేసుకునే బరువుకాదు
మన ఇంట్లో వెలిసిన కల్పతరువు...
కూతురంటే భద్రంగా చూడాల్సిన గాజుబొమ్మ కాదు


మన కడుపున పుట్టిన మన అమ్మ అని నా పోయెట్ ఫ్రెండ్‌లా ఎందుకు ఆలోచించరు? కడుపులో నవమాసాలు మోసిన అమ్మ ఋణం కూతురు రూపంలో మనం తీర్చుకుంటామని చాలామంది నమ్ముతారు. ప్రతి స్త్రీ ఓ వ్యక్తికి భార్యగానో, మరో బిడ్డకు తల్లిగానో, మరొక వ్యక్తికి కూతురుగానో, ఇంకో వ్యక్తికి తోబుట్టువుగానో ఉండే ఉంటుందిగా.. మరి మీ కూతురిలా పవిత్రంగా - మీ భార్యంత గౌరవంగా - మీ అమ్మంత ప్రేమగా - మీ తోబుట్టువంత ఆదరంగా వాళ్ళతో ఉండవెందుకని ఈ మగాళ్ళని అడగవెందుకు సమాజమా? కూతురు ఒక్కక్షణం ఏడిస్తేనేతల్లడిల్లే ఓ తండ్రి హృదయం అతనికి నిజంగా ఉన్నట్లయితే మరో తండ్రి గుండె ఆగిపోయే పని ఎందుకు చేస్తాడు? ఏ అన్న అయినా తన చెల్లిని నిజాయితీగా గౌరవించి ఉంటే మరొకరి చెల్లి పట్ల అంత ఘోరంగా ఎందుకు ప్రవర్తిస్తాడు? ఒక తమ్ముడే కనుక నిండుగా నవ్వే అక్కని తేరిపార ఎప్పుడైనా చూసి ఉంటే ఆ నవ్వును ఎందుకు మరో తమ్ముడి అక్క నుండి దూరం చేయాలనుకుంటాడు.. అందరూ అందరి మగాళ్లకు రక్తసంబంధీకులేగా.. మరి పాము తన పిల్లల్ని తానే చంపుకొన్నంత హేయంగా ఈ అఘాయిత్యాలు, అత్యాచారాలు ఏమిటి? కామానికి లజ్జ, గౌరవం, ఉచితానురీతులు గుర్తుకురావా? అసలు ఏమిటి నేను చేసిన తప్పు? అందంగా పుట్టడమా..

ఆడపిల్లగా బతకడమా.. మనుషుల్ని నమ్మడమా? నా పని నేను చేసుకుంటూ నీకు సేవ చేస్తూనే ఉన్నానుగా.. నేను చూసే పశువులకన్నా క్రూరంగా మనుషులు ప్రవర్తిస్తుంటారని ఎరక్కపోవడం నా తప్పా.. నాకర్థంకావడం లేదు సమాజమా, తెలిస్తే నువ్వయినా సమాధానం చెప్పవూ.. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా - అంటూ నిరంతరం చదువుకొనే మనం- సనాతనమైన ఆ సంప్రదాయాన్ని పక్కకుతోసి ఇంతగా కుళ్లిపోయిన ఈ విచ్చలవిడి అత్యాచారాల జోలికి ఎందుకువెళ్తున్నాం? వేదాలు వెలసిన పుణ్య భూమిలో పుట్టినవారు మహిళల్ని అమ్మి పోగేసుకున్న డబ్బుల్తో జీవనాన్ని సాగించేంతగా దిగజారిపోయి, దైన్యంలో పడిపోతున్నాడా అనిపిస్తున్నది. ఈ కలియుగంలోని కీచకులు, రావణులు, దుశ్శాసనులు ఎన్నో రూపాల్లో ఎక్కడెక్కడో చేస్తున్న ఈ నిరంతర క్రూర పర్వాలకు విముక్తి లేదా? నిర్భయంగా పసిపిల్లలు, ఆడవాళ్లు తిరగ్గలిగే రోజులు రావా? ఎన్నేండ్లుగానో ఎదురు చూస్తున్నాం తెల్సా.. ఉందిలే మంచికాలం ముందుముందునా అని.

ఆ కాలం అసలు వస్తుందంటావా? పురిటిబిడ్డ మీద పాపిష్టి కళ్ళు పడ్డం ఏమిటీ!? నెలన్నర పాప మీద అత్యాచారమా..! 9 నెలల పాపని పొత్తిళ్ల నుండి ఎత్తుకెళ్లి కిరాతక క్రియలతో హింసించి, చంపి భుజాన వేసుకొని నడిచొచ్చే దుర్మార్గుల్ని చూశాక ఇక పిల్లలకి, మహిళలకి రక్షణ ఉందా ఈ నేల మీద అనిపిస్తున్నది. గొంతు చించుకొని అరిచి, గల్లాపట్టి నిలదీయాలనిపిస్తుంది. కానీ నాకు రూపం లేదుగా.. ఎలా నా ఉక్రోషాన్ని తీర్చుకోను. అత్యాచారం జరగని రోజు రావాలని - అత్యాచారాల వార్తలు లేని దినపత్రిక చూడాలని ప్రతి మహిళా ఆశపడుతుంది. అలాగే నేనూ అనుకున్నాను. కానీ నేనే పతాక శీర్షిక అవుతానననుకున్నానా? నాలాంటి ఆడపిల్లల కన్నీళ్లు జీవనదులై పొంగుతుంటే నిజమైన వరదొచ్చి ఈ పాడులోకం కొట్టుకుపోదా- ఎందుకింత నిర్లక్ష్యం, ఉపేక్ష, వెకిలితనాలు? మహిళలకోసం, పిల్లలకోసం ప్రత్యేక భద్రాగారాలు తెరవలేమా - ధర్మాగ్రహంతో ఈ కీచకుల్ని కారాగారాల పాలు చెయ్యలేమా?

మా తల్లుల కడుపుకోత ఎవరు తీర్చాలి- ఇన్ని శిక్షలు పడుతున్నా నేరాలు తగ్గాల్సింది పోయి పెరుగుతున్నాయెందుకు? ఇంట్లోనే విచ్చలవిడిగా చొరబడ్తున్ను టీవీల్లోని అశ్లీల రేప్‌లు.. నీలి చిత్రాల మాయాజాలమా ఇది? విచ్చలవిడిగా దొరుకుతున్న డ్రగ్స్, పెచ్చుమీరిన పాశ్చాత్య ధోరణులదా ఈ తప్పంతా.. ఎక్కడికి పోతున్నావు సమాజమా?! నీడనుకుని.. కాపాడుతుందని నమ్మి చెంతనిలిస్తే పాము పడగై కాటేస్తున్న మానవత్వం, తోడనుకుని ఆదరిస్తే నల్ల తేలై కరిచిన బాంధవ్యం- ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో తెలియడం లేదు. అసలు స్త్రీని భోగవస్తువనో, కుతి తీర్చుకునే కామకేళి అనో ఎందుకనుకుంటున్నారు ఈ మగవాళ్ళు? స్త్రీ అంటే మనకు మాత్రమే కాదు.. ఈ లోకానికే అమ్మ - అన్న స్పృహ ఎందుకురావడం లేదు.. నీ లోపల ఏమి జరుగుతున్నదో నీకేమైనా అర్థమౌతున్నదా సమాజమా.. ఈ క్యాన్సర్ నిన్నేంతగా బలహీన పరుస్తుందో ఇప్పటికైనా గ్రహించు. ఆకాశంలో సగం అంటున్నారు.. అవనిలో సగం అంటున్నారు ఆనందాల్లో సగం ఇవ్వకపోగా అవమానాలు మాత్రం హెచ్చుగానే చేస్తున్నారు. ఆత్మగౌరవాన్ని అందించకపోగా అడుగడుగునా విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు. ఇదేనా మేమంతా ఉన్న నీ రూపం?

మాకేది సౌకర్యంగా, సదుపాయంగా ఉందో ఆ బట్టలేసుకొంటే రెచ్చగొట్టేలా వస్త్రధారణ ఉందని.. అందుకే పురుషులు టెంప్ట్ అయిపోయి అత్యాచారాలు చేస్తున్నారని- పుచ్చిపోయిన మెదళ్లు కొన్ని తమ జాతిని సపోర్ట్ చేస్తున్నాయ్. ఒంటినిండా బట్టలేసుకున్న నేనేమి రెచ్చగొట్టాను అని నువ్వు అడగవేమి? ఒకటి-రెండు నెలల పాప ఏ బట్టలేసుకొని రెచ్చగొట్టిందని మరోమారు అడుగు సమాజమా? పసిమొగ్గల్లో పరువాన్ని చూసే పాపాత్ముల్ని ఏమనాలి.. తాగి రాక్షసుల్లా నన్ను హింసించడమే కాక పెట్రోల్ పోసి తగలేస్తారా..? వీళ్ళా మన పౌరులు.. మనతో బతికే సహవాసులు.. సంఘజీవులు? అవునా? మనుష్యజాతిని కబళించే ఈ దుష్టగ్రహాలకి, మానవత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్న ఈ నరరూప రాక్షసులకి ఏ చట్టం కావాలి? ఎన్ని శిక్షలు వేయాలి?! నా అక్క నిర్భయ ఉదంతం జరిగినప్పుడు దేశమంతా తమ ఆడబిడ్డకే దురన్యాయం జరిగినట్టు తల్లడిల్లిపోయారు. నేను ఉద్యమస్ఫూర్తితో ముందుకు కదిలాను ఆ అలజడి ఒక చట్ట రూపకల్పనకి దారి తీసి వేలమంది బాధితుల కంటినీరు తుడవడానికి, మృగాళ్లని కారాగారాల పాలు చేయడానికి దోహదం చేసింది. నిజమే కదా- మాంసానికి అలవాటు పడ్డ పులులు సభ్య సమాజంలో ఉండే అర్హతను కోల్పోతాయి.

వీళ్లూ అంతే అనుకున్నాను.. కానీ ఇంకా వాళ్లకి మరణశిక్ష అమలు పరిచారా.. లేదే.. ఎందుకు?. నిస్సహాయ పసిపిల్లలతోనూ, కౌమార ఆడపిల్లలతోనూ అసభ్యంగా ప్రవర్తిస్తూ అదును చూసి పంజా విసిరి కబళించే క్రూరమృగాలు.. వీళ్ళ తరపున వాదించడానికి ఏ న్యాయం ఉంది? వీరికి బాసటగా నిలబడటానికి.. వీళ్ళకి అండగా ఉండడానికి సంస్కరణలు కుటుంబాలనుండే మొదలవ్వాలి. కుటుంబమే ఓ చిన్న సమాజం అక్కడే తప్పుల్ని సరిదిద్దుకో గలిగితే శాంతి ప్రపంచమంతా నిండుతుంది. ఉదాహరణకి షుగర్ బాధితుడికి వేలు పుచ్చిపోయి కాలుకి పాకితే కాలు తీసేస్తున్నామా లేదా? అయ్యో నా కాలా అని ఏడుస్తున్నామా. ఇదీ అంతే. మనింట్లో మన పిల్లోడు దారి తప్పితే చెడిపోయిన వాడిని మంచి మాటలతో దారికైనా తేవాలి లేదా పోలీస్‌స్టేషన్లలో అయినా అప్పచెప్పాలి. మన మమకారం మరోకుటుంబానికి శాపంగా మారకూడదు.. మరి దీని మూలంగా కేసులు తగ్గాలి కదా - ఎందుకు పెరుగుతున్నాయి. అంటే మనం సరైన దారిలో వెళ్ళడం లేదనేగా అర్థం.. ఆడదాని బలహీనత పిల్లలు వాళ్ళ భవిష్యత్, మగవాడి ధైర్యం అర్ధబలం, అంగ బలం, మగవాడినన్న అహం నాకు పిల్లలకి ఏంకాదన్న విశ్వాసం కల్గిస్తే చాలు.. ఏంచేసినా చెల్లిపోతుందిలే అనే మగ అహంకారాన్ని దెబ్బ కొడితే చాలు - ఒక్కసారి అయిన మంచి దారిలో నువ్వు నడిచినట్లే.

వెంటాడే చూపు వేటాడే తలపు.. కామస్పర్థ, చెరపట్టిన చేవ మెలితిప్పే నొప్పి.. పైకి చెప్పలేని వేదన, లోకం పట్ల ఏవగింపు కలిగేలా మేం బతకాలా? అంగాంగాల్ని నలిపేసే ఆరాచకత్వం పెరుగుతుంటే వెయ్యాల్సింది సిగ్గుబిల్లలా , ఇనప కచ్చడాల అంగవస్ర్తాలా? ఇంత నిర్లజ్జగా తెగిస్తే చట్టాలు, కోర్టులు, శిక్షలు అవసరమా అంటున్నారు. కానీ, మోరల్ పోలీసింగ్- కమ్యూనిటీ పోలిసింగ్ కావాలన్నదే కదా మన కోరిక కూడా. ఇంద్రుడి వందకళ్ళని తెచ్చుకుని ప్రతి అమ్మ కాపలా ఉండాలా మా మానసంరక్షణార్థం - కృష్ణుడు ద్రౌపదికి చీర అందించినట్టు ఎవరో వస్తారని ఎదురు చూస్తూ బతకాలా ఇంకా? మనల్ని మనం నియంత్రించుకోలేమా? మగాడి ఆలోచనల్ని సరైన దారిలో పెట్టలేమా? పెంపకం నుంచే పరివర్తన తేలేమా? నిజమే సమాజమా! మనుషులు మృగాళ్లుగా మారుతున్నారంటే నువ్వూ, నేను, మనమంతా కారణమే. ఒక పిల్లాడిని మంచి పౌరుడిగా తీర్చిదిద్దడానికి ఊరుకి ఊరే కావాల్సి వస్తుందంటారు. కానీ ఒక పిల్లవాడు దుర్మార్గుడిగా, కిరాతకుడిగా తయారుకావడానికి మాత్రం విచ్ఛిన్నమైన, విశృంఖలమైన కుటుంబ నేపథ్యం, అశ్లీల దృశ్యాల వీక్షణలు కీలకమైన కారణాలు. నిజం.. మత్తుమందులు, అశ్లీల చిత్రాలు మనిషి విచక్షణని దెబ్బతీస్తాయి. ఏం చేస్తున్నామో తెలియని ఉద్రేకాన్ని నింపేస్తాయి. తమాయించుకునే గుణాన్ని, నియత్రించుకోగల సామర్థ్యాన్ని కాలరాస్తాయి.

చట్టాలు ఆడవాళ్ళకు ఎన్నో రక్షక వలయాల్ని ఏర్పాటు చేశాయి. అడుగడుగునా అండగా నిలిచాయి. కానీ ఎంతమందికి చట్టం పట్ల అవగాహన ఉంది? అసలు తమ రక్షణ కోసం ఉన్న చట్టాలు ఏమిటో అన్న చైతన్యం కూడా లేకపోవడం బాధాకరం. నువ్వు కాస్త ఆ చైతన్య యాత్రలు- అవగాహనా శిబిరాలు పెట్టవా సమాజమా? అయినా నా పిచ్చి గానీ, నా ప్రియ సమాజమా! చట్టాలు, శిక్షలు ఎన్ని ఉన్నా మనుషుల్లో - ముఖ్యంగా మగాళ్లలో మార్పు రానంత వరకూ, మాలో ఆ చైతన్యం, బాధ్యతాయుత వైఖరులు రూపొందేవరకూ ఇవన్నీ కాగితపు రాతలుగానే మిగులుతాయి. ముందు మా మైండ్ సెట్స్ మార్చు. యుగాలు, తరాలు గడిచినా, రాజ్యాలు, సామ్రాజ్యాలు మారినా, చట్టాల తీవ్రత పెరిగినా నేరాలు ఎప్పటికప్పుడు కొత్త ముసుగులతో కొత్త అవతారాలు ఎత్తుతూనే వచ్చాయి. ఇది నీకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు కదా.. అందుకే, ఆడబిడ్డ అస్తిత్వానికి గౌరవం రావాలన్నా, ఆమె ఆత్మగౌరవంతో మనుగడ సాగించాలన్నా మార్పు రావాల్సింది మొదట నీలోనే.. మనుషులు, మగాళ్ళందరి సామూహిక మనస్తత్వాన్ని పెంచి, పోషించి, పాలించి, శాసించిన నీ నుండే ఆ దృక్కోణం మారాలి. నా ప్రియాతి ప్రియమైన సమాజమా! దేవుని తర్వాత అంత శక్తిమంతమైనది సమాజం అని ఒక వేదాంతి చెప్పింది నీకున్న ప్రభావతత్వాన్ని పునరుద్ఘాటించేదే కదా! అలాగే, వ్యక్తితో సమాజం మారుతుందా? సమాజంతో వ్యక్తి మారతాడా? వ్యక్తి కన్నా సమాజమే - నువ్వే బలమైన దానివని ప్రపంచానికి చాటే సమయం ఇప్పుడు ఆసన్నమైంది.

నిన్ను మించిన పాఠశాల గానీ, ప్రయోగశాల గానీ లేదని ఎందరో ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు. ఆ మాటలను రుజువు చేసే క్షణం ఇదే. ఇక, లే.. నీ పాజిటివ్ ముఖాన్ని చూపించు. నీ సంప్రదాయాల జూలు విదుల్చు. నీ జీవన విలువల రెక్కలు కదుల్చు.. నీ మానవతా నియమాల చూపులను ప్రసరించు.. నీ విశ్వ సౌభ్రాతృత్వ హస్తాలను అందించు.. నీ ఆదర్శ ఆశయాల నడకలను ఈ మనుషులకు నేర్పించు.. వారందరినీ బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దు.. ఒక నిర్భయ.. మరో అబల.. ఇంకో అసిఫా.. మరో స్వప్నికా.. ప్రత్యూషా.. మానస.. పేరులో ఏముంది .. అందరం బాధితులమే .. మా అందరి చావు నీకు కనువిప్పు కావాలి.. ఇకనైనా కళ్ళు తెరువు. మానవ జాతి బతకాలంటే ముందు ఆడది బతకాలన్న స్పృహ తెచ్చుకో. మగవాడు ఏమి చేసినా ఒప్పే అన్న సంకుచిత భావనలోంచి బయట పడి మానవతను కాపాడు.. నిన్ను నువ్వు కాపాడుకో. సమాజమా, నా అవశ్యక నేస్తమా.. నా విన్నపాన్ని ఆలకించు.. నవ మానవ లోకాన్ని సృష్టించు.

అసలు ఏమిటి నేను చేసిన తప్పు? అందంగా పుట్టడమా.. ఆడపిల్లగా బతకడమా.. మనుషుల్ని నమ్మడమా? నా పని నేను చేసుకుంటూ నీకు సేవ చేస్తూనే ఉన్నానుగా.. నేను చూసే పశువులకన్నా క్రూరంగా మనుషులు ప్రవర్తిస్తుంటారని ఎరక్కపోవడం నా తప్పా.. నాకర్థంకావడం లేదు సమాజమా, తెలిస్తే నువ్వయినా సమాధానం చెప్పవూ..

పాలక పక్షానిదే తప్పని ప్రతిక్షాలు.. పోలీసులదే తప్పని ప్రజా పక్షాలు.. పెంపకాలే తప్పని పెద్దవాళ్లు.. మమ్మల్ని ప్రేమించడం లేదని పిన్నవాళ్లు.. ఇలా తిలా పాపం తలా పిడకెడు పంచుకుంటున్నారే కానీ, ఇది సామూహికంగా నీ సమిష్టి తప్పని ఒప్పుకోవడానికి నామోషీ ఎందుకు సమాజమా? ఎప్పుడు అత్యాచారం జరిగినా ఎవరో ఒకరిని బలి చెయ్యడం తప్ప.. నిన్ను నీవు సరిచేసుకునే ఆత్మ పరిశీలనను ఎప్పుడూ చేసుకోవా..?!

అంగాంగాల్ని నలిపేసే ఆరాచకత్వం పెరుగుతుంటే వెయ్యాల్సింది సిగ్గుబిల్లలా, ఇనప కచ్చడాల అంగవస్ర్తాలా? ఇంత నిర్లజ్జగా తెగిస్తే చట్టాలు, కోర్టులు, శిక్షలు అవసరమా అంటున్నారు. కానీ, మోరల్ పోలీసింగ్- కమ్యూనిటీ పోలిసింగ్ కావాలన్నదే కదా మన కోరిక కూడా.

ఈ చట్టాలు తెలుసా?

womenharassment1
1. సెక్షన్ 100 ప్రకారం ఆత్మరక్షణ కోసం దాడి చేసినప్పుడు ఎదుటి వ్యక్తి చనిపోయినా తప్పులేదని, శిక్ష పడదని చెబుతున్నది.
2. 116 (బి) సెక్షన్ ప్రకారం బాధితురాలికి హాస్పిటల్లో చికిత్స చేయకపోతే అది పనిషబుల్.
3. అత్యాచార బాధిత మహిళ అనుమతి లేకుండా మీడియా ఆమె పేరు, ఫొటోలు ప్రచురిస్తే, చూపిస్తే 228 సెక్షన్ ప్రకారం ఆయా సంస్థలు బాధ్యత వహించాలి.
4. 354 సెక్షన్ ప్రకారం స్త్రీని వక్రదృష్టితో చూసినా, తాకినా, అవమాన పరిచినా, ఫొటో-వీడియోలు తీసినా ఆ బాధితులు ఫిర్యాదు చేయొచ్చు. బట్టలు తొలగించే చర్య చేస్తే 354 (డి) సెక్షన్ ప్రకారం 3 నుంచి 7 యేండ్ల ఖైదు పడుతుంది.
5. 18 యేండ్ల లోపు అమ్మాయితో సెక్స్‌లో పాల్గొంటే, అది ఆమె అంగీకారంతోనే అయినా కూడా 376 సెక్షన్ ప్రకారం నేరం. అందుకు ఏడేండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు.
6. 509 సెక్షన్ ప్రకారం సైగలు చేసినా, అది అవమానం చేసినట్లు భావించి శిక్షిస్తారు.
7. ఫొటో మార్ఫింగ్ చేస్తే 499 సెక్షన్ ప్రకారం శిక్షార్హమే.
8. 18 ఏళ్ల బాలికను అమ్మినా, కొనుగోలు చేసినా పదేండ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు.
9. 376 (డి) సెక్షన్ ప్రకారం సామూహిక అత్యాచారాల విషయంలో.. ఒకరి మీద ఎక్కువమంది సామూహికంగా అత్యాచారం చేస్తే జీవిత ఖైదు విధించవచ్చు.
10. 366 (ఏ) ప్రకారం మైనర్ బాలికను వ్యభిచార కూపంలోకి దించినా, లైంగికంగా ప్రలోభ పెట్టినా పదేండ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. నాన్ బెయిలబుల్‌గా కేసు నమోదు చేస్తారు.
11. బలవంతంగా ఎత్తుకెళ్లినా, పెళ్లి చేసుకున్నా పదేండ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.

- శ్రీలక్ష్మి ఐనంపూడి

499
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles