చీకట్లో ప్రయాణం చేస్తున్న వాహనాలు, ఐదు సెకన్లముందు రోడ్డుమీద పడుకొని ఉన్న శునకాల్ని గుర్తించగలిగితే చాలు. ప్రమాదాన్ని ఆపవచ్చు. అందుకు ఓ పరిష్కారం కనుగొన్నాడు. దీనికి రతన్ టాటా సహాయం కోరాడు. ఆ పరిష్కారానికి రతన్ టాటా ఏం సహాయం చేశాడు?

పూణెకు చెందిన షాంతను నాయుడు ఆటోమోటివ్ డిజైన్ ఇంజినీర్. ప్రమాదవశాత్తు ఒకరోజు చీకటిలో పడుకొని ఉన్న శునకం మీదకు కారు దూసుకువెళ్లింది. కళ్లముందు జరిగిన అలాంటి దుర్ఘటనలకు స్వస్తి పలకాలనుకున్నాడు. అతను ఆటోమోటివ్ డిజైన్ ఇంజినీర్ కాబట్టి కార్లపై ఉపయోగించే రిప్లెక్టివ్ టేపుల మీద అవగాహన ఉన్నది. దీన్ని డాగ్ కాలర్ నమూనా ప్రతిబింబం టేపుతో రూపొందించడానికి సహాయడపడుతుంది. అందుకు తన ఫ్రెండ్స్ మద్దతు పలికారు. వీరివద్ద సరిపడా డబ్బులేదు. ఈ రోజుల్లో ప్రతిఒక్కరి ఇంట్లోని అల్మరాల్లో ధరించని డెనిమ్ దుస్తులు ఉంటాయి. వాటిని సేకరించి ప్రోటోటైప్లను నిర్మించారు. 2014 చివరినాటికి డెనిమ్ విరాళం ప్రచారాన్ని ప్రారంభించారు. విరాళం ఇవ్వడానికి చాలామంది ముందుకు వచ్చారు. ఆ డబ్బుతో 500 కాలర్లు తయారు చేశారు. నగరంలో మోటార్‌సైకిల్ రైడింగ్గ్రూపుల సహాయంతో అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుక్కలకు కాలర్ చేయడం గురించి చెప్పారు. దీంతో శునకాలు చాలా ప్రమాదాల నుంచి బయటపడ్డాయని ప్రజలు చెప్పారు.
2015 నాటికి అతని స్నేహితులతో మోటోపాస్ అనే జంతువుల సంక్షేమ ఎన్జీఓను కుక్కలకు అంకితం చేశారు. నెలలు గడుస్తున్న కొద్ది ఈ కాలర్లకు డిమాండ్ పెరుగుతున్నది. తయారు చేసేందుకు నిధులు లేవు. ఏం తోచని పరిస్థితుల్లో జంతువులను ఎంతగానో ప్రేమించే ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు లేఖ రాయమని నాయుడు తండ్రి సలహా ఇచ్చాడు. హృదయపూర్వకంగా లేఖ రాశాడు. రెండు నెలల తర్వాత నాయుడుని కలవాలంటూ టాటా సమాధానం ఇచ్చాడు. 2015 ఏడాది చివరిలో ఆయన్ని కలిసి సాయం అందుకున్నాడు. ఇప్పుడు ఆ ఎన్జీఓ 11 నగరాలు భారతదేశం, నేపాల్, మలేషియా మూడు దేశాలకు విస్తరించింది. వలంటీర్లు ప్రతిరోజూ కుక్కలను కాలరింగ్ చేస్తారు. డెనిమ్‌ను ఉపయోగించకుండా సూపర్‌లైట్ ఇండస్ట్రియల్ ప్లోరోసెంట్ ఆరెంజ్‌ను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. దీనికి వాటర్‌ప్రూఫ్ ఉంటుంది. నెలకు 1000-1500 డాగ్కాలర్లను తయారు చేస్తున్నారు. ఖర్చు ధరకే వీటిని విక్రయిస్తున్నారు. ఇప్పుడిది వేలాది కుక్కల ప్రాణాలను రక్షించే ఉద్యమంగా మారిపోయింది.