అంకుర సంస్థల విజయసారథి


Sat,November 23, 2019 01:37 AM

ఆవిష్కరణలు కార్యరూపం దాల్చాలంటే అందుకు అవసరమైన పరిశోధన నిరంతరం కొనసాగాలి. అప్పుడే సరికొత్త ఆవిష్కరణలు రూపాంతరం చెందడానికి అవకాశం ఉంటుంది. నూతన ఆవిష్కరణలు పుట్టుకు రావడం వల్ల నిరుద్యోగ సమస్య తగ్గి, దేశం శరవేగంగా అభివృద్ధి చెందడానికి వీలుంటుంది. అటువంటి అంకుర సంస్థలకు సరైన వేదిక కల్పిస్తూ అనేక కొత్త స్టార్టప్‌లకు పురుడుపోస్తున్నారు తెలంగాణకు చెందిన దేవిరెడ్డి శ్రీదేవి. ఔత్సాహిక యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చి.. ప్రైవేట్ సెక్టార్ మెంటార్ జాతీయ పురస్కారం అందుకున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించారు శ్రీదేవి. 22 యేండ్లుగా ఎంతోమందికి మార్గనిర్దేశనం చేసిన ఆమె.. జిందగీతో తన అనుభవాలు పంచుకున్నారు.
sridevi

Innovation is the key to success

సరికొత్త పరికరాన్ని తయారుచేయాలంటే అందుకు అవసరమైన పరిశోధనతోపాటు అభివృద్ధికి సంబంధించి పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. ఆలోచన రావడమేకాదు. దానిని అమలు చేయడానికి అవసరమైన వనరులు కావాలి. వాటిని సమకూర్చుకోలేకపోతే ఎంత గొప్ప ఆలోచన అయినా ప్రయోజనం ఉండదు. వచ్చిన ఆలోచనను అమలు చేసేందుకు మూడు దశలుంటాయి. మొదటి దశలో ఏమేం అవసరమో తెలుసుకుని సమకూర్చుకోవడం. రెండో దశలో ఎలా తయారు చేస్తే మరింత ప్రయోజనం ఉంటుందో తెలుసుకోవడం. మూడో దశలో తయారు చేసిన ఆ వస్తువును వినియోగదారునికి ఎలా చేర్చాలి? అనేటటువంటి అంశాలు ఏ స్టార్టప్ విజయం సాధించాలన్నా చాలా ముఖ్యం. స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచనకు తగిన వనరులు అందుబాటులో లేకనే చాలామంది ఆలోచన దగ్గరే ఆగిపోతున్నారు. అటువంటి వారికి వేదిక కల్పించాలనే లక్ష్యంతో శ్రీదేవి ఎస్‌ఆర్ ఇన్నొవేషన్ ఎక్ఛేంజ్‌ను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడానికి వరంగల్‌లో ఎస్‌ఆర్ ఇన్నోవేషన్ ఎక్స్‌చేంజ్ సంస్థ ముందుకొచ్చింది. దీని ద్వారా ఇప్పటి వరకు 31 అంకుర సంస్థలు పురుడు పోసుకున్నాయి. వీటిల్లో వ్యవసాయ రంగానికి చెందినవే ఎక్కువగా ఉన్నాయి.

విద్యార్థులకు ఉచితంగా..

వరంగల్ పరిధిలో ఉన్న అన్ని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు శ్రీదేవి. విద్యార్థుల్లో సరికొత్త వ్యాపార ఆలోచనలకు శ్రీకారం చుట్టేందుకు వారికోసం ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి వచ్చిన ఉత్తమ ఆలోచనలను పరిగణనలోకి తీసుకొని వాటిని స్టార్టప్ రూపంలోకి తీసుకువస్తున్నారు. మొదట తయారుచేసే వ్యాపార వస్తువుకు డిజైనింగ్, టెస్టింగ్‌తోపాటు మార్కెటింగ్ సదుపాయాలను గురించి ఇక్కడ నేర్పిస్తున్నారు. అందుకు సంబంధించి వారానికి రెండుసార్లు విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.
sridevi1

వ్యాపార మార్గదర్శకురాలిగా..

శ్రీదేవి ఇండియన్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)కోజికోడ్ నుంచి స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఇన్నోవేషన్ కోర్సు చేశారు. దాదాపు 22 ఏండ్లకుపైగా ఆమె పలు సంస్థల్లో వ్యాపార మార్గదర్శకురాలిగా కొనసాగారు. దీంతో పార్ట్‌నర్‌షిప్ మేనేజ్‌మెంట్, కార్పొరేట్ రిలేషన్స్, పి అండ్ ఎల్ ఆపరేషన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్ వంటి అనేక అంశాలపై శ్రీదేవి పట్టు సాధించారు. ద ఇండస్ ఎంటర్ ప్రెన్యూర్ (టీఐఈ) హైదరాబాద్ సంస్థలో అనేక అంకుర సంస్థలకు దిశానిర్దేశనం చేశారు. డిజైన్, ఫాబ్రికేషన్, ఫినిషింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల చాలా స్టార్టప్‌లు మొగ్గదశలోనే ఆగిపోతున్నాయని గ్రహించారు శ్రీదేవి. అప్పుడే ఎస్‌ఆర్ ఇన్నొవేషన్ ఎక్స్ఛేంజ్‌ను ఏర్పాటు చేశారు.

దేశంలోనే తొలి మహిళగా..

భారత నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ నాలుగేండ్లుగా ప్రైవేట్ సెక్టార్ మెంటార్ అవార్డు అందిస్తున్నది. ఇప్పటి వరకు ఈ అవార్డును పురుషులే అందుకున్నారు. 22 ఏండ్లలో శ్రీదేవి 22వేల మంది విద్యార్థులకు వర్క్‌షాప్స్, సెమినార్లు, హాకతాన్ల ద్వారా మార్గనిర్దేశనం చేశారు. రెండేండ్లలో వినూత్న ఎకో సిస్టమ్‌ను సృష్టించడంలో ఆమె విజయం సాధించారు. ఆమె అందించిన సేవలను భారత నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ గుర్తించింది. కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే చేతుల మీదుగా ఇటీవల ఢిల్లీలో ప్రైవేట్ సెక్టార్ మెంటార్ అవార్డు అందుకున్నారు శ్రీదేవి. ఈ అవార్డు అందుకున్న వారిలో శ్రీదేవి దేశంలోనే తొలి మహిళ కావడం విశేషం. ఆమె ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఏపీ, టీఎస్)లో మెంబర్‌గానూ ఉన్నారు. జాతీయ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందని శ్రీదేవి చెబుతున్నారు.

వ్యవస్థను బలోపేతం చేయాలి

వరంగల్ వంటి నగరాల్లో అంకుర పరిశ్రమలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అక్కడి క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించేందుకు స్థానిక పారిశ్రామికవేత్తలు ఎంతైనా అవసరం. వ్యవస్థను బలోపేతం చేయడానికి మా ఎస్‌ఆర్ ఇన్నొవేషన్ ఎక్ఛేంజ్ అనుసరించే విధానాలే సరైన మార్గం అని నేను గట్టిగా నమ్ముతున్నా. చిన్ననగరాల్లో ఇటువంటి మెంటార్ నెట్‌వర్క్ చాలా అరుదుగా ఉంటుంది. ఈ కారణాలతో పాటు ఒక సుస్థిరమైన సూక్ష్మ ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే ఉద్ధేశంతో ఎస్‌ఆర్ ఇన్నొవేషన్ ఎక్స్‌చేంజ్ ను వరంగల్‌లో ఏర్పాటు చేశా. ఈ అవార్డు నేను ముందుకు వెళ్ళేందుకు ఒక స్పూర్తినివ్వడమేకాకుండా, మరింత బాధ్యతను పెంచింది.
- శ్రీదేవి దేవిరెడ్డి , ఎస్‌ఆర్ ఇన్నొవేషన్ ఎక్స్‌చేంజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్

-పసుపులేటి వెంకటేశ్వరరావు

sridevi2

374
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles