రామసేతును ఈదడమే.. లక్ష్యంగా..


Wed,November 20, 2019 01:46 AM

నువ్వు సివిల్స్ రాసి పెద్ద అధికారివి కావాలిరా కూతురిని కోరాడు తండ్రి. ఆమె కోచింగ్‌లో చేరింది. కానీ చదువలేదు. బొమ్మలు గీసింది. ఆమెకు ఆర్టిస్ట్ కావాలని కోరిక.


ఆమెకు పెండ్లయింది. వంటలు చేసింది.. సేవలు చేసింది. తర్వాత పిల్లలు. ఇంటి దగ్గరే ఆగిపోలేదు.కలల్ని కనడం ఆపలేదు. 40 ఏండ్లు గడిచాయి. కలలను వేటాడింది. ఆమె ఇప్పుడు చాంపియన్.. అయినా ఆగిపోవాలనుకోవడం లేదు..

shamala
జీవితంలో స్థిరపడడానికి హడావుడి.. డబ్బు సంపాదించడానికి తొందర.. చాలామంది జీవిత చట్రం ఉండేది ఇలాగే. ఇట్లా అన్నింటికీ తొందరే. ఇలాంటి తొందర మరి ఎవరి జీవితాన్ని వాళ్లు జీవితాన్ని ప్రేమించుకోవడానికి ఉండదు ఎందుకో?

సగం జీవితం చదువుకు, సగం జీవితం ఉద్యోగానికి అయిపోతే జీవితాన్ని ఆస్వాదించేదెప్పుడు? ఎప్పుడంటే.. నీ కోసం నువ్వు కొన్ని కలల్ని కన్నప్పుడు.. వాటిని నెరవేర్చుకున్నప్పుడు. ఆ కలలకు పరిస్థితులతో, వయసుతో సంబంధం ఉండకపోవచ్చు.
శ్యామలను కలిస్తే ఆ కలల ప్రయాణం అంటే ఏంటో? వాటిని సాధించినప్పుడు దక్కే ఆనందం ఎలాంటిదో చెప్తుంది..

ఆమె ఆర్ధరాత్రి మేల్కొంది. పుస్తకాలు పట్టుకుంది. తండ్రి చూసి చదుకుంటుందేమో అనుకున్నాడు. కానీ, ఆమె బొమ్మలేస్తూ కూర్చునేది. ఇది తెలియని తండ్రికి ఆమెలో ఓ సివిల్ ఆఫీసర్ కనబడేది. ఆమె డిగ్రీ అయింది. నువ్వు సివిల్ ఆఫీసర్ అయితే చూడాలనుంది తండ్రి కోరుకున్నాడు. తండ్రి కోరికలో తప్పులేదు. కూతురూ అంగీకరించింది. కోచింగ్‌లో చేరింది. కానీ, ఆమె మనసు మాత్రం బొమ్మల మీదే. సివిల్స్ కోచింగ్‌లో చేరిన ఆమెను బొమ్మలు మాత్రం వదలడం లేదు. తల్లిని అల్లుకుపోయే పిల్లల్లా..

శ్యామల కోచింగ్ వదిలేసి బొమ్మలు గీయడమే అభిరుచిగా మార్చుకుంది. తండ్రికి తెలిసింది. కూతురు ఆఫీసర్ అవ్వాలనుకుంటే ఈ ఆర్టిస్ట్ అవడం ఏంటో ఆయనకు అర్థం కాలేదు.
ఓ రోజు శ్యామల, తండ్రితో ట్యాంక్‌బండ్‌కు వెళ్లింది. చాలామంది ఉన్నారు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా.. కొందరు ఫుట్‌పాత్ మీద బొమ్మలు వేసుకుంటూ కూర్చున్నారు. శ్యామల చూసిందో లేదో తెలియదు కానీ తండ్రి మాత్రం చూశాడు..
నువ్వు బొమ్మలేసుకుంటూ ఉంటే రేపు వీళ్లలాగా రోడ్ల మీద కూర్చోవాలి. ఇదా నువ్వు ఎంచుకునే ఉద్యోగం అన్నాడు చాలా సులభంగా..
కాలం మారింది. శ్యామల మాత్రం మారలేదు. బొమ్మలు వేయడం మానలేదు. అప్పుడే ఆమెకు పెండ్లి అయింది.

పెండ్లి తర్వాత భర్త ఉద్యోగరీత్యా కర్నాటకకు వెళ్లింది. ఆయన ప్రోత్సాహంతో యానిమేషన్‌లో చేరింది. బొమ్మలు గీసింది. ప్రాణం పోసింది. స్పైడర్ మ్యాన్, సూపర్‌మ్యాన్, డోరా మ్యాన్ వంటి పాత్రలకు ధీటుగా కామిక్ పాత్రలు సృష్టించింది. కొన్ని సినిమాలకు యానిమేటర్‌గా పని చేసింది. ఫ్యారిస్‌లో జరిగిన యానిమేషన్ చిత్రాల సదస్సుకు వెళ్లొచ్చింది. తర్వాత ఆమె ప్రయాణం అంతా యానిమేషన్, వెబ్‌డిజైనింగ్, సొంత కంపెనీ చుట్టూ సాగింది. రాత్రింబవళ్లు కష్టపడింది. ప్రాజెక్టులు చేసింది. ఒకదశలో ఈ రంగంలో ఎదురు దెబ్బలు తగిలాయి. ఆయినా ఓటమిని ఒప్పుకోలేదు. కారు అమ్మేసి సొంత ఆఫీస్ పెట్టింది. తండ్రికి తెలియకుండా గది అద్దెకు తీసుకొని వెబ్‌డిజైన్ చేసింది. అంతర్జాతీయ కంపెనీల నుంచి ఆర్డర్లను తీసుకుంది. ఆమె చేసిన యానిమేషన్లు ఆయా చానెళ్లు సీరియళ్లుగా వేశాయి. ఆమె వెబ్‌డిజైన్లకు అంతర్జాతీయ కంపెనీలే ఫిదా అయ్యాయి.

రాజీవ్ త్రివేది సహకారంతో..

Shamala1
సముద్రంలో స్విమ్మింగ్ చేయడానికి శిక్షణ కోసం ఇంటర్నెట్‌లో ట్రెయినర్ కోసం వెతికింది శ్యామల. గంగానది, పాక్ జలసంధి, ఇంగ్లిష్ చానల్‌ను ఈదిన ప్రభుత్వ హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ రాజీవ్ త్రివేదిని సంప్రదించింది. మూడు నెలల తర్వాత కలవాలన్నారాయన. అంత సేపటిలో సమయం వృథా అవుతుందనీ భావించింది శ్యామల. అందుకే ఆమె స్విమ్మింగ్ ఆకాడెమీలో ప్రాక్టీస్ చేస్తూ వీడియోలు త్రివేదికి పంపేది. ఇలా ఆయన తప్పులు సరిదిద్ది మెళకువలు చెప్పేవాడు. మూడు నెలల తర్వాత త్రివేదిని కలిసింది శ్యామల. అప్పుడు మైసూర్‌లో జరిగిన 5 కిలోమీటర్ల ఈత పోటీలో శ్యామల రెండో స్థానంలో నిలిచింది. తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నది. అక్కడ పెద్ద స్విమ్మర్లను కలుసుకొని అనుభవాలు తెలుసుకుంది.

కొత్త ప్రయాణం.

అందరిలాగే శ్యామల కూడా ఇల్లాలి జీవితం గడిపింది. ఇల్లు, ఉద్యోగంతో రోజులు గడిపేది. ఉద్యోగం అంటే ఉద్యోగం కాదు అదొక ఆనందం, ఒక సంతృప్తితో జీవితాన్ని ఆస్వాదించేది. యానిమేషన్‌లో క్రమంగా శ్యామలకు కొత్త ప్రాజెక్టులు, కొత్త అవకాశాలు వచ్చాయి. కంపెనీలు కూడా ఎక్కువ డబ్బులే ఇచ్చాయి. శ్యామలకు 40 ఏండ్లు వచ్చాయి. ఈ క్రమంలో ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. అయినా ఆగిపోవాలనుకోలేదు. ఇంకా ఆనందంగా ఉండాలనుకుంది, ఇంకా ఏదైనా సాధించాలనుకుంది. కొత్త ప్రయత్నాలు చేసింది. స్మిమ్మింగ్.. ఆమెకు కొత్త దారిని చూపినట్టయింది.

కానీ ఆమెకు నీళ్లంటే భయం.

చిన్నప్పటి నుంచీ నీళ్లంటే భయం ఉన్న శ్యామల నీళ్లలో దిగింది 40 ఏండ్ల వయసులో. 2016లో శ్యామల ఈత శిక్షణలో చేరింది. ఈత అలవాటు చేసుకుంది. ఇలా ఆమె ఏదైనా పోటీలో పాల్గొనాలని అనుకుంది. ఇంగ్లిష్ చానెల్‌ను ఈదడంపై ఓ ఆర్టికల్ చదివింది. శ్యామల ఇలాంటి లక్ష్యాన్ని సాధించాలనుకుంది. అందుకు మరింత శిక్షణ తీసుకుంది. పోటీలో పాల్గొనే సమయం కూడా వచ్చింది. కృష్ణా నదిలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్నది. 1.5 కిలోమీటర్ల దూరాన్ని 36 నిమిషాల్లో ఈది వచ్చింది. తర్వాత సముద్రంలో ఈదాలనుకుంది. గోవాలో జరిగిన పోటీలకు వెళ్లింది. అక్కడ పరిస్థితులు అనుకూలించలేదు. నిర్వహకులను అడిగి వలంటరీగా చేసి పోటీలను దగ్గరుండి చూసింది. కానీ, కోరిక మాత్రం చంపుకోలేదు. సముద్రంలో ఈదడానికి సిద్ధం కావాలనుకుంది.

గంగా నదిని ఈది రికార్డు..

2019 నవంబర్ నాటికి శ్యామల ఎన్నో పోటీల్లో పాల్గొన్నది. అనుభవాలు ఎదుర్కొన్నది. అదే ఆత్మవిశ్వాసంతో నవంబర్ 10న పాట్నాలో జరిగిన పోటీల్లో పాల్గొన్నది. 13.3 కిలోమీటర్ల లక్ష్యాన్ని సాధించింది. గంగా నదిని ఈదిన మొదటి తెలుగు మహిళగా ఆమె రికార్డు నెలకొల్పింది. అంతకు వారం రోజుల ముందే గోవాలో ఆక్వామెన్ స్విమ్మింగ్ పోటీలు జరిగాయి. 10 కిలోమీటర్ల లక్ష్యాన్ని సాధించి అక్కడ రెండో స్థానంలో నిలిచింది.

రామసేతు లక్ష్యంగా..

shamala2
స్విమ్మింగ్‌లో తన లక్ష్యాన్ని తానే ఛేదిస్తున్న శ్యామల ఇప్పుడు మరింత పెద్ద లక్ష్యం పెట్టుకుంది. రామసేతును ఈదాలనుకుంటున్నది. అందుకోసం నిరంతర సాధన చేస్తున్నది. అయూష్ యాదవ్ ఆధ్వర్యంలో గచ్చిబౌలీలో శిక్షణ తీసుకుంటున్నది. హైదరాబాద్‌లోని బీరంగూడలో నివాసం ఉండే శ్యామల రోజూ ఉదయం, సాయంత్రం స్విమ్మింగ్ సాధన చేస్తున్నది. 30 మైళ్ల రామసేతును ఈది తన కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నది. నేను ఏ ఉద్యోగం చేసినా నాకు ఆనందం కలిగేది కాదేమో ప్రతిదీ సవాల్‌గా తీసుకుని విజయం సాధించిప్పుడే అసలైన ఆనందం దొరుకుతుంది అని అంటున్నది శ్యామల.

-వినోద్ మామిడాల

452
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles