లక్షలాదిమంది వీక్షిస్తున్నారు..


Tue,November 19, 2019 01:50 AM

మీకు యూట్యూబ్ చూసే అలవాటుందా? అయితే ఈ ట్రెండింగ్ స్టార్‌ను కచ్చితంగా గుర్తుపట్టేస్తారు. ప్రతిరోజూ యూట్యూబ్ ట్రెండింగ్ 100లో ఈమె యూట్యూబ్ చానెల్ మన ఇంటి టిప్స్‌ది 50వ స్థానంకంటే ముందే ఉంటుంది.
అలాగని ఈమె పెద్ద స్టార్ అనుకుంటున్నారేమో.. సాధారణ గృహిణే. తెలివితేటలతో కొత్తగా ప్రయత్నించి సంపాదనలో దూసుకెళ్తున్నది. అరచేతిలో స్మార్ట్‌ఫోనే ఆమె ప్రపంచాన్నే మార్చేసింది మరి.

kalyani
హాయ్ ఫ్రెండ్స్! నేను మీ కళ్యాణి. ఈ రోజు నేను చేయబోయే వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అంటూ.. స్కిన్‌కేర్, హెయిర్‌కేర్, ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలు తనదైన ైస్టెల్‌లో చెప్పి లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నది. స్కిన్, హెయిర్, హెల్త్ గురించే కాదు.. మహిళలకు సంబంధించిన అన్ని విషయాలను వీడియో రూపంలో తెలియజేస్తున్నది మన ఇంటి టిప్స్ యూట్యూబ్ చానెల్ వ్యవస్థాపకురాలు కళ్యాణి. తెలంగాణ ఆడపడచు రాజన్న సిరిసిల్ల జిల్లా, గాలిపల్లి గ్రామానికి చెందిన కళ్యాణి 2017 డిసెంబర్ 6న మన ఇంటి టిప్స్ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. కేవలం రెండేండ్లలోనే 3.12 లక్షల మంది సబ్‌స్ర్కైబర్స్‌ను సొంతం చేసుకున్నది. ఈమె వీడియోను రోజుకు కనీసం లక్షమంది చూస్తారు. మొదట్లో ఎలాంటి ఆదాయం లేకపోయినా.. ఇప్పుడు చూసేవారి సంఖ్య పెరగడంతో సంపాదనలో పడింది కళ్యాణి.


చిన్నతనంలోనే కళ్యాణికి తల్లిదండ్రులు దూరమయ్యారు. దీంతో నానమ్మ దగ్గరే పెరిగింది. ఆమె ఖర్చులతోనే డిగ్రీ చేసింది. తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాజశేఖర్‌తో వివాహం అయింది. భర్త ఆఫీసుకు వెళ్తే.. కళ్యాణి ఒక్కతే ఇంట్లోనే ఉండేది. దీంతో చేతిలో స్మార్ట్‌ఫోన్‌తో ప్రపంచాన్ని చూసేది. అలా ఓ రోజు.. ఫోన్‌తోనే కొత్తగా ఏదైనా చేస్తే ఎలా ఉంటుంది? అని తననితానే ప్రశ్నించుకుంది. తనకెలాగూ టెక్నాలజీ కూడా తెలుసు కాబట్టి.. వీడియోలు చేయాలనుకుంది. అదేదో డబ్బులు సంపాదిద్దామని మాత్రం కాదండోయ్. కేవలం టైంపాస్‌కి మాత్రమే. అలా ఎలాంటి వీడియోలు చేస్తే జనాలు చూస్తారో కొన్నాళ్లు తెలుసుకుంది. దీంతోపాటు తాను రోజు ఏవేం పనులు చేస్తుందో భర్తకు వీడియోల రూపంలో పంపేది. అప్పుడే వారికి ఓ యూట్యూబ్ చానెల్ పెట్టాలనే ఆలోచన వచ్చింది.
kalyani1
అలా యూట్యూబ్ చానెళ్లు.. వాటి నిర్వహణ గురించి తెలుసుకొని రంగంలోకి దిగింది కళ్యాణి. తన యూట్యూబ్ చానెల్‌లో లైటింగ్, కెమెరాలు, యాక్షన్ అంటూ ఏమీ ఉండవు. ముఖానికి రంగులు వేసుకొని కట్ కట్.. బాగారాలేదు. మళ్లీ చేద్దాం అనే ఫీలింగే లేదు. కళ్యాణి చెప్పాలనుకునే విషయాన్ని సూటిగా చెప్పడం.. తాను ఉదయం నుంచి రాత్రి పడుకునేవరకు తన లైఫ్ ఈజీగా సాగడానికి తాను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతుంది? అనే విషయాలనే తన ఫాలోవర్స్‌తో పంచుకునేది. స్మార్ట్‌ఫోనే ఆయుధంగా.. అమ్మాయిలు ధరించే దుస్తుల నుంచి.. బామ్మలు కట్టుకునే కోకల వరకు ఇంటి పనులు, వంట పనులు అన్ని విషయాలు ప్రస్తావిస్తుంది కళ్యాణి.
అంతేకాకుండా తన సబ్‌స్ర్కైబర్ల నుంచి సలహాలు తీసుకుంటుంది కళ్యాణి. వారు కామెంట్ల రూపంలో వెలిబుచ్చిన సందేహాలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్తుంది. వీడియో పెట్టిన క్షణంలోనే ఆమెకు ఫస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పడానికి దాదాపు వంద మంది సబ్‌స్ర్కైబర్స్ రెడీగా ఉంటారు. తాను వీడియో తీసే విధానం, చెప్పే అంశాలు వింటే అభిమానిగా మారిపోతారు. ఆమె మాటలు, పనితనం, క్లారిటీ, సూటిగా చెప్పే నైజం అందరినీ ఆకట్టుకుంటుంది. చాలా తక్కువ సమయంలోనే లక్షలాది మంది అభిమానులకు చేరువైంది కళ్యాణి.

మన ఇంటి టిప్స్ చానల్ ఒకటే కాదు.. నేచురల్ రెమెడీస్ బై కళ్యాణి పేరుతో స్కిన్, హెయిర్‌కు సంబంధించిన వీడియోలనూ ఇందులో పెడుతుంది. ఈ సమస్యలకు నేరుగా దీన్ని ఫాలో అయితే సరిపోతుంది. టైంపాస్‌కు మొదలుపెట్టిన చానల్ ఆదాయం బాట పట్టింది. మూడు, నాలుగు నెలలకే 1000 సబ్‌స్రైబర్స్, 4000 వాచింగ్‌అవర్స్ పెరగడంతో సంపాదన మొదలైంది. కళ్యాణి ఇష్టానికి ఆదాయం తోడవడంతో మరింత ఉత్సాహంతో వీడియోలు పోస్ట్ చేస్తున్నది. ప్రస్తుతం ట్రైపాడ్‌తో వీడియోలు చేస్తున్నది. కళ్యాణి ప్రతిభ చూసి, ఆమెకున్న ఫాలోయింగ్ చూసి కొందరు వ్యాపారులు.. వారి ఉత్పత్తులకు ఆమె ద్వారా ప్రచారం కల్పించుకుంటున్నారు. అయితే వారి దగ్గర డబ్బులు తీసుకోకపోవడం కళ్యాణిలో నచ్చే అంశం.
కళ్యాణి కొడుకు పేరు తేజ. ఆ బాబు ఆలనాపాలనా చూసుకుంటూ.. చిన్న పిల్లలను ఎలా కేరింగ్‌గా చూసుకోవాలో కూడా చెబుతుంటుంది. షాపింగ్, మార్కెట్ ఎక్కడికెళ్లినా అప్‌డేట్ ఇస్తూనే ఉంటుంది. ఊరెళ్లినప్పుడు అత్తయ్యకు వంటలను కూడా చేసి పెడుతుంది. ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలనుకుంటే పుస్తకాలు చదువుతుంది. ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌చేస్తుంది. సమాచారం తెలుసుకొని మొదట తనపైనే ప్రయోగం చేసుకుంటుంది. ఆ తర్వాత అభిమానులకు సమాచారాన్నిస్తుంది. భర్త రాజశేఖర్ సహకారంతో అన్ని పనులూ తానే చూసుకుంటుంది కళ్యాణి. ఇలా అభిమానుల ఆదరణతో కొత్తకొత్త వీడియోలతో దూసుకెళ్తున్నది కల్యాణి.
kalyani-award
2019 జూన్ 29న సోషల్ మీడియా ఫెస్టివల్ (జిగ్నాసా) వారు యూట్యూబ్ స్టార్స్‌కు అవార్డు ప్రదానం చేశారు. అందులో 1-30 వరకు టాప్‌లో ఉన్నవారికి సోషల్ మీడియా స్టార్ అవార్డును అందించారు. ఈ లిస్ట్‌లో నేను కూడా ఉన్నందుకు చాలా సంతోషించాను.
- కళ్యాణి రాజశేఖర్

-వనజ వనిపెంట

334
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles