ఇవి గుండెజబ్బు లక్షణాలా?


Tue,November 19, 2019 01:48 AM

నా వయస్సు 55 సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో ఒకటే గుండెదడగా ఉంటున్నది. నాకు గుండెజబ్బు ఉందేమోనని అనుమానంగా ఉంది. గుండెజబ్బుకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి?
- వేణుగోపాల్, వరంగల్

Man-thinking
గుండెదడగా ఉన్నంత మాత్రాన గుండెజబ్బు ఉందని చెప్పలేం. సాధారణంగా గుండెజబ్బు లక్షణాలు ఎలా ఉంటా యో అవగాహన లేకపోవడం వల్ల చిన్న సమస్యకు కూడా కంగారుపడిపోతుంటారు. నేడు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. యువకుల్లో గుండెజబ్బులు రావడానికి కూడా ఇదే ప్రధాన కారణం. అయితే గుండెజబ్బులు వచ్చిన తరువాత బాధపడడం కంటే రాకుండా చూసుకోవడం ఉత్తమం. వేటివల్ల ముప్పు ఉంటుందో వాటిని గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం. డయాబెటిస్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ జబ్బులతో బాధపడుతున్నవారు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించాలి. ఇటీవలి కాలంలో యువకుల్లో సైతం గుండెజబ్బులు కనిపిస్తున్నాయి. స్మోకింగ్, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కొద్ది దూరం నడవగానే ఆయాసం, ఛాతీ ఒక్కసారి పట్టేసినట్టుగా ఉండడం, చెమట ఎక్కువగా పడుతుండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు ఉంటే గుండెజబ్బు ఉందని నిర్ధారించుకోవడానికి పరీక్షలు చేయించుకోవాలి. మీకు డయాబెటిస్, బీపీ లాంటి సమస్యలుంటే ఒకసారి ఈసీజీ చేయించుకోండి.


-డాక్టర్ ప్రణీత్ పాలమూరి
-కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్
-కేర్ హాస్పిటల్స్,హైదరాబాద్

327
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles