ఆన్‌లైన్‌ బిజినెస్‌లో అదరగొడుతున్న షణ్ముగప్రియ


Mon,November 18, 2019 12:44 AM

BIGPIC
సోషల్‌ మీడియాను చెడుగా వాడుకుంటే ఎంత ప్రమాదమో.. మంచిగా వాడుకుంటే అంతకు మించి మేలు కలుగుతుంది. ఈ క్రమంలోనే చెన్నైకి చెందిన షణ్ముగ్ర పియ వాట్సాప్‌తో ఉపాధికి అనువైన మార్గాన్నిఎంచుకుంది. మరి కొందరికి మార్గదర్శకంగా మారింది. నాలుగేండ్లలో దాదాపు మూడు కోట్ల రూపాయల టర్నోవర్‌ను దక్కించుకుంది. ఇంతకీ ఈమె ఏం చేస్తున్నదనే కదా మీ అనుమానం. చీరల వ్యాపారం. ఆమె సంస్థ పేరు యునిక్‌ థ్రెడ్స్‌. 2014లో ప్రారంభించిన ఈ చీరల బిజినెస్‌కు ఆమె వాట్సప్‌ గ్రూప్‌లనే కీలకంగా ఎంచుకుని విజయం సాధించింది.


షణ్మగప్రియ పెండ్లయ్యేనాటికి ఒక కంపెనీలో ఉద్యో గం చేసేది. సంవత్సరం తిరగకముందే ఒక బాబు పుట్టా డు. కొంతకాలం రెస్ట్‌ తీసుకుని తిరిగి జాబ్‌లో చేరింది. బాబును ఆమె అత్త చూసుకునేది. తర్వాత అనారోగ్యంతో ఆమె అత్త చనిపోయింది. మూడు నెలల పసికందును చూసుకోవడానికి పనిమనిషిని పెట్టింది. కానీ ఒకరోజు పిల్లాడికి దెబ్బలు తగిలి తీవ్ర గాయాలపాలయ్యాడు. దాంతో వాడిని చూసుకోవడానికి ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. అప్పుడే ఇంటి దగ్గరే ఉండి ఏదైనా బిజినెస్‌ చేయాలన్న ఆలోచన వచ్చింది. గతంలో ఆమె అత్త చీరెల వ్యాపారం చేసేది. దాన్నే కొనసాగించింది. మూడు నెలల కొడుకును చంకనేసుకొని, గడప గడపకూ తిరిగేది. ఆమె తల్లి సంచుల్లో చీరెలు వేసుకొని ఆమెను అనుసరించేది. కానీ, ఆ వ్యాపారం అంతగా కలిసిరాలేదు. దీంతో ఆ వ్యాపారం ఆపేసింది. ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని ఒకరోజు స్నేహితురాలితో ఫోన్‌లో చెప్పుకొంది. తన కథ విన్న ఆమె తనకు చీరెలు కావాలని అడిగింది. దీంతో షణ్ముగ చీరెలను ఫొటో తీసి వాట్సాప్‌లో పంపింది. అలా ఫోటోలు ఆమె నుంచి ఆమె చెల్లెండ్లకు, ఆమె నుంచి బంధువులకు, స్నేహితులకు అలా చాలామందికి వెళ్లాయి. దాంతో ఒక్క రోజులో చీరెలన్నీ అమ్ముడుపోయాయి. అదే ఉత్సాహంతో చీరెలు అమ్మేందుకు వాట్సాప్‌ను ఎంచుకుంది.

గ్రూపుగా మొదలై..

మొదట 20 మంది బంధుమిత్రులను ఓ గ్రూప్‌గా యాడ్‌ చేసింది. ఇప్పుడు వేలాది మంది వినియోగదారులతో స్థానికంగానే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకూ చీరెలను ఆన్‌లైన్‌ ఆర్డర్ల మీద సరఫరా చేస్తున్నది. రోజుకు దాదాపు 100 నుంచి 150 చీరెలు ఆర్డర్ల మీద అమ్ముతుంది. అలాగే ఈమె నెలకు 22 లక్షల ఖరీదు చేసే చీరెలను అమ్ముతున్నది. అయితే షణ్ముగప్రియకు అత్తగారే స్పూర్తి. చీరెల వ్యాపారం బాగా పెరగడంతో ‘యూనిక్‌ థ్రెడ్‌ శారీ’ పేరుతో ఫేస్‌బుక్‌ పేజీ ఓపెన్‌ చేసింది. దాని ద్వారా వ్యాపారం చేయటానికి ఆసక్తి ఉన్న మహిళలకు రీసెల్లర్స్‌గా వ్యాపారంలో భాగస్వాములయ్యే అవకాశం కల్పిస్తున్నది. కమీషన్‌ రూపంలో రీసెల్లర్స్‌ ఆదాయం పొందుతారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో రీసెల్లర్స్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసి అందులో చీరెల ఫొటోలను పోస్ట్‌ చేస్తే అవి రీసెల్లర్స్‌ ద్వారా వారి సొంత వాట్సాప్‌ గ్రూప్‌లోని వారికి చేరతాయి. వారి నుంచి ఆర్డర్లు తీసుకొని ఆమెకు పంపుతారు. రీసెల్లర్లు చీరెలు ఆర్డర్లు చేసేందుకు ప్రత్యేకంగా ఒక గ్రూప్‌ క్రియేట్‌ చేసింది. దాని ద్వారా వారు చీరెలు ఆర్డరు చేస్తారు. ప్రస్తుతం రీసెల్లర్స్‌ సంఖ్య 70 వేలకు చేరింది. వీరంతా ఆమె దగ్గర చీరెలు కొని వాళ్ల కస్టమర్లకు అమ్ముతారు. బిల్లు చెల్లింపు ప్రక్రియ కూడా వారి ద్వారానే జరుగుతుంది. చీరెల సరఫరా కోసం లాజిస్టిక్స్‌, కొరియర్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. డిమాండ్‌ పెరగడంతో ప్రస్తుతం 11 వాట్సాప్‌ గ్రూప్‌లను ఆమె నడుపుతున్నది. 70 వేల మందికి పైగా రిటైల్‌ వర్తకులతో వ్యాపారం చేయడంతోపాటు 8 మంది ఉద్యోగులను నియమించుకుంది.
BIGPIC1

భర్త తోడుగా..

షణ్ముగ భర్తకూడా ఉద్యోగం మానేసి ఆమెకు అండగా నిలిచారు. షణ్ముగ టెలిగ్రామును ఉపయోగిస్తున్నది. తన ఇంటి మొదటి అంతస్తులో గోడౌన్‌ కమ్‌ షాపును ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన ఆర్డర్‌ చీరెలు ఇక్కడే ప్యాక్‌ అవుతాయి. ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకు ప్యాకేజీలు బయటకు వెళ్తాయి. వేర్వేరు కొరియర్‌ కంపెనీల ద్వారా కస్టమర్లకు చీరలను అందిస్తుంటుంది షణ్ముగప్రియ. మార్కెట్లో దొరకని డిజైన్‌ శారీలను మాత్రమే ఆమె అమ్ముతారు. ఏ రంగు చీరెలు, ఎలాంటి డిజైన్లు ఉన్న చీరలు జనం కొనడానికి ఇష్టపడుతారో అనుభవం ద్వారా తెలిసింది. దీంతో సొంతంగా చీరెల తయారీ కూడా ప్రారంభించింది. రంగులు, నాణ్యతలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. ఇచ్చిన డిజైన్ల ప్రకారం నేతకారులు చీరెలు నేస్తారు. వాటిని ఫొటోలు తీసి వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేస్తుంది. అవి మార్కెట్లో ఎక్కడా దొరకవు. ఆ డిజైన్‌ చీర కావాలంటే ప్రియ దగ్గరకు రావాల్సిందే. చీరెలు నచ్చకపోతే డబ్బు తిరిగి వాపసు ఇచ్చే సదుపాయం కూడా కల్పించింది.

మూడు కోట్ల టర్నోవర్‌..

చీరెల తయారీ, అమ్మకాలపై షణ్ముగ ఆసక్తికి సోషల్‌ మీడియా శక్తి తోడయ్యింది. వ్యాపారం కొత్తపుంతలు తొక్కింది. మూడేండ్లలోనే రూ. మూడు కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. ఎలాంటి వ్యాపార ప్రకటనలు లేకుండా కేవలం నోటిమాటతోనే ఆమె వ్యాపారం ఖండాలను దాటింది. హొల్‌సేల్‌ వ్యాపారులకు 7 శాతం లాభంతో, రీసెల్లర్లకు 10 శాతం లాభంతో చీరెలు విక్రయిస్తున్నది. ఈ బిజినెస్‌ ద్వారా ఆమె బతకడమే గాకుండా.. తోటి మహిళలకు ఉపాధి కల్పిస్తుండడం విశేషం. ఇటీవల ఆమె వ్యాపారం గురించి వాట్సాప్‌ ఒక డాక్యుమెంటరీ కూడా చేసింది. ఇలా ఎందరో మహిళలకు షణ్ముగ స్పూర్తిగా నిలుస్తున్నది.

1293
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles