యాపిల్‌ తోటల సాగుకు ప్రోత్సాహం


Wed,November 13, 2019 10:26 PM

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పంటల సాగు తీరు మారుతున్నది. సంప్రదాయ పంటలు సాగు చేస్తున్న రైతాంగం రాష్ట్రంలో పెరిగిన సాగునీటి వనరులతో ఇతర రాష్ర్టాలు, దేశాలకే పరిమితమైన పంటల సాగువైపు అడుగులు వేస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు. ఉద్యానశాఖ కొత్త పంటలను పైలెట్‌ ప్రాజెక్టులుగా ప్రారంభించింది. రైతులు సాధిస్తున్న మంచి ఫలితాలతో ఆ పంటల సాగును విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నది. గత రెండేండ్లలో ఉద్యాన, కూరగాయల పంటల సాగులో కొత్త పంటల సాగువైపు రైతుల ను ఉద్యానశాఖ ప్రోత్సహిస్తూ.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తున్నది. ప్రస్తుతం రైతులు కొత్తగా బొప్పాయి, దాని మ్మ, డ్రాగన్‌ఫ్రూట్‌, తాయ్‌జామ, యాపిల్‌బేర్‌, అంజీర్‌ తోటలను సాగు చేస్తున్నారు.
Apple


తెలంగాణ యాపిల్‌ పండ్ల సాగు..

యాపిల్‌ పండ్ల సాగు అంటే కశ్మీర్‌, సిమ్లా ప్రాంతాలే గుర్తుకొస్తాయి. కశ్మీర్‌, సిమ్లా చలి ఎక్కువగా ఉండే యూరప్‌ దేశాలే గుర్తుకొచ్చేవి. కానీ రాష్ట్రంలోనూ యాపిల్‌ సాగు చేయడానికి ఇక్కడి నేలలు అనుకూలమని గత అనుభవాలు తెలియజేస్తున్నాయి. కుమురం భీం జిల్లా కెరిమెరి మండలం ధనోరా గ్రామంలో కె.బాలాజీ అనే రైతు యాపిల్‌తోటను సాగు చేసి మంచి ఫలితాలు సాధించాడు. చలి వాతావరణానికే పరిమితమైన ఈ పంటను సాగుచేసి విజయం సాధించిన బాలాజీని ఉద్యానశాఖ అభినందించింది. బాలాజీ సొంతంగా రెండు ఎకరాల్లో యాపిల్‌ సాగు చేపట్టారు. ఉష్ణమండల ప్రాంతాల్లో పండే యాపిల్‌ వంగడాలను నాటినందున తెలంగాణలో ఈ తోటలు పెరుగుతాయని ఉద్యానశాఖ వివరించింది యాపిల్‌ తోటల సాగుకు ముందుకొచ్చే వారికి సాంకేతిక సహకారం అందించి ప్రోత్సహించనున్నట్లు ఉద్యానశాఖ కమిషనర్‌ ఎల్‌.వెంకట్రామిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో యాపిల్‌ మొక్కలను నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో నాటడానికి అనుకూలమని ఉద్యానశాఖ అధికారు లు వెల్లడించారు. రాష్ట్రంలో యాపిల్‌ పంట సాగు కోసం అనుకూలమైన ప్రాంతాలను గుర్తించేందుకు గతేడాది చలికాలంలో నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు రాత్రిపూట 20 డిగ్రీలలోపు ఉష్ణోగ్రత నమోదైన జిల్లాల వివరాలను వాతావరణ శాఖ నుంచి ఉద్యానశాఖ సేకరించింది. ఆదిలాబాద్‌, భద్రాద్రి-కొత్తగూడెం, జనగాం, జయశంకర్‌, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, కరీంనగర్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మేడ్చల్‌, నిజామాబాద్‌, సూర్యాపేట తదితర జిల్లాలు యాపిల్‌ పంట సాగుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించినట్లు ఉద్యానశాఖ సంచాలకులు తెలిపారు.
Anjeer

రూ.8వేలకోట్ల వ్యాపారం..

దేశీయ మార్కెట్‌లో యాపిల్‌ వ్యాపారం ఏటా రూ.8వేల కోట్లకు పైనే ఉన్నది. సుమారు ఏడు లక్షల కుటుంబాలు యాపిల్‌ సాగు లో ఉన్నాయి. కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ర్టాల్లో పండే రకాలు రాష్ర్టానికి దిగుమతి అవుతున్నాయి. హైదరాబాద్‌ పండ్ల మార్కెట్‌కు రోజుకు సుమారు 600 టన్నుల యాపిల్స్‌ దిగుమతి అవుతున్నాయి. రోజూ రూ.3 నుంచి రూ.5 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నది. తెలంగాణలో యాపిల్‌ సాగును విస్తరించడం ద్వారా స్థానికంగా రోజూ వారీగా డిమాండును తీర్చవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దిగుమతి ద్వారా రవాణా ఖర్చులను కూడా ఆదా చేయవచ్చని రైతులు పేర్కొంటున్నారు.

ఇప్పటికే ప్రయోగాలు..

ఐదేండ్ల కిందటే తెలుగు రాష్ర్టాల్లో యాపిల్స్‌ పండించే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆదిలాబాద్‌, విశాఖ జిల్లా పాడే రు ప్రాంతాల్లో హైడెన్సీ విధానంలో సాగు మొదలుపెట్టారు. అయితే తక్కువ ఉష్ణోగ్రతలో పండే రకాలనే ప్రయోగాత్మకంగా నాటారు. ఏపీలోని పాడేరు, లంబసింగి ప్రాంతంలో వాతావరణం యాపిల్‌ సాగుకు అనుకూలం. అక్కడ చలికాలంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు కూడా తగ్గుతాయి. 2016 జనవరిలో 10వేల మొక్కలను ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు సైప్లె చేయ గా.. ఈ ఏడాది నుంచి దిగుబడి రావడం మొదలైంది. హిమాచల్‌ప్రదేశ్‌లో పండుతున్న అన్నా, డార్సెట్‌, గోల్డెన్‌ రకాలను ఇక్కడ సాగు చేస్తున్నారు. శీతల ప్రాంతాల్లో డిసెంబర్‌, జనవరి నెలల్లో యాపిల్‌ చెట్లు పూర్తిగా మంచుతో కప్పబడి నిద్రావస్థలో ఉంటాయని, ఇక్కడ అలాంటి పరిస్థితి లేనందున ఏటా రెండు పంటలు వచ్చే అవకాశం ఉంటుందని యాపిల్‌ సాగు చేస్తున్న రైతు పురుషోత్తం రావు తెలిపారు.

ఈ రకాలు అనుకూలం..

యాపిల్స్‌లో గోల్డెన్‌ డెలీషీయస్‌, రాయల్‌ గాలా, గ్రానీస్మిత్‌, క్రిప్స్‌పింక్‌, స్టార్మింగ్‌, ఫుజీ, క్రిప్స్‌రెడ్‌, బీబర్న్‌ తదితర రకాలున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడా, సౌతాఫ్రికాలో, ఇజ్రాయిల్‌లో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అన్నా అనే ప్రత్యేక రకా న్ని సాగు చేస్తున్నారు. దీన్ని అందుబాటులోకి తెస్తే తెలంగాణ అంతటా యాపిల్‌ సాగు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ రకాన్ని ఇప్పటికే కర్ణాటకలోని కూర్గ్‌, తమిళనాడులోని ఊటీ, మహారాష్ట్రలో నాసిక్‌ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లోని హరిమన్‌ శర్మ అనే రైతు 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ పండే రకా న్ని అభివృద్ధి చేశారు. దానికి చిల్లింగ్‌ హవర్స్‌ అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
-మజ్జిగపు శ్రీనివాస్‌ రెడ్డి, 8096677036
Apple-Ber

సాంకేతిక సహకారం అందిస్తాం

రాష్ట్రంలో ఉద్యానపంటల్లో పాలీహౌజ్‌ ద్వారా విదేశాల్లో పండే పూలను, కూరగాయలను పండించాం. యాపిల్‌బేర్‌, దానిమ్మ, డ్రాగన్‌ఫ్రూట్‌, ఎన్‌ఎంకే-1 రకం సీతాఫలం, తాయ్‌జామ, కీరదోశ వంటి కొత్త పంటలను ప్రవేశపెట్టి తెలంగాణ ఉద్యానవన హబ్‌గా రూపొందించాం. ఇదే తరహాలో ప్రస్తుతం యాపిల్‌ తోటలను ప్రోత్సహించాలని నిర్ణయించాం. ఈ తోటలు వేసే రైతులు ఎకరానికి 225-250 మొక్కల వరకు నాటాలి. ఒక్కో మొక్కను తెచ్చి నాటాలంటే రవాణాతో కలిపి రూ.70 నుంచి 100 వరకు ఖర్చవుతుంది. మూడేండ్ల తర్వాత మొదటిసారి పూత వస్తుంది. మార్కెట్‌లో అమ్ముకునేందుకు పండ్లు 5వ ఏట నుంచి అందుబాటులోకి వస్తాయి. ఎకరానికి ఏడాదికి 20వేల చొప్పున పెట్టుబడి పెడితే ఐదో ఏట నుంచి ఆదాయం వస్తుంది. తొలి ఐదేండ్లలో యాపిల్‌ మొక్కల మధ్య అంతరపంటలుగా కూరగాయలు, ఇతర పంటలు వేసుకొని ఆదాయం పొందవచ్చు. ధనోరా గ్రామంలో రైతు బాలాజీ యాపిల్‌ పంటను పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసినా తెగుళ్లు ఏమీ రాలేదు. కిలో రూ.70 నుంచి 100 వరకు ధర ఉన్నది. కనీసం కిలోకు రూ.50 చొప్పున ధర వచ్చిన ఒక్కోచెట్టుకు రూ.1000 వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడి ఏడాదికి ఎకరానికి 30వేలకు మించదు.
-ఎల్‌.వెంకట్రామిరెడ్డి ,ఉద్యానశాఖ సంచాలకులు
apple-Ber

సౌతాఫ్రికా రకం రావాలి..

1983లో రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయం మొదలుపెట్టిన. 1995లో ఆలుగడ్డల సాగు విషయంలో హిమాచల్‌ప్రదేశ్‌ కు వెళ్లా. ఐపీఏలో సభ్యుడిగా చేరిన. అక్కడ యాపిల్‌ పంట ను చూసి ఆసక్తి కల్గింది. అక్క డ 12 ఏండ్ల నుంచి సాగు చేస్తున్నాను. తర్వాత 2014లో తెలంగాణ, ఏపీల్లో ప్రయోగాత్మకంగా యాపిల్‌ సాగు ప్రారంభించిన. ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నా. హైడెన్సీ విధానం అమలుతో మంచి ఫలితాలు వస్తున్నాయి. సౌతాఫ్రికా రకం అందుబాటులోకి వస్తే తెలంగాణ మొత్తం యాపిల్‌ పంట వేసే అవకాశం ఉన్నది. యాపిల్‌ మొక్క నాటిన మూడేళ్ల నుంచి దిగుబడి మొదలవుతుంది. ఏడాదికి కనీసం 200 గంటల పాటు రాత్రి ఉష్ణోగ్రత 12 డిగ్రీలు లేదా అంతకన్నా తక్కువగా ఉండాలి. పగటి ఉష్ణోగ్రత కూడా 30 డిగ్రీలలోపే ఉంటే పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. నేషనల్‌ హార్టికల్చర్‌ బోర్డు గుర్తింపు పొందిన హిమాచల్‌ప్రదేశ్‌లోని నర్సరీల నుంచి తెచ్చుకుని ఇక్కడ నాటుకోవచ్చు. డిసెంబర్‌, జనవరి నెలలు రాత్రి ఉష్ణోగ్రత లు తక్కువఉండే ప్రాంతాల్లో బాగా పండించవచ్చు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన రకాలు 40 డిగ్రీల ఉష్ణోగ్రత వర కూ తట్టుకోగలవు.
- పురుషోత్తం రావు, యాపిల్‌ సాగు రైతు

364
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles