బ్యాక్టీరియా పతనమే.. మంజులారెడ్డి విజయం!


Wed,November 13, 2019 01:48 AM

ప్రతి ప్రశ్నకూ సమాధానం దొరకాలి. ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం వెతకాలి. అప్పుడే మనం అభివృద్ధి దిశగా పయనిస్తున్నట్లు లెక్క. సమస్యకు పరిష్కారాన్ని వెతికే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురవొచ్చు. అపజయాలు తలుపుతట్టవచ్చు. ఓపిక, పట్టుదలతో అన్నింటినీ ఎదిరించి.. పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడినప్పుడే పరిష్కారం దొరుకుతుంది. అదే మన విజయమై.. చరిత్ర చెప్పుకొనేలా చేస్తుంది. అలాంటి అద్భుత విజయాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నారు చీఫ్ సైంటిస్ట్
మంజులారెడ్డి. ఎన్నో అంతుచిక్కని వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాను పతనం చేసేందుకు తొలి అడుగు వేసిన మంజులారెడ్డి.. తన పదేండ్ల కష్టాన్ని, త్యజించిన క్షణాలు, ఆనందాలు, సంతోషాలను జిందగీతో పంచుకున్నారు.

Manjula
కంటికి కనిపించకుండా, ఎన్నో అంతుచిక్కని వ్యాధులకు కారణమై.. ఎంతోమంది ఉసురుతీసే ప్రమాదకర బ్యాక్టీరియా పతనానికి అడుగులుపడ్డాయి. కాదు.. కాదు.. పదేండ్లు కష్టపడి దాని అంతానికి శంఖం పూరించారు మన సైంటిస్ట్ మంజులారెడ్డి. దిశలు మార్చుకుంటూ.. రూపాంతరం చెందుతూ.. రక్షణకవచంగా ఓ గోడనే నిర్మించుకుంటున్న బ్యాక్టీరియాను నిలువరించేందుకు మన తెలంగాణ బిడ్డ మంజులారెడ్డి వేసిన తొలి అడుగు విజయవంతమైంది. ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు మూలకారకంగా ఉన్న బ్యాక్టీరియాను అంతం చేసేందుకు మంజులారెడ్డి చేసిన పరిశోధన ఫలితాలే ఇప్పుడు అత్యంత కీలకం కానున్నాయి. దీంతో మైక్రోస్కోపుల్లో వెతికితే తప్ప కనిపించని ఆ బ్యాక్టీరియా పతనానికి పునాదులు పడ్డాయి. పెండ్లి, పిల్లల బాధ్యత, కుటుంబం.. ఇలా పదేళ్లకాలం కరిగిపోయినా ఆమెలో సైన్స్‌పట్ల ఉన్న ఆసక్తి, సమాజహితం కోసం పరిశోధనలు చేయాలన్న సంకల్పం విజయాన్ని అందించాయి. ప్రతిష్టాత్మకమైన ఇన్ఫోసిస్ అవార్డు అందుకునేలా చేశాయి.


పదేండ్ల పరిశోధనల ఫలితం

బ్యాక్టీరియా సెల్‌వాల్ (కణత్వచం)పై గతంలో చాలా పరిశోధనలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. బ్యాక్టీరియా అంతానికి శక్తివంతమైన యాంటీబయాటిక్స్ తయారు చేసినా.. వ్యాధికారక బ్యాక్టీరియా మళ్లీ జీవం పోసుకుంటూనే ఉంది. కారణం.. అది ఏర్పరుచుకునే గోడ. అదే దాని రక్షణ కవచం. దీంతో ఆ గోడ ఎలా అభివృద్ధి చెందుతున్నది? అందుకు గల కారణాలు ఏంటీ? అనే అంశంపై పదేండ్లపాటు పరిశోధనలు జరిపారు మంజులారెడ్డి బృందం. ఆమె నిరంతర కృషి, అధ్యయనంలో అవలంభించే కొత్త పద్ధతుల వల్ల బ్యాక్టీరియ వాల్ తయారయ్యే విధానాన్ని కనుగొన్నారు. ఈ పరిశోధన బ్యాక్టీరియాను అంతం చేసేందుకు ఉపయోగపడుతుంది. ఆ వాల్ తయారవకుండా ఆపి, ఆ వ్యాధికారకమైన బ్యాక్టీరియాను అంతమొందించేందుకు ఇంకా విస్తృత పరిశోధనలు జరగాలి. గోడ తయారవకుండా శక్తివంతమైన యాంటీబయాటిక్స్ రూపొందిస్తే.. బ్యాక్టీరియా వల్ల వచ్చే టైఫాయిడ్, ఇన్ఫెక్షన్స్, టీబీ, డిఫ్తిరీయా, కుష్టు, కలరా వంటి వ్యాధులు రాకుండా అరికట్టవచ్చు. ఈ దీర్ఘకాలిక పరిశోధనల ప్రయాణంలో మంజులారెడ్డి పరిశోధన చాలా ప్రామాణికం. బ్యాక్టీరియా నిర్మూలన, వాటి గోడల తయారీని ఆపడం, అందుకు కొత్త యాంటీబయాటిక్స్ కనుక్కోవడానికి ఈ పరిశోధన చాలా కీలకం కానుంది. ఈ పరిశోధనా ఫలితాల వల్ల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాను అంతమొందించే దిశగా అడుగులుపడ్డాయి.
Manjula1

అడుగులు పడ్డాయి ఇలా..

మంజులారెడ్డి తెలుగు స్టూడెంట్. పుట్టి పెరిగింది మహబూబ్‌నగర్. నాన్న డీఎఫ్‌ఓగా చేశారు. ఆయన ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అయితే.. అక్కడికి వెళ్లేవారు మంజులారెడ్డి. అక్కడే చదువులు. పదో తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదివారు. డిగ్రీ చదివేటప్పుడే సైన్స్‌లో మర్మం తెలిసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చేసేటప్పుడు పరిశోధనలపై ఇష్టం పెరిగింది. అలా తనకున్న లక్ష్యానికి ఒక మార్గం దొరికింది. ఆ సమయంలోనే పెండ్లి కావడంతో పీహెచ్‌డీని మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. ఒకటికాదు రెండు కాదు.. దాదాపు పదేండ్ల విరామం వచ్చింది. ఒకవైపు కుంటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే లక్ష్యం చేరుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు మంజులారెడ్డి. ఈ క్రమంలో సీసీఎంబీలో జూనియర్ సైంటిస్ట్‌గా 1990లో జాయిన్ అయ్యారు. అక్కడ పరిశోధనలు చేస్తూనే 1996లో మళ్లీ పీహెచ్‌డీ ప్రారంభించారు. బ్యాక్టీరియా మ్యూటేషన్ అంశంపై 2001లో పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆ పరిశోధనల ఆధారంగా బ్యాక్టీరియా పుట్టుక, రూపాంతరం, దాని ప్రభావాలు, వ్యాధుల వ్యాప్తికి కారణాలపై అధ్యయనం చేశారు. చివరిగా బ్యాక్టీరియా సెల్‌వాల్ ఏలా తయారవుతుందో తెలుసుకున్నారు.

సీసీఎంబీ మరో ప్రపంచం..

మంజులారెడ్డికి సీసీఎంబీ ఓ స్వర్గం. ఇదొక ప్రపంచం. ఇక్కడంతా పని గురించే మాట్లాడుకుంటారు. ఇంకా ఎలాంటి పరిశోధనలు జరగాలో చర్చిస్తారు. జరిగిన పని, జరుగుతున్న పని, జరగబోయే పని.. ఇవే వారి ప్రపంచం. తనపనిలో విజయం సాధించడం కోసం దాదాపు పదేండ్ల నుంచి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. పిల్లలకు జ్వరాలొచ్చినా తల్లి పట్టించుకోకుండా.. ల్యాబ్‌లు, పరిశోధనలు అంటూ తిరుగుతుంది అని ఆమె గురించి చాలామంది అనుకున్నారు. కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్లకు కూడా వెళ్లే సమయం ఉండకపోయేది. అందుకు కొందరు నొచ్చుకున్నా.. ఆమె బాధపడేవారు కాదు. ఎందుకంటే మంజులారెడ్డి ఏం చేస్తారో, ఆమె లక్ష్యం ఏంటో వాళ్లకు తెలుసు. కొంతమంది ఆమె ఎదురుగానే విమర్శించినా.. చిరునవ్వుతోనే సమాధానం చెప్పేవారట. ఇలా ఎంతో పర్సనల్ లైఫ్‌ను మిస్సయ్యారు మంజులారెడ్డి. ఇప్పుడామె సాధించిన విజయం ముందు అవన్నీ చిన్నగానే అనిపిస్తున్నాయి. కొన్నిసార్లు అనారోగ్యం, పిల్లల బాగోగుల వల్ల పరిశోధనలు ఆపేద్దాం అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకవైపు ఆఫీస్ పని, ల్యాబ్, మీటింగ్స్, పిల్లలు, అత్తమామలు, తల్లిదండ్రులు.. అడ్డంకులు ఎదురైనా.. ఆ క్షణానికి తనని తాను సమర్థించుకొని.. ఇంటి పనులు, కుటుంబానికి, ల్యాబ్‌కు, ఆఫీస్‌కు సమయం కేటాయిస్తూనే విజయంవైపు పయనించారు. మనదేశంలో పదేండ్ల నుంచి పరిశోధనలు బాగానే జరుగుతున్నాయి. ఇతర దేశాలతో పోల్చితే ఎక్కువ సంఖ్యలో పరిశోధనా కేంద్రాలు రావాలి. విస్తృతంగా పరిశోధనలు జరగాలి. దీనివల్ల భవిష్యత్‌లో మరిన్ని ఉపయోగాలుంటాయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సైన్స్ రీసెర్చ్‌కు నిధులు సమకూర్చాలి. కొత్త కాలేజ్‌లు, పరిశోధకులు రావాలి అంటున్నారు మంజులారెడ్డి.
Manjula2

విద్యార్థులకు ఆదర్శంగా..

మంజులారెడ్డి దగ్గర గతంలో ఇద్దరు విద్యార్థులు పీహెచ్‌డీ పూర్తిచేశారు. ప్రస్తుతం ఏడుగురు విద్యార్థులు పీహెచ్‌డీ చేస్తున్నారు. వీరే కాకుండా ఇతర తరగతుల విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా క్లాసులు చెబుతున్నారు. బెంగళూరుకు చెందిన ఓ యువతి ముంజులారెడ్డికి మెయిల్ చేసి.. పెండ్లితో తమ జీవితం ముగిసిపోయిందని బాధపడుతున్న మహిళలకు ఆదర్శమంటూ కొనియాడింది. మంజులారెడ్డి తన రోల్‌మోడల్ అంటూ పేర్కొన్నది. తల్లిసాధించిన విజయాన్ని.. అందుకు ఆమె పడిన కష్టం, త్యజించిన క్షణాలు, ఆనందాలు, తమపై చూపించిన ప్రేమ, తల్లిగా, భార్యగా, కోడలిగా కుటుంబాన్ని చూసుకున్న విధానం గురించి చిన్నకొడుకు ఫేస్‌బుక్‌లో పంచుకోవడంతో ఎంతోమంది దానిని షేర్ చేస్తూ.. కామెంట్ల ద్వారా అభినందనలు తెలుపుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న ఆర్థికశాస్త్రవేత్త అమర్త్యసేన్ చేతులమీదుగ నగదు పురస్కారంతో పాటు ఇన్ఫోసిస్ లైఫ్‌సైన్స్ అవార్డు అందుకోనున్నారు మంజులారెడ్డి.

ఆడపిల్లలు పరిశోధనల వైపు రావాలి..

నిబద్ధత, ప్రేమ ఉంటేనే పరిశోధన రంగంవైపు రావాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఆడపిల్లలకు పరిశోధనా రంగంలో అవకాశాలున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అందరికీ పెండ్లి, పిల్లలు, కుటుంబం అన్ని జీవితంలో భాగమే. అదే జీవితం కాదు. తల్లి ఎంత కష్టపడుతుందో పిల్లలకు తెలియాలి. వాళ్లూ చూస్తారు. అప్పుడే సన్మార్గంలో పయనిస్తారు. తల్లిని చూస్తూనే నేర్చుకుంటారు పిల్లలు. తల్లే పిల్లలకు రోల్‌మోడల్‌గా ఉండాలి. ఎంచుకున్న రంగం ఏదైనా సొసైటీకి ఎంతో కొంత తిరిగివ్వాలి.
- చీఫ్ సైంటిస్ట్ మంజులారెడ్డి, సీసీఎంబీ

- డప్పు రవి
-కోనేటి వెంకట్

465
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles