సినిమా పాటలపై పరిశోధన


Wed,November 13, 2019 01:46 AM

ఒకరికి నాణేల సేకరణంటే ఇష్టం. ఇంకొకరికి పోస్టల్ స్టాంపుల సేకరణంటే ప్రాణం. మరొకరికి పురాతన వస్తువుల్ని సేకరిస్తే అమితానందం. ఇలా ఓ యువకుడికి పాత పాటలన్నా, అప్పటి సంగీతమన్నా ప్రాణం. తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి దాదాపు 32 వేలకు పైగా ఆపాతమధురాల్ని సేకరించాడు. అంతేకాదు వాటన్నింటినీ కంఠస్తం కూడా చేస్తున్నాడు. పాటతో పాటే నేనూ అంటూ పాటల మూలాలు వెతుకుతున్నాడు. దాదాపు 90 మంది పాత, కొత్త తరం తెలుగు సినిమా పాటల రచయితల పూర్తి వివరాలు సేకరించాడు. అంతకు మించి రచయితలు జ్ఞానాన్నంతా కూర్చి పేర్చిన వేలాది పాటలపై పరిశోధన కూడా చేస్తున్నాడు.
TholiTakee


ఆ చిక్కెంటికలకు ఊపిరి బుగ్గేల్.. బఠానీల్.. బూరుమిఠాయి అంటూ ఓ వ్యక్తి అరుస్తున్నాడు. ఊరి మధ్యలోకొచ్చి అట్లాస్ సైకిల్ స్టాండ్ వేశాడు. నిమిషాల్లో చుట్టు పక్కల ఇళ్లలోంచి వచ్చిన పిల్లలు సైకిల్‌ను చుట్టుముట్టారు. అమ్మవో, అక్కవో చిక్కు వెంట్రుకలు ఇచ్చి ఊపిరి బుగ్గలు తీసుకున్నారు. మరికొందరు బఠానీలు తీసుకున్నారు. ఒక పిల్లాడు మాత్రం రూపాయి విలువైన పాటల పుస్తకాన్ని తీసుకున్నాడు. పాకెట్ సైజ్‌లో ఆరు పుటలుండే ఆ పుస్తకంలో పేజీలను తడుముతున్నాడు. నిమిషాల వ్యవధిలోనే వాటిని కంఠస్తం కూడా చేశాడు. రేడియోలో వచ్చే పాటల్ని వేగంగా రాసుకునేవాడు. అలా మొదలైన అతడి పాటల సేకరణ అభిరుచి సినిమా రంగం మూలాల్లోకి వెళ్లింది. తొలి టాకీ మూవీ నుంచి 20వ దశకంలో విడుదలైన సినిమాల వరకు దాదాపు 32 వేల పాటల్ని సేకరించేలా చేసింది. ఇప్పటి వరకు ఆయన 90 మంది తెలుగు పాటల రచయితల పూర్తి వివరాలు సేకరించారు. పాటలతో పాటే పెరిగిన ఆయనను యువ పలుకరిస్తే సినిమా పాటల వెనుక ఉన్న మరెన్నో విషయాల్ని పంచుకున్నారు.

పాట లోతుల్లోకి..

తిరునగరి శ్రీనివాస స్వామిది కోరుట్ల. ఆయన కవి, సినీ గేయాల రచయిత. చిన్నప్పటి నుంచి ఇంట్లో సినిమా పాటలకు సంబంధించిన ప్రస్తావనే వచ్చేది. స్నేహితులు, బంధువులు ఇలా ఎవ్వరొచ్చినా పాట గురించే ఎక్కువ సమయం మాట్లాడేవారు. ఆయన కుమారుడే శరత్‌చంద్ర. తన తండ్రి సినిమా పాటలపై అంత మక్కువ ఎందుకు చూపుతున్నారో అర్థం కాలేదు శరత్‌కు. ప్రతిరోజూ తండ్రి ఓ పాట ఆలపించి అందులోని అంతరార్థం చెబుతుండేవారు. అలా పాట లోతుల్లోకి వెళ్లి ప్రతి పాటనూ ఆనందించేవారు శరత్‌చంద్ర. ఏడో తరగతి నుంచి తనే పాటలు సేకరిస్తూ, కంఠస్తం చేస్తూ, పాడుతూ స్కూల్లో విద్యార్థులందరికీ పాటల గురించి విశ్లేషించి చెబుతుండేవారు. పాఠశాల స్థాయిలోనూ ఎన్నోసార్లు పాటల పోటీల్లో మొదటి బహుమతులు కూడా అందుకున్నాడు.

నేర్చుకున్నదేదీ వృథాకాదు

ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ తెలుగు విభాగంలో గోల్డ్‌మెడల్ తీసుకున్నారు శరత్‌చంద్ర. తర్వాతేంటి? అప్పుడే గుర్తొచ్చాయి తండ్రి తరచూ చెప్పే మాటలు. నేర్చుకున్నదేదీ వృథాకాదు. నేర్చుకున్న ప్రతి అంశమూ నీ జీవితాన్ని నిలబెట్టే ఓ సాధనమే. ఈ మాటలు శరత్‌కు స్ఫూర్తినిచ్చాయి. అభిరుచికి అనుగుణంగానే ఉన్నత చదువులూ చదవాలని నిర్ణయించుకున్నారు. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు సేకరించిన 800 దాశరథి సినిమా పాటల మీద పరిశోధన చేయాలనుకున్నారు. పరిశోధక విద్యార్థిగా మారారు. ఓవైపు పాటలు సేకరిస్తూనే మరోవైపు రచనలూ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు ఉపన్యాసకుడిగా పాఠాలు బోధిస్తున్నారు.

పాఠాలూ వినూత్నమే

ఎన్ని గంటలు మాట్లాడినా వ్యక్తీకరించలేని భావనను ఒక్క పాటలో చెప్పవచ్చు. పాటకు అంతటి ప్రాధాన్యమున్నది. అలాంటి పాటనే సాధనంగా చేసుకొని పాఠాలు చెబుతున్నారు శరత్‌చంద్ర. సాధారణంగా ఉపాధ్యాయులెవ్వరైనా పాఠం చెబుతుంటారు. కానీ ఆ పాఠాలకు తమ అభిరుచిని జోడించి చెప్పడం మాత్రం కొందరికే సాధ్యం. శరత్‌చంద్ర ఆ కోవకు చెందిన వారే. ఆయన ప్రస్తుతం తెలుగు ఉపన్యాసకులుగా ఉన్నారు. పాఠమేదైనా ట్యూన్ కట్టి పాఠంగా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఇలా చేయడం వల్ల విద్యార్థులు పాఠాలు వినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. పాట రూపంలో విన్న పాఠం ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుందని అంటున్నారు.

పాట పుట్టినప్పటి నుంచి..

తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద. ఈ సినిమా 1931లో విడుదలైంది. చందాల కేశవదాసు ఆ సినిమాకు పాటలు రాశారు. ఆయన నుంచి మొదలు పెడితే అనంత శ్రీరామ్ వరకు అందరి రచయితల పాటలూ సేకరించారు. వారిలో దాశరథి, సి.నారాయణరెడ్డి, శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, వెన్నెలకంటి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, మల్లాది రామకృష్ణశాస్త్రి, పింగళి నాగేంద్రరావు, పాలగుమ్మి పద్మరాజు, వేటూరి సుందరరామమూర్తి, చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ వంటి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న సినీ గేయ రచయితల పూర్తి వివరాలు, వారు రాసిన పాటల్ని సేకరించారు. వాటిలో కొన్ని వీసీపీ, వీసీఆర్‌లు ఉన్నాయి. మరికొన్ని సీడీ, డీవీడీలు ఉన్నాయి. ఇంకా కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. మరికొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి.

డైరీల సేకరణ

మహామహుల జీవితం ఆదర్శప్రాయం. వారి ఆలోచనలు, ఆచరణ సదా ఆచరణీయం. వారి ఆలోచనల్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు మహామహులకు చెందిన డైరీలు సేకరిస్తున్నారు శరత్. ఇప్పటి వరకు సి.నారాయణరెడ్డి, దాశరథి, ఆరుద్ర, ఆత్రేయ డైరీలు సేకరించారు. మరికొందరి డైరీలను సేకరించే పనిలో ఉన్నారు శరత్.

అక్షర శిఖరం..

శరత్ చంద్ర సాహిత్యంలోనూ తన ప్రత్యేకతను చాటుతున్నారు. పద్యం, గేయం, వచనం, గజల్, రుబాయిలు, వ్యాసాలు, నాటికలు ఇలా తొమ్మిది ప్రక్రియల్లో దాదాపు 12 పుస్తకాలు రాశారు. ఇటీవలే తాను రాసిన గేయ కవిత్వాన్ని అక్షర శిఖరంగా పేర్చి పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. శరత్‌చంద్ర తాను సేకరించిన 32 వేల పాటల్ని కంఠస్తం చేశారు. ఏ పాట ఎవరు రాశారని అడిగినా ఠక్కున సమాధానం చెప్పగలరు. 1200 పద్యాలతో పాటు వాటి తాత్పర్యమూ చెబుతారు.
TholiTakee1

సినిమాలకు పాటలు రాస్తా..

మా నాన్న కవి, సినీ గేయ రచయిత. ఈ తీర్పు ఇల్లాలిది, లెనిన్ వంటి సినిమాలకు పాటలు రాశారు. 10 కవితా సంపుటాల్ని ప్రచురించారు. చిన్నప్పటి నుంచి పాట అంతరార్థం చెబుతుండేవారు. ఇప్పటికీ ఏ కాస్త సమయం దొరికినా సినిమా పాటల గురించే చర్చిస్తుంటాం. నాకు తెలియకుండానే సినిమా పాటలపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఓయూలో దాశరథి సినిమా పాటలపై ఆచార్య సూర్య ధనుంజయ్ పర్యవేక్షణలో పీహెచ్‌డీ చేస్తున్నాను. డాక్టర్ టి.గౌరీ శంకర్, పైడిపాల హెచ్. రమేశ్ బాబు వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటి వరకు 300లకు పైగా పాటలు రాశాను. భవిష్యత్‌లో సినిమాలకు పాటలు రాయాలనేది నా లక్ష్యం.
- తిరునగరి శరత్‌చంద్ర, తెలుగు ఉపన్యాసకులు
-పడమటింటి రవికుమార్, కోనేటి వెంకట్

257
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles