మనుషులే ఆస్తి.. పేదలే నా కుటుంబం


Sun,November 10, 2019 01:45 AM

మనిషికన్నా మిగతా వాటినే ఎక్కువగా ప్రేమిస్తున్న ఈ రోజుల్లో.. మనిషిలో దేవుడిని వెతికిపట్టుకొని పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది మనం సైతం. మనుషులే ఆస్తిగా.. పేదలే కుటుంబంగా బతుకుతున్నది మనం సైతం. ఇదొక ఆపన్న హస్తం. ఓ భరోసా, భవిష్యత్‌పై ఆశ. నిరుత్సాహాన్ని చీల్చుకుంటూ ఉత్తుంగ తరంగంలా బతకాలనే ఓ సంజీవని మనం సైతం. ఇప్పుడీ సంస్థ ద్వారా వందలాది మంది పేదలు నిశ్చింతగా ఉన్నారు. అలాంటి సంస్థకు బీజం వేసి.. కల్పతరువులా మార్చింది మాత్రం సినీనటుడు కాదంబరి కిరణ్. ఆ కల్పతరువు నీడలో నేడు వందలాదిమంది నిర్భయంగా బతుకుతుంటే.. మరెందరో అన్నార్థులు ఆ చెట్టు నీడ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
Manam-Saitham
చాలా సంతోషంగా ఉంది కిరణ్ సార్. మొదటిసారి ఆక్సీజన్ సిలిండర్ లేకుండా ఆస్పత్రికి వచ్చా అంటూ ఉపిరితిత్తుల అభివృద్ధిలేని పదేండ్ల సోమేశ్వర్ చేతులెత్తి నమస్కరిస్తున్నాడు. నా ఫోన్‌లో ఒకటి నొక్కితే కిరణ్‌కు కాల్ వెళ్తుంది. నేను చనిపోయిన తర్వాత నా కొడుకు హోదాలో కిరణే నా దహనసంస్కారాలు చూడాలి అంటూ 50 యేండ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో కోడైరెక్టర్, డైరెక్టర్‌గా చేసిన గార సత్యం మీడియా సాక్షిగా కోరారు. అలాంటి తల్లిదండ్రులు ఎంతోమందిని సంపాదించుకున్నారు కాదంబరి కిరణ్. నేను చచ్చిపోదాం అనుకున్న కిరణన్న. మీరిచ్చిన ధైర్యంతో బతికా. ఇప్పుడు నా రోగం నమయమైంది. ఉద్యోగంలో చేరా.. నా జీతం నుంచి పదివేలు మనం సైతంకు ఇస్తా. కాదనకు అన్న. కష్టం వస్తే.. కన్నీటి కంటే ముందు వస్తాడు కాదంబరన్న అంటూ శ్రావణి చెప్పింది. ఇలా వందలాది మంది బాధితులు మనం సైతం ఫౌండేషన్ ద్వారా సాయం పొంది.. కన్నీరు నిండిన కళ్లతో కృతజ్ఞతలు చెబుతున్నారు. వీరిలో కళాకారులు, సినీ కార్మికులు, నిరుపేదలు, వరద, తుపాను బాధితులు, చేనేత కార్మికులు, ఫుట్‌పాత్‌పై బతికే బడుగు జీవులు ఉన్నారు. ఇంకా చెప్పుకోవాలంటే సాయం కావాలని అడిగిన ప్రతి ఒక్కరికీ చేతనైన సాయం చేసింది మనంసైతం. ఆడపిల్లల పెండ్లికోసం.. విదేశాల్లో ఉన్నతంగా చదవాలనుకునే పేద విద్యార్థులకు సైతం అండగా నిలిచింది.


ఆరోగ్యమే మహాభాగ్యం

మనిషిలోని ఆశలన్నీ సజీవంగా ఉంచేది ఆరోగ్యం. సంపదలెన్ని ఉన్నా.. ఆరోగ్యంగా లేని జీవితం ఓ నిస్సారమైన ప్రయాణం. అందుకే మనం సైతం వారి జీవితాల్లో పునర్జీవాన్ని ఇచ్చే సంజీవనిగా మారింది. నేను చచ్చిపోతా. ఈ బాధపడలేను అనే ఓ చిన్నారి. బతకడం కంటే చావడమే మేలు అనే ఓ కళాకారుడు. నాకష్టాలు మరిపించేందుకు చావు కూడా రావడం లేదు అని బాధపడే ఓ అమ్మ, అక్క, అన్న, చెల్లి.. ఇలా ఎందరినో మనం సైతం అక్కున చేర్చుకున్నది. చేతనైన సాయం చేసింది. వారిలోని నిరుత్సాహాన్ని పారదోలింది. కొత్త జీవితాల్ని పంచింది. విద్య, వైద్యం, ఆరోగ్యమేకాదు.. సమాజంలో ఎలాంటి కష్టమొచ్చినా మనం సైతం ముందుకొచ్చింది. హుదూద్ తుఫాన్ నుంచి మొన్నటి తితిలి తుఫాన్ వరకూ బాధితులకు అండగా నిలిచింది.
Manam-Saitham10

వారధిగా కాదంబరి కిరణ్

సినీనటుడు కాదంబరి కిరణ్ రూపంలో అంకురించి, సమూహంగా మారి, నిస్వార్థ సేవలో నీడనిచ్చే మహావృక్షంగా మనంసైతం ఫౌండేషన్ మారింది. ఇందుకు ఎందరో మహానుభావులు ఆర్థికంగా చేయూత, ప్రోత్సాహం అందించారు. వారు ధారళంగా విరాళాలు ఇవ్వడంతోనే ఈ సేవాయజ్ఞం నేటికీ నిరాటంకంగా కొనసాగుతున్నది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, కళా, సాంస్కృతిక, విద్య, వైద్య వాణిజ్య రంగాలకు చెందిన సేవా తత్పరులు మనంసైతంతో కలిసి ప్రయాణిస్తున్నారు. ఆపదలో ఉన్న ఆదుకోండయ్యా అంటూ వచ్చేవారికి చేతనైన ఆర్థికసాయం చేసి, తోడుగా నిలబడుతున్నారు. ఆర్థికసాయం అందించేవారికి.. సాయంపొందేవారికి మధ్యలో వారధిగా నిలుస్తున్నారు కిరణ్. పేదవాడిని ఆదుకోవడం కోసం అతనొక అడుగు వేస్తే.. అతనితో కలిసి కొన్నివేల అడుగులు పడుతున్నాయి. డబ్బులు సమకూరిన వెంటనే విరాళాలు అందించిన దాతలతో.. బాధితులకు నేరుగా సాయం అందేలా చేయడం ఆయన నిస్వార్థ సేవకు నిదర్శనం.

పేదవారి కోసమే ఈ కార్యచరణ..

పేదవారికి అండగా నిలిచేందుకు భవిష్యత్‌లో శాశ్వత సేవా కార్యక్రమాలు చేపట్టాలని కాదంబరి కిరణ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆరోగ్యం కోసం వైద్య ఆశ్రమం. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే ఈ వైద్య ఆశ్రమం లక్ష్యం. ఇందులో డబ్బు కాకుండా జబ్బుకు ప్రాధాన్యం ఇస్తారు. డాక్టర్ పేరెంట్ అవ్వాలని, పేషెంట్ పసిపాపల సేదదీరాలని, వైద్యమంతా ఉచితంగా జరగాలనేది వైద్య ఆశ్రమం లక్ష్యం. ఆనందాశ్రమంలో బలవంతంగా అనాథలుగా మార్చబడుతున్న వృద్ధులుంటారు. బతికినన్నాళ్లూ పిల్లల కోసం కష్టపడి.. అవసాన దశలో కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు పట్టించుకోకపోవడంతో అనాథలుగా మిగిలిపోతున్నారు. వారు మరణశయ్యపైకి వచ్చేవరకూ ప్రతిరాత్రి హాయిగా గుండెలపై చేయి వేసుకొని నిద్రపోవాలి. ఇక నాధాశ్రమం ఇది అనాథల కోసం. అనాథలను గుర్తించి, చేరదీసి, చదివిస్తారు. వారికి చదువు రాకపోతే ఇండస్ట్రీలో 24 విభాగాల్లో ఎక్కడో ఒకచోట పని కల్పిస్తారు. ఆనందాశ్రమంలోని వృద్ధులకు ఈ అనాథపిల్లలే కొడుకులు, కూతుళ్లు కావాలనేది కాదంబరి సంకల్పం. ఈ మూటింటిని ఒకే ప్రాంగణంలో నెలకొల్పి.. పేదలకు సేవ చేయాలనేది లక్ష్యం. అందులోనే ప్రశాంతంగా కన్నుమూయాలన్నది కాదంబరి చివరి కోరిక.
Manam-Saitham7

మనకు తెలియని కాదంబరి

సినిమాల్లో కామెడీ పాత్రలు చేస్తూ.. కడుపుబ్బా నవ్వించే కాదంబరిలో.. ఇదొక మానవీయ కోణం. నా ఒళ్లంతా రక్తపు గాయాలే. అవకాశం కోసం వెళ్లిన ప్రతిచోట దెబ్బతిన్నా అంటూ కాకినాడ నుంచి హైదరాబాద్ వరకు జరిగిన తన సినీ ప్రయాణాన్ని పంచుకున్నారు కిరణ్. 13వ యేటనే కాకినాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చి, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సీనియర్ కరెస్పాండెంట్ జి.కృష్ణ దగ్గర శిష్యరికం తీసుకున్నారు. సీనీరంగంలో స్థిరపడాలని రంగస్థలం నుంచి దూరదర్శన్‌కు, అక్కడి నుంచి వెండితెర వరకూ వచ్చారు. టెలివిజన్ రంగంలో రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా, దర్శకుడిగా నిలదొక్కుకున్నారు. ఒక్కసారిగా తన దిశను మార్చుకొని.. తెలిసిన పరిచయాలతో డబ్బులు తీసుకొచ్చి పేదవారి వైద్యానికి అందించేవారు. అలా 2014 సెప్టెంబర్ 22న మనం సైతం ఫౌండేషన్‌ను ప్రారంభించారు కిరణ్. దీని ద్వారా దాదాపు వేయి మంది వరకు సాయం అందించారు.

చాలాఫైల్స్ పెండింగ్‌లోనే..

సాయం కావాలని వెళ్లిన ప్రతీసారి మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి ప్రభుత్వ ప్రతినిధులు ఎన్నో కేసుల్లో సహాయం చేశారు. వారి ప్రోత్సాహం మర్చిపోలేనిది. వారేకాకుండా ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి చెందినవారు, ఎన్‌ఆర్‌ఐలు, వ్యాపారవేత్తలు ఇప్పటి వరకు సాయం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం సాయం కోరేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నది. చాలాఫైల్స్ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆదుకునే దాతలు కావాలి.
- కాదంబరి కిరణ్, సినీనటుడు, మనం సైతం ఫౌండర్
Manam-Saitham1

సహాయం చేయండి సార్..

పేదరికం నిర్మూలించడం మన తరం కాదు. కానీ పేదవాడి పక్షాన నిలబడి తన గుండెల నిండా ధైర్యం నింపడమే మనంసైతం ధ్యేయమని అంటున్నారు కాదంబరి కిరణ్. అందరూ ఏదో ఒక రోజు ఈలోకాన్ని విడిచే వాళ్లే. మట్టిమంచంలో శాశ్వతంగా నిద్రపోయే ముందు పేదవాడి కళ్లలో చిన్నపాటి ఆశ, తృప్తి, ధైర్యం ఇచ్చేందుకు మనవంతుగా సాయం చేయమని అడుతున్నారు కాదాంబరి. ఒక వ్యక్తిగా సహాయం చేయడం వేరు. ఒక శక్తిగా నలుగురిని కూడగట్టుకొని సహాయం చేయడం వేరు. అందుకే సహాయం చేద్దాం అంటూ తన రెండు చేతులు జోడిస్తున్నారు కాదంబరి. మనం సైతం ఫౌండేషన్ ముందుకు సాగడానికి ఆర్థికసాయం ఎంతో అవసరం.

ఆర్థికసాయం అందించాలనుకుంటే..

ACCOUNT NUMBER: 112211100004641
IFSC CODE: ANDB0001122
BANK NAME: ANDHRA BANK
BRANCH: FILM NAGAR
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ www.manamsaitham.org ,
9949009989 నంబర్‌ను సంప్రదించండి

- డప్పు రవి
-సీఎం ప్రవీణ్‌కుమార్
Manam-Saitham2
Manam-Saitham3
Manam-Saitham5
Manam-Saitham6
Manam-Saitham4
Manam-Saitham8
Manam-Saitham11
Manam-Saitham9

554
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles