ఆ వ్యక్తికోసం వెయిటింగ్!


Sun,November 10, 2019 01:39 AM

కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేసింది పంజాబీ ముద్దుగుమ్మ మెహరీన్. అనతికాలంలోనే దక్షిణాదిగా వరుస అవకాశాలతో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఈ సుందరి చేతిలో ఆరు సినిమాలున్నాయి. నేను విధిని బలంగా విశ్వసిస్తాను. అదే సమయంలో వృత్తిలో రాణించాలంటే ప్రతిభకు మెరుగులు దిద్దుకోవాలి. సంసిద్ధంగా ఉన్నవారినే అదృష్టం వరిస్తుందనే ఫిలాసఫీని నేను బలంగా విశ్వసిస్తాను అని చెబుతున్నది ఈ అమ్మడు. తన మూడేండ్ల సినీప్రయాణం గురించి మెహరీన్ చెప్పిన ముచ్చట్లివి..
Mehrene-Kaur-Pirzada

ఈ మూడేండ్ల సినీ ప్రయాణాన్ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తున్నది?

ఏదో సాధించాం..ఇక చాలులే అనుకుంటే ఏ వృత్తిలోనూ పరిపూర్ణత సాధించలేం. నిరంతరం జిజ్ఞాసతో జీవితాన్ని గడపాలన్నదే నా సిద్ధాంతం. ప్రయత్నం ఆపిన రోజునే మన పతనం ఆరంభమవుతుంది. ఇప్పటివరకు చేసిన సినిమాలతో నటిగా ఎంతో నేర్చుకున్నాను. మరింత పరిణతి చెందాల్సిన అవసరం ఉంది. అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని నాకంటూ తెలుగు చిత్రసీమలో ఓ ప్రత్యేకత సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తా.

ఎఫ్-2 విజయం తర్వాత నాయికగా అవకాశాలు ఎక్కువయ్యాయని చెబుతున్నారు?

నిజమే. ఇప్పుడు నా డేట్స్ ఖాళీలేవు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను. ఈ ఏడాది ఆరు సినిమాల్ని అంగీకరించాను. ఇప్పటికే రెండు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. నాలుగు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

కెరీర్ తొలిదశతో పోల్చుకుంటే కథాంశాల ఎంపికలో మీ అభిరుచులు ఏమైనా మారాయా?

అరంగేట్రం నుంచే కథల ఎంపికలో నాకంటూ కొన్ని ప్రమాణాల్ని నిర్దేశించుకున్నాను. మనసుకు నచ్చిన ఇతివృత్తాల్నే ఎంచుకుంటున్నాను. నేను కథ వినేటప్పుడే ఓ ప్రేక్షకురాలి దృష్టికోణం నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. నా పాత్ర చిత్రణలో అభినయానికి ఆస్కారం ఉంటేనే ఒప్పుకుంటాను. చాణక్య సినిమా స్పై థ్రిల్లర్ కథాంశం. మునుపెన్నడూ లేనివిధంగా భిన్న పార్శాల్లో నా పాత్ర సాగుతుంది. కల్యాణ్‌రామ్‌తో నటిస్తున్న ఎంతమంచి వాడవురా సినిమాలో కూడా నా పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. సంక్రాంతికి ఆ సినిమాతో ప్రేక్షకులముందుకొస్తా.

ప్రస్తుతం నాయికలు మహిళా ప్రధాన ఇతివృత్తాలపై మొగ్గుచూపుతున్నారు. మీకు అలాంటి పాత్రలు చేసే ఆలోచన ఏమైనా ఉందా?

తమన్నా, అనుష్క, సమంత తరహాలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనివుంది. అయితే కెరీర్‌లో కొంత అనుభవం గడించిన తర్వాత అలాంటి శక్తివంతమైన పాత్రలు చేస్తే ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారు. కెరీర్ ఆరంభదశలో ఉన్నాను కాబట్టి నటిగా పరిణతి సాధించడంపైనే దృష్టిపెట్టాను. నిన్న కంటే ఈరోజు ఎంత ఎదిగామన్నది ఇప్పుడు ముఖ్యమనుకుంటున్నాను. భవిష్యత్తులో తప్పకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తాను.

హిందీ చిత్రసీమకు దూరంగా ఉండడానికి కారణమేమిటి?

వచ్చే ఏడాది వరకు నా డేట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. దక్షిణాదిన మంచి అవకాశాలొస్తున్నాయి. తెలుగు, తమిళంతో పాటు నా మాతృభాష పంజాబీలో కూడా రెండు సినిమాలు చేస్తున్నాను. మంచి స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా హిందీలో సినిమా చేస్తాను.

ఎప్పుడైనా కథ నచ్చకుంటే సిసినిమాను తిరస్కరించిన సందర్భాలున్నాయా?

నా అభిరుచులకు తగినట్లు, నటనకు అవకాశం ఉండే పాత్రల్నే ఎంచుకుంటున్నాను. కథల ఎంపికలో నా హృదయం ఏం చెబితే అదే చేస్తాను. ఒక్కోసారి కథ విషయంలో ఏమైనా సందేహాలుంటే నా మేనేజన్, కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను. అయితే చివరగా అంతిమ నిర్ణయం మాత్రం నేనే తీసుకుంటాను.

పరిశ్రమలో ప్రతిభతో పాటు అదృష్టం ఉండాలంటారు...?

ఒక్క సినీరంగంలోనే కాదు...ఏ వృత్తిలోనైనా రాణించాలంటే ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కలిసిరావాలి. అయితే కేవలం లక్‌ను నమ్ముకొని ఉంటే సరిపోదు. నేను వ్యక్తిగతంగా విధిని విశ్వసిస్తాను. మనకు రాసిపెట్టుంది మనకే దక్కుతుందని నమ్ముతాను. అయితే మన కలల్ని సాఫల్యం చేసుకోవాలంటే నిరంతర కృషి, తపనతో పనిచేయాలి. సరైనా సమయం కోసం నిరీక్షించే సహనం కూడా ఉండాలి.

విరామ సమయాల్లో మీ లైఫ్‌ైస్టెల్ ఎలా ఉంటుంది?

ట్రావెలింగ్‌ను నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఇంటి దగ్గర వుంటే మాత్రం డిజిటల్ ప్లాట్‌పామ్స్‌లో వచ్చే సినిమాలు, సిరీస్‌లు చూస్తాను. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతాను. నేను అమెరికాలో పుట్టాను. కొంతకాలం అక్కడే ఉన్నాను. అక్కడి అందమైన పర్యాటక ప్రదేశాలు చాలా ఇష్టం. యూరప్‌లో విహారాన్ని కూడా ఆస్వాదిస్తా. ఇప్పటికీ చాలా దేశాల్ని సందర్శించాను.

నాయికగా మీ డ్రీమ్‌రోల్ ఏమైనా ఉందా?

రంగస్థలం, మహానటి, ఫిదా, బాహుబలి సినిమాల్లో సమంత, కీర్తిసురేష్, సాయిపల్లవి, అనుష్కల అభినయం నన్ను అమితంగా ఆకట్టుకుంది. ఎంతో అదృష్టం ఉంటే కానీ అలాంటి పాత్రలు దక్కవు. భవిష్యత్తులో అలాంటి సవాలుతో కూడిన పాత్రలు చేయాలని వుంది.

ప్రేమ, పెళ్లి గురించి మీ అభిప్రాయాలు చెప్పండి?

ఇప్పుడే కెరీర్‌లో స్థిరపడుతున్నాను. ప్రేమ గురించి ఆలోచించే తీరక లేదు. అయితే నేను ఇష్టపడే అబ్బాయి మంచి మనసున్నవాడై ఉండాలి. తనని తాను ప్రేమించుకుంటూ ఎదుటివారిని గొప్పగా గౌరవించే మనస్తత్వం ఉండాలి. అతడి వృత్తి ఏదైనా అతడి గుణానికే నేను ప్రా ముఖ్యమిస్తాను. దేవుడు అలాంటి వ్యక్తిని నాకోసం ఎప్పుడు పంపిస్తాడో ఎదురుచూడాలి (నవ్వుతూ).

నటనాపరంగా ఎవరిని స్ఫూర్తిగా తీసుకుంటారు..మీ ఆరాధ్యనాయికలు ఎవరు?

దక్షిణాదిన అనుష్క, సమంత, తమన్నా అంటే బాగా ఇష్టం. హిందీలో కంగనారనౌత్‌ను స్ఫూర్తిగా తీసుకుంటాను. ఇక నా ఆల్‌టైమ్ ఫేవరేట్ కథానాయిక కాజోల్.

కృష్ణగాడి వీరప్రేమగాథ, మహానుభావుడు, ఎఫ్-2 చిత్రాలు నా కెరీర్‌లో గుర్తుండిపోతాయి. ఆ సినిమాల్లో పాత్రలపరంగా వైవిధ్యాల్ని కనబరిచే అవకాశం దక్కింది. సినిమాలో కనిపించే నిడివి కంటే పాత్ర ప్రభావం ఎంత అనే విషయానికే నేను ప్రాధాన్యమిస్తా.

ఎఫ్-2 సినిమాలో పోషించిన హనీ పాత్ర వ్యక్తిగతంగా నాకు బాగా నచ్చింది. అందులో నాలోని వినోదకోణాన్ని ఆవిష్కరించే అవకాశం దక్కింది. ఆ సినిమాలో నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఎఫ్-2 ఎందరో కొత్త అభిమానుల్ని సంపాదించిపెట్టింది. ఆ సినిమాకు సీక్వెల్ తీస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నా.

-కళాధర్ రావు
-సీఎం ప్రవీణ్‌కుమార్

767
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles