పనిమనిషి కష్టాలు తీర్చింది


Sun,November 10, 2019 01:34 AM

ఇంటి మనిషికి కష్టం వస్తే పట్టించుకునే దిక్కు లేదు. అలాంటిది ఈ యజమాని తన పనిమనిషి జీవనోపాధి కోసం తెలివైన ఆలోచన చేసింది. ఆమె ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు యజమాని చేసిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ ఆలోచనను అంతా ప్రశంసిస్తున్నారు.
Pani-Manishi
పుణేకు చెందిన ధనశ్రీ షిండే అనే బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వద్ద గీతా కాలే అనే మహిళ పనికి కుదిరింది. నాలుగు ఇండ్లలో పని చేసుకుంటూ గీతా తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేది. ఎప్పుడూ చలాకీగా పనిచేసే గీతా.. ఓ రోజు దీనంగా కనిపించింది. గమనించిన ధనశ్రీ.. ఏం జరిగిందోనని ఆరా తీసింది. గీతా పనిచేసే మరో ఇంట్లో తనను ఉద్యోగం నుంచి తీసేశారని దీనంగా చెప్పింది. అందువల్ల నెలకు రూ.4000 ఆదాయం పోయిందని ఇప్పుడు తన కుటుంబ పోషణ కష్టంగా మారుతుందని వాపోయింది. ఆమె మాటలకు వెంటనే ఓ ఉపాయాన్ని ఆలోచించింది ధనశ్రీ. వెంటనే ఓ బిజినెస్ కార్డును రెడీ చేయించింది. అందులో అంట్లు తోమడానికి నెలకు రూ. 800, ఇల్లు ఊడ్వటానికి రూ. 800, బట్టలు ఉతకడానికి రూ. 800, రొట్టెలు చేసేందుకు రూ.1000 అంటూ పోస్టు పెట్టి కావాల్సిన వారు సంప్రదించాలని తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ఆ పోస్టును అస్మితా జవదేవకర్ అనే నెటిజన్ షేర్ చేయడంతో చాలామంది ఫోన్లు చేయడం ప్రారంభించారు. పని కోల్పోయానని బాధపడుతున్న గీతా కాలేకు చాలా సులువుగా మళ్లీ పని దొరికింది. తనకు మరో నాలుగు చోట్ల పని రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నది. పనిమనిషి కోసం ధనశ్రీ చేసిన ఆలోచన సూపర్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

869
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles