కళాకారుల కోసం..


Fri,November 8, 2019 01:22 AM

అందరిలాగే ఆమెకూడా ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. కానీ అందరిలా కాకుండా కాస్త వినూత్నంగా సేవలందిస్తున్నది. చిన్నప్పుడు ఆమెకున్న కళను ప్రదర్శించడానికి సరైన వేదిక దొరకలేదు. సరిగ్గా అదే సమస్య ఎదుర్కొనే వాళ్లు చాలామందే ఆమెకు ఎదురయ్యారు. వారందరికీ తానే ఓ వేదికను అందించాలనుకుంది. 25 ఏళ్లుగా యువ కళాకారులను సమాజానికి పరిచయం చేస్తున్నది.
veena
వీణది కేరళలోని తిరువనంతపురం. ఐదుగురు తోబుట్టువులు. అందరిలోనూ వీణ చిన్నమ్మాయి. తన అక్కకు నృత్యమంటే ప్రాణం. తండ్రి అది గమనించాడు. గురువును ఏర్పాటు చేసి ఇంటివద్దే నృత్యం నేర్పించాడు. దూరం నుంచి గమనించి రోజూ సాధన చేసేది వీణ. అలా నృత్యంలో పట్టు సాధించింది. అయితే వీణ వాళ్ల అక్కకు ప్రతిభను ప్రదర్శించడానికి సరైన వేదిక దొరకలేదు. అది చాలామందికి ఎదురయ్యే సమస్యే. కళాకారులు ప్రదర్శించడానికి వేదికను ఇవ్వాలనే ఆలోచనలో వీణ ఉండేది. 25 ఏళ్ల క్రితం భర్తతో పాటు కువైట్ వెళ్లింది. అక్కడ చాలామంది నిరుపేద కళాకారులు, కళను నమ్ముకున్న వారు ఆమెకు ఎదురయ్యారు. వారికి సరైన అవకాశం రావడం లేదని ఆమె గ్రహించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు సముద్ర ఆర్ట్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి సంస్థ ఆధ్వర్యంలో 25 దేశాల్లో కళాకారులతో ప్రదర్శనలు ఇప్పిస్తున్నది. నృత్యం, మిమిక్రీ, వాయిద్యం ఇతర కార్యక్రమాలకు స్థానిక ప్రభుత్వ పెద్దలను, వివిధ రంగాల్లో ఉన్నవారినీ ఆహ్వానిస్తున్నది. ఈ కార్యక్రమం ద్వారా కళాకారులకు వేదికను పరిచయం చేస్తున్నది. ఇరు దేశాల కళాకారులకు పరస్పర సంబంధాలు ఉండేలా ప్రయత్నిస్తున్నది. వివిధ కళల్లో రాణించే వారికి అవకాశాలు కూడా ఇప్పిస్తున్నది. ఇలా యువ కళాకారులకు వీణ ఓ వేదికను పంచుతున్నది.

170
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles